Income Tax: రాష్ట్రపతి ప్రసంగంలో సంచలన విషయాలు
దేశ ఆర్థిక దిశను నిర్ణయించే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలు, భవిష్యత్ లక్ష్యాలను ఆమె ప్రసంగంలో ప్రస్తావించారు. 2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
వందేమాతరం గీతం రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశభక్తి భావాలను గుర్తుచేసిన రాష్ట్రపతి, స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందరికీ చేరాలన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను స్మరించారు. బిర్సా ముండా, సర్దార్ వల్లభాయ్ పటేల్‌లకు నివాళులు అర్పించడంతో పాటు భారతరత్న భూపేన్ హజారికా శతజయంతిని కూడా గుర్తు చేశారు.

పేదరిక నిర్మూలనలో కీలక అడుగులు
గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించామని రాష్ట్రపతి వెల్లడించారు. పేదల కోసం నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, 'హౌసింగ్ ఫర్ ఆల్' లక్ష్యం దిశగా ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. జన్ ధన్ ఖాతాలు, నేరుగా నగదు బదిలీ విధానం ద్వారా సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరుతోందని వివరించారు. 'వికసిత్ భారత్' నిర్మాణంలో రైతులు, మహిళలు, యువత కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్రపతి తెలిపారు.
గ్యాస్, నీరు, వైద్య సేవల్లో విస్తరణ
దేశవ్యాప్తంగా 100 కోట్లకుపైగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించామని రాష్ట్రపతి తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా కోట్లాది కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద కోట్ల మందికి ఉచిత వైద్య సేవలు అందుతున్నాయని, సికిల్ సెల్ వంటి వ్యాధుల నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు. కరోనా తర్వాత ఆరోగ్య బీమాపై ప్రజల్లో అవగాహన గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.
రవాణా, మౌలిక సదుపాయాల్లో వేగం
దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్రపతి చెప్పారు. ప్రస్తుతం దేశంలో 150కి పైగా వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, వందే భారత్ స్లీపర్ రైలును బెంగాల్‌లో ప్రారంభించినట్లు వెల్లడించారు. న్యూఢిల్లీ నుంచి మిజోరాం రాజధాని ఐజ్వాల్‌కు నేరుగా రైలు కనెక్టివిటీ కల్పించామని తెలిపారు. అమృత్ భారత్, వందే భారత్ రైళ్ల ద్వారా ప్రయాణికుల సేవలు మరింత విస్తరించాయని చెప్పారు.
వ్యవసాయం, పరిశ్రమలు, ఎగుమతుల్లో పురోగతి
వరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్రపతి తెలిపారు. ఆక్వా రంగంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని చెప్పారు. తయారీ రంగంలో చేపట్టిన కీలక సంస్కరణల వల్ల దేశ ఎగుమతులు భారీగా పెరిగాయని వివరించారు. స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో భారత్ వేగంగా దూసుకెళ్తోందని, ఆధునిక టెక్నాలజీ పవర్ హౌస్‌గా దేశాన్ని మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పన్ను సంస్కరణలు, శక్తి రంగంలో మార్పులు
ఇన్‌కమ్ ట్యాక్స్ వ్యవస్థలో కీలక సంస్కరణలు చేపట్టామని రాష్ట్రపతి చెప్పారు. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు కల్పించడంతో మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన మేలు జరిగిందన్నారు. పీఎం సూర్యఘర్ యోజన ద్వారా సామాన్య ప్రజలే విద్యుత్ ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నారని తెలిపారు. భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకు వెళ్తోందని రాష్ట్రపతి వెల్లడించారు. అంతరిక్ష పరిశోధనలతో పాటు స్పేస్ టూరిజంలోనూ అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుభాన్షు శుక్లాను అభినందించారు.
LIVE: President Droupadi Murmu addresses the Parliament https://t.co/Fa7y5xNsxO
— President of India (@rashtrapatibhvn) January 28, 2026












Click it and Unblock the Notifications