కాంగ్రెస్ కు ఇండియా కూటమి బిగ్ షాక్- ఆ పార్టీకే ఓటు..!
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్దాయిలో ఐక్యంగా ఉంటూ రాష్ట్రాల్లో పరస్పరం సహకరించుకునేందుకు విపక్ష పార్టీలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమి మరోసారి వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణం ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలే. హస్తినలో జరిగే ఈ పోరులో ఇండియా కూటమి పార్టీలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, ఆప్ లలో ఒకరికి అండగా నిలవాల్సిన పరిస్ధితులు ఏర్పడ్డాయి. దీనికి కారణం ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తుండటమే.
దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలన్న అంశంలో ఇండియా కూటమి పార్టీలకు సహజంగానే ఆప్ మంచి ఛాయిస్ గా కనిపిస్తోంది. దీంతో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో పాటు ఇతరులు కూడా ఇప్పుడు ఆప్ కే మద్దతు ప్రకటిస్తున్నారు. మొహమాటానికి కూడా కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు వీరు ముందుకు రావడం లేదు. దీంతో జాతీయ స్ధాయిలో పరిస్ధితి ఎలా ఉన్నా ఢిల్లీ వరకూ మాత్రమే ఆప్ కింగ్ అన్న విషయం తేలిపోయింది.

మరో రకంగా చెప్పాలంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమిలో లుకలుకల్ని బయటపెడుతున్నాయి. ఢిల్లీలో బలంగా ఉన్న ఆప్ కు మద్దతివ్వాలన్న నిర్ణయం సరైనదే అయినా జాతీయ స్ధాయిలో మెరుగ్గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా వీలైనంత వరకూ అండగా నిలుస్తామని చెప్పకుండా ఏకపక్షంగా ఆప్ కే ఆయా పార్టీలు మద్దతివ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే నేషనల్ కాన్ఫరెన్స్ వంటి మరికొన్ని పార్టీలు మాత్రం ఢిల్లీ ఎన్నికల్లో వీళ్లిద్దరికీ మద్దతిచ్చేది లేదని తేల్చిచెప్పేస్తున్నాయి.
ఇండియా కూటమి చివరి సమావేశం జూన్ 1న లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ముందు జరిగిందని, అందులో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ చెప్తున్నారు. శివసేన ఉద్ధవ్ వర్గం మాత్రం ఢిల్లీ పోరు ఆప్, బీజేపీ మధ్యనే ఉందని, అందుకే తాము కేజ్రివాల్ కు అండగా నిలిచినట్లు చెబుతోంది. మిగతా పార్టీలు కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉండటంతో ఇండియా కూటమి గెలుపు గుర్రమైన ఆప్ కు అండగా నిలవడం ఎవరికీ తప్పుగా అనిపించడం లేదు.












Click it and Unblock the Notifications