భారత్ పై క్రూడాయిల్ వర్షం కురిపిస్తున్న రష్యా
మనదేశానికి ముడి చమురు (Crude oil) దిగుమతుల్లో ఒపెక్ (OPEC) దేశాల వాటా తగ్గుతోంది. ఏప్రిల్ నెలలో మొత్తం దిగుమతుల్లో ఒపెక్ దేశాల వాటా 46 శాతానికి చేరింది. రష్యా నుంచి చమురు చౌకగా వస్తుండటంతో వాటి వాటా తగ్గింది. ఎనర్జీ కార్గో ట్రాకర్ వొర్టెక్సా గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేశాయి.
చమురు ఎగుమతి చేసే దేశాల ఆర్గనైజేషన్‌ను ఒపెక్ అని పిలుస్తారు. మధ్యప్రాచ్యంతోపాటు, ఆఫ్రికా దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. చమురు దిగుమతులపై ప్రధానంగా ఆధారపడే మన దేశం.. మొదటి నుంచీ ఈ దేశాల నుంచే క్రూడాయిల్‌ను కొనుగోలు చేస్తోంది. 2022 ఏప్రిల్ ఈ దేశాల వాటా 72 శాతంగా ఉండేది. సంవత్సరం తిరగకముందే 46 శాతానికి పడిపోయింది.

రష్యా ఎంట్రీతో మారిన సీన్:ఉక్రెయిన్‌పై సైనిక చర్య కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో మాస్కో క్రూడాయిల్‌ను తక్కువ ధరకే విక్రయించడం మొదలు పెట్టింది. భారత్, చైనా దీన్ని భారీగా దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాయి. ఒకప్పుడు భారత చమురు దిగుమతిలో ఒక్క శాతం వాటా కూడా లేని రష్యా.. ఇప్పుడు భారత్‌కు అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా మారింది.
ఏప్రిల్ నెలలో ఇరాక్, సౌదీ అరేబియా కన్నా రష్యా వాటానే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మన చమురు అవసరాల్లో 36 శాతం రష్యానే తీరుస్తోంది. ఏప్రిల్‌లో భారత్ సగటున 4.6 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోగా.. అందులో ఒపెక్ దేశాలు 2.1 మిలియన్ బ్యారెళ్లు మాత్రమే ఎగుమతి చేశాయి. రష్యా 1.67 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేసింది.












Click it and Unblock the Notifications