యువత కోసం అమృతకాలం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గణతంత్ర దినోత్సవ సందేశం
న్యూఢిల్లీ: భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని వ్యాఖ్యానించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అయోధ్య రామమందిరం భారత నాగరికత, వారసత్వాల పునరావిష్కరణగా చరిత్రలో గుర్తుండిపోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ప్రజల విశ్వాసానికి, అపారమైన నమ్మకానికి నిదర్శనంగా, ఒక గొప్ప కట్టడంగా విలసిల్లుతుందని వ్యాఖ్యానించారు.
ప్రజాజీవితాన్ని సుసంపన్నం చేయడంలో కృషి చేసిన బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌ను భారతరత్నతో సత్కరించడం పట్ల రాష్ట్రపతి ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. పాశ్చాత్య దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థల కన్నా భారత ప్రజాస్వామ్యం చాలా ప్రాచీనమైనదనీ అందుకే భారత్‌ను ప్రజాస్వామ్యానికి తల్లివంటిదని అంటారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివరించారు.

మన అద్భుతమైన స్పూర్తిదాయకమైన రాజ్యాంగాన్ని రూపొందించిన నాయకులను దేశం ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని తెలిపారు. భారతదేశం ప్రస్తుతం అమృత్ కాల్ ప్రారంభ దశలో ఉందని.. భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే సువర్ణావకాశం దేశ ప్రజలకు ఉందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ఇది పరివర్తన సమయమని, మన లక్ష్యాలను సాధించడంలో ప్రతీ పౌరుడి సహకారం చాలా కీలకమన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ గురించి రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. అమృతకాలం అపూర్వమైన సాంకేతిక మార్పుల కాలం అవుతుందన్నారు. సాంకేతిక పురోగతి మన దైనందిన జీవితంలో భాగమవుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ముఖ్యంగా యువత కోసం ఎన్నో అవకాశాలు ఎదురుచూస్తున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇటీవల ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత జీడీపీ వృద్ధి అత్యధికంగా ఉందని.. ఈ పనితీరు 2024లో అంతకుమించి కొనసాగుతుందని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications