ఇండియాను కుదిపేసిన తొక్కిసలాటలు: వందలాది ప్రాణాలు బలి!
Year Ender 2025: 2025 సంవత్సరం ఇండియాలో వరుసగా జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనలతో ఓ చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. మతపరమైన వేడుకలు, ర్యాలీలు, క్రీడా విజయోత్సవాలు, రవాణా కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలు వందలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఈ ఘటనలన్నీ భారీ జన సమూహాలను నిర్వహించడంలో మనం దేశంలో ఉన్న తీవ్ర లోపాలు, అత్యవసర సంసిద్ధత లేమిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 2025లో ఇండియాలో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనల గురించి తెలుసుకుందాం.
1. రాజకీయ ర్యాలీ తొక్కిసలాట: కరూర్, తమిళనాడు (సెప్టెంబర్ 27)
మరణాలు: 31 మంది (కొన్ని నివేదికల ప్రకారం 41)
ప్రదేశం: కరూర్, తమిళనాడు
వివరాలు: టీవీకే(తమిళగ వెట్రి కజగం) పార్టీ అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన రాజకీయ ర్యాలీకి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. నాయకుడి కాన్వాయ్ వైపు ఒక్కసారిగా జనం దూసుకురావడంతో ఈ ఘోరమైన తొక్కిసలాట జరిగింది. ఈ సంవత్సరం జరిగిన తొక్కిసలాటల్లో ఇదే అత్యంత ఘోరమైనదిగా నిలిచింది.

2. ప్రయాగ్ మహా కుంభమేళా తొక్కిసలాట: ప్రయాగ్‌రాజ్, ఉత్తర ప్రదేశ్ (జనవరి 29)
మరణాలు: 30 మంది
ప్రదేశం: ప్రయాగ్‌రాజ్, ఉత్తర ప్రదేశ్
వివరాలు: మౌని అమావాస్య రోజున 'అమృత్ స్నానం' కోసం భక్తులు భారీ సంఖ్యలో సంగమం వైపు వెళుతుండగా, అడ్డంకులు కూలిపోయి, ఈ తొక్కిసలాట జరిగింది. దాదాపు 30 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు.
3. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఢిల్లీ (ఫిబ్రవరి 15)
మరణాలు: 18 మంది
ప్రదేశం: ఢిల్లీ రైల్వే స్టేషన్ (ప్లాట్‌ఫారమ్‌లు 14-15 మధ్య ఫుట్‌బ్రిడ్జి)
వివరాలు: రద్దీగా ఉన్న ఫుట్‌బ్రిడ్జిపై ప్రయాణికులు జారిపోవడం, ప్లాట్‌ఫారమ్ అనౌన్స్‌మెంట్లలో గందరగోళం కారణంగా ఒక్కసారిగా తోపులాట జరిగింది. మరణించిన వారిలో పిల్లలు కూడా ఉన్నారు. మరణించిన వారిలో ఎక్కువ మంది మహా కుంభమేళాకు వెళ్తున్న యాత్రికులే.
4. ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ తొక్కిసలాట: బెంగళూరు (జూన్ 4)
మరణాలు: 11 మంది
ప్రదేశం: చిన్నస్వామి స్టేడియం వెలుపల, బెంగళూరు
వివరాలు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా జరిగిన విజయోత్సవ వేడుకలకు అంచనాకు మించి 3 నుంచి 5 లక్షల మంది అభిమానులు వచ్చారు. అతిరద్దీ, సరైన నియంత్రణ చర్యలు లేకపోవడం వల్ల తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. ఈ ఘటనకు ఫ్రాంచైజీ చేసిన తీవ్ర లోపాలు, నిర్వహణ లోపాలే కారణమని కర్ణాటక హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం పేర్కొంది.
5. వెంకటేశ్వర స్వామి ఆలయం తొక్కిసలాట: శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ (నవంబర్ 1)
మరణాలు: 9 మంది
ప్రదేశం: కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా
వివరాలు: ఏకాదశి సందర్భంగా దేవాలయం ఇరుకైన ప్రవేశ/నిష్క్రమణ మార్గంలో భక్తుల రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. సరైన ప్రణాళిక లేకపోవడం, జన ప్రవాహ హెచ్చరికలు లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని బాధితులు ఆరోపించారు.
6. తిరుమల ఆలయ టికెట్ తొక్కిసలాట: తిరుమల కొండలు, ఆంధ్రప్రదేశ్ (జనవరి 8)
మరణాలు: 6 మంది
ప్రదేశం: తిరుమల కొండలు
వివరాలు: వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం భక్తులు వేచి ఉండగా.. గేట్లు హఠాత్తుగా తెరవడంతో తొక్కిసలాట జరిగింది. ఆరుగురు భక్తులు మరణించారు. ఎక్కువసేపు నిరీక్షించడం, గేట్లను ఆకస్మికంగా తెరవడం ఈ తోపులాటకు దారితీసింది.
7. జగన్నాథ రథయాత్ర తొక్కిసలాట: పూరీ (జూన్ 29)
మరణాలు: ముగ్గురు
ప్రదేశం: పూరీ, ఒడిశా
వివరాలు: వార్షిక రథయాత్ర సందర్భంగా, ఊరేగింపు మార్గం దగ్గర ఒక్కసారిగా రద్దీ పెరగడంతో తోపులాట జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు మరణించారు. ఈ విషాదాలన్నీ భారీ జనసమూహాల నిర్వహణలో మెరుగైన ప్రణాళిక, అత్యవసర సంసిద్ధత ఎంత అవసరమో స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications