అమెరికాపై బిలియన్ డాలర్లను గుమ్మరిస్తోన్న భారత్..ట్రంప్ వచ్చాకే ఇదంతా..!!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. భారత్ లో అమెరికా నుంచి ముడి చమురు దిగుమతులు భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ దిగుమతులు సగానికి పైమాటే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక కొనసాగుతున్న క్రూడాయిల్ ట్రేడింగ్ కు ఇది అద్దం పడుతోంది.
ఈ ఏడాది జనవరి 20వ తేదీన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అదే జనవరి నుంచి జూన్ వరకు అమెరికా నుంచి భారత్ చేసుకున్న సగటు ముడి చమురు దిగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 51 శాతం పెరిగాయి. గత ఏడాది ఇదే కాలానికి రోజుకు 0.18 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసుకోగా, ఈ ఏడాది అది 0.271 మిలియన్ బ్యారెల్స్‌కు చేరింది.

దీనికి సంబంధించిన డేటాను పెట్రోలియం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉంది. 2024 ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 114 శాతం పెరిగింది. ఈ దిగుమతుల విలువ రెట్టింపు కంటే ఎక్కువే.
2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో 1.73 బిలియన్ డాలర్ల విలువ గల దిగుమతులు జరగ్గా.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అది 3.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇదే పెరుగుదల ఆ తరువాతి నెలల్లో కూడా కొనసాగాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రికార్డు స్థాయికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
జూన్ తో పోలిస్తే జులైలో అమెరికా నుంచి 23 శాతం ఎక్కువ ముడి చమురు దిగుమతి చేసుకుంది భారత్. భారత్ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో అమెరికా వాటా జూన్‌లో మూడు శాతం కాగా, జూలైలో ఎనిమిది శాతానికి పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ ముడి చమురు దిగుమతులను 150 శాతం పెంచుకుంటాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
ఇది ఒక్క క్రూడాయిల్ కే పరిమితం కాలేదు. అమెరికా నుంచి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (LPG), లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) దిగుమతులు కూడా భారీగా పెరిగాయి. ఎల్ఎన్జీ దిగుమతులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2.46 బిలియన్ డాలర్లకు చేరుకోగా.. అంతకుముందు ఏడాది 1.41 బిలియన్ డాలర్ల కంటే దాదాపు 100 శాతం ఎక్కువ.
బిలియన్ డాలర్ల కొద్దీ విలువైనఓ భారీ దీర్ఘకాలిక ఎల్ఎన్జీ ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. అమెరికాతో భారత్ ఎప్పుడూ స్నేహపూరక సంబంధాలనే కొనసాగించిందని, ఘర్షణ వైఖరిని ప్రదర్శించలేదని చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications