చైనా దుస్సాహసంపై భారత్ వార్నింగ్..! గీత దాటాలనుకుంటే ఇక..!
అరుణాచల్ ప్రదేశ్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు, భారత సైనికులతో నిత్యం ఘర్షణలకు దిగుతున్నట్లు ఇవాళ ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ (ITBP) డీజీ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. సరిహద్దుల్లో ఇంత జరుగుతుంటే మోడీ సర్కార్ మౌనంగా ఉండిపోవడం ఏంటని విపక్షాలు ప్రశ్నించాయి. దీంతో విదేశాంగశాఖ సాయంత్రానికి ఈ వ్యవహారంపై ఓ ప్రకటన చేసింది. అందులో చైనా చర్యల్ని తప్పుబడుతూనే డ్రాగన్ కంట్రీకి కీలక హెచ్చరికలు చేసింది.
ఇవాళ జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో భారత్-చైనా సరిహద్దు ఘర్షణలపై (India-China Border Tensions) విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. చైనా సైనికులు నిర్దేశిత పెట్రోలింగ్ విధానాల నుంచి వైదొలిగినప్పుడు భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో అప్పుడప్పుడు పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయని పేర్కొన్నారు. భారత్-చైనా సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు ఇరు దేశాలు ఇప్పటికే ఉన్న దౌత్య, సైనిక వ్యవస్థల ద్వారా చర్చలు కొనసాగిస్తున్నాయని తెలిపారు.

వాస్తవాధీన రేఖ వెంబడి అపార్థాలు, తప్పుడు అంచనాలు ఏర్పడకుండా చూసుకోవడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మెరుగైన సరిహద్దు నిర్వహణ కోసం, అవసరమైన ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖపై పరస్పర అవగాహన పెంచుకునే మార్గాలపై చర్చించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని తెలిపారు.భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కొనసాగడం ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధికి అత్యంత అవసరమని విదేశాంగ శాఖ హెచ్చరించింది. మరోవైపు ప్రధాన విపక్షం కాంగ్రెస్ ఈ వ్యవహారంపై మోడీ సర్కార్ తక్షణం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, చైనాకు పదేపదే క్లీన్‌చిట్‌లు ఇవ్వడం ఇక చాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని కోరారు. నెల రోజుల క్రితమే ఇరు దేశాల మధ్య చర్చలు జరగడం, బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ హాజరైన నేపథ్యంలో తాజా పరిణామాలపై మరింత దూకుడుగా స్పందించేందుకు కేంద్రం సిద్దంగా లేనట్లు తెలుస్తోంది.














Click it and Unblock the Notifications
