Independence Day 2024: మోడీ మరో రికార్డు, స్వాతంత్ర్య దినోత్సవానికి అతిథులు వీరే
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 78వ స్వాతంత్ర్య వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటలో గురువారం జరిగే ఈ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి వేడుకలు జరగనున్నాయి. కాగా, ప్రధాని మోడీ 11వ సారి త్రివర్ణ పతకాన్ని ఎగురవేయనున్నారు. ఈ ఏడాది వేడుకలకు దాదాపు ఆరు వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించినట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.
వీరిలో రైతులు, యువత, మహిళలు, గిరిజన సంఘాల నాయకులు సహా అనేక మందికి ఆహ్వానం పంపారు. జాతీయ ఉత్సవాల్లో ప్రజా భాగస్వామాన్ని పెంచాలనే లక్ష్యంతో 6 వేల మందికి ఆహ్వానం పంపినట్లు కేంద్రం తెలిపింది. కాగా, 2047 వికసిత్ థీమ్‌తో ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలు జరగనున్నాయి. భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ వేడుకలు పునరుత్తేజాన్ని అందిస్తాయని కేంద్రం పేర్కొంది.

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మొత్తం 117 మంది అథ్లెట్లు కూడా స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను 11 బృందాలుగా విభజించారు. ఈ వేడుకల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 2 వేల మంది సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేయనున్నారు.
గురువారం (ఆగస్టు 15న)ఉదయం ఎర్రకోట వద్దకు చేరుకోనున్న ప్రధాని మోడీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని అధికారిక బృందం స్వాగతం పలకనుంది. అనంతరం రక్షణ దళాలు ఇచ్చే గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఎగురవేయనున్నారు. ఈ క్రమంలో రెండు అధునాతన తేలికపాటి ధ్రువ్ హెలికాప్టర్లు పూల వర్షాన్ని కురిపించనున్నాయి. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.
మోడీ రికార్డు
కాగా, వరుసగా పదేళ్లు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా ఇప్పటికే నరేంద్ర మోడీ నిలిచారు. నేడు 11వ సారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మరో రికార్డును సృష్టించనున్నారు.
నెహ్రూ తర్వాత ఎక్కువసార్లు జెండా ఎగురవేసిన ప్రధానిగా మోడీ నిలవనున్నారు. గత ఏడాది 90 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడిన ఆయన.. పంద్రాగస్టు ప్రసంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు 10 సార్లు మోడీ ప్రసంగించగా సగటు సమయం 82 నిమిషాలుగా ఉంది. దేశ చరిత్రలో ఇతర ప్రధానులు మాట్లాడిన సగటు ప్రసంగ సమయం కంటే ఇది ఎక్కువ కావడం విశేషం. దీంతో గురువారం నాటి ప్రధాని మోడీ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications