పాకిస్తాన్ అణు కేంద్రాన్ని భారత్-ఇజ్రాయెల్ ధ్వంసం చేయాలని అనుకున్నాయా..
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య భీకర దాడుల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
ఈ దాడుల్లో కొన్ని వందల మంది మరణించగా, కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు.
కాల్పుల విరమణ చేయడం తప్పదని భావించిన ఇజ్రాయెల్.. హమాస్‌ను, హమాస్ నిర్మాణాలను వీలైనంత ధ్వంసం చేయాలని భావించింది.
తీవ్రవాదాన్ని అణచివేయడానికి భారత్ కూడా ఇజ్రాయెల్ పద్ధతినే అనుసరించాలని నిపుణులు చెప్పడం మొదలు పెట్టారు.
ఇజ్రాయెల్ సహాయంతో సరైన సమయంలో భారతదేశం ధైర్యంగా వ్యవహరించి ఉంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఆపగలిగి ఉండేదనే చర్చలు కూడా మొదలయ్యాయి.
అయితే, ఇజ్రాయెల్ నిజంగానే అలాంటి ప్రతిపాదనను భారత్ ముందుకు తీసుకొచ్చిందా?
ఆ పనికి గుజరాత్ కేంద్రాన్ని వాడాలని అనుకుందా?
కాహుతాలో పాకిస్తాన్ చేస్తున్న అణ్వాయుధ కార్యక్రామాన్ని ఆపే అవకాశాన్ని ఇండియా వదులుకుందా?
పాకిస్తాన్‌లో అణ్వాయుధ కేంద్రాలను నాశనం చేయడంలో ఇజ్రాయెల్‌కున్న లాభమేంటి?
వీటిపై విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయం మాత్రం నేటికీ చర్చనీయాంశమే.
ఇరాక్ ఆక్రమణ
1981 జూన్ 7న ఇజ్రాయెల్ వైమానిక దళం మూడు శత్రు దేశాల సరిహద్దులను దాటింది.
ఇరాక్‌లోని ఓసిరాక్‌లో నిర్మాణంలో ఉన్న అణు కేంద్రాన్ని పేల్చి ఇరాక్‌లో విధ్వంసం సృష్టించింది.
అప్పట్లో ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న ఈజిప్ట్‌లోని సినాయ్ ఎడారి నుంచి ఇజ్రాయెల్‌కు చెందిన ఎనిమిది ఎఫ్-16, రెండు ఎఫ్-15 ఫైటర్ జెట్‌లు బయలుదేరాయి.
ఇవి 120 మీటర్ల ఎత్తులో సౌదీ అరేబియా, జోర్డాన్ మీదుగా వెళ్లాయి.
వీటితో పాటు 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి సరిపోయే అదనపు ఇంధన ట్యాంకులను సౌదీ అరేబియాలోని ఎడారి ప్రాంతంలో జారవిడిచారు.
ఇరాక్ భూభాగంలోకి ప్రవేశించగానే రాడార్‌కు దొరక్కుండా ఉండేందుకు ఇజ్రాయెల్ విమానాలు 30మీటర్ల ఎత్తులో ఎగిరాయి.
సాయంత్రం 5.30 నిమిషాలు అయ్యేటప్పటికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ విమానాలు వివిధ దిక్కుల్లోకి ఎగిరి 2130 మీటర్ల ఎత్తుకు చేరాయి.
ఆ తర్వాత గంటకు 1100 కిలోమీటర్ల వేగంతో ఓసిరాక్ డోమ్ వైపు దూసుకెళ్లాయి. ఆ తర్వాత ఒక దాని తర్వాత ఒకటి 16 టైం డిలే బాంబులను 35 డిగ్రీల కోణంలో ఆ ప్లాంట్‌పై జారవిడిచాయి. అందులో రెండు పేలలేదు. కానీ మిగిలిన బాంబులు వాటి పనిని కానిచ్చాయి.
ఫ్రెంచ్ డిజైన్‌లో రూపొందించిన రియాక్టర్ ఈ బాంబు దాడిలో ధ్వంసమైంది.
ఇంతలో ఇరాక్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్ గర్జించాయి.
కానీ ఇజ్రాయెల్ విమానాలు వెనక్కి వెళ్లేందుకు అప్పటికే 12,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నాయి.
ఇజ్రాయెల్ విమానాలను ఒక్క ఇరాక్ విమానం కూడా పట్టుకోలేకపోయింది. ఇజ్రాయెల్ విమానాలు వెనక్కి తిరిగి వచ్చేసరికి ట్యాంకుల్లో కేవలం 450 లీటర్ల ఇంధనం మాత్రమే ఉంది. అది కేవలం 270 కిలోమీటర్లు ప్రయాణించడానికి మాత్రమే సరిపోతుంది.
ఆ దాడుల్లో 11 మంది సైనికులు, ఒక ఫ్రెంచ్ పౌరుడు మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇజ్రాయెల్ చర్యలను భద్రతా సమితి ఖండించింది.
మరోవైపు, ఫ్రాన్స్, ఇటలీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మించుకునేందుకు ఇరాక్‌కు సహాయం చేయడాన్ని ఇజ్రాయెల్ విమర్శించింది.
ఇజ్రాయెల్‌పై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
ఇజ్రాయెల్ వైమానిక దళం నిర్వహించిన ఈ దాడులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భద్రతానిపుణులు ఆశ్చర్యపోయారు.
ఇలాంటి పనినే చేయాలని భారతీయ భద్రతా నిపుణులు కూడా ఆలోచించారు.

పాకిస్తాన్ అణు కార్యక్రమానికి వ్యతిరేకంగా ఆపరేషన్
భారతదేశంలో 1977లో ఎమర్జెన్సీ విధించారు.
కేంద్రంలో మొట్టమొదటిసారి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటయింది.
పాకిస్తాన్‌లో 1971 యుద్ధం తర్వాత భారతీయ నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ ('రా') దేశంలోని రాజకీయ నాయకులపై నిఘా పెడుతోందని భావించారు.
జనతా పార్టీ అధికారంలోకి రాగానే 'రా' బడ్జెట్‌ను 30 శాతం తగ్గించేసింది.
అంతేకాకుండా పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగిన దేశంగా మారకుండా ఉండేందుకు ఒక రహస్య ఆపరేషన్ కూడా నిర్వహించారు.
2018లో పాకిస్తాన్ గ్రూప్ కెప్టెన్ ఎస్‌ఎం హాలీ రక్షణ శాఖ పత్రిక 'పాకిస్తాన్ డిఫెన్స్ జనరల్'లో ఒక వ్యాసం రాశారు.
ఒక 'రా' ఏజెంట్ కాహుతా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బ్లూ ప్రింట్‌ను భారతదేశానికి 10,000 డాలర్లకు అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారని అందులో రాశారు.
ఈ విషయాన్ని అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయికి చెప్పగానే, ఆయన అప్పటి పాకిస్తాన్ మిలటరీ పాలకుడు జనరల్ జియా ఉల్ హక్‌కు ఫోను చేసి "మీరు కహుతా దగ్గర అణు బాంబును నిర్మిస్తున్నట్లు మాకు తెలుసు" అని చెప్పారు.
దాంతో పాటు విచారణ కొనసాగించి 'రా' గూఢచారిని పట్టుకున్నారు. కానీ భారతదేశానికి ఆ రహస్య బ్లూ ప్రింట్ మాత్రం లభించలేదు.
పాకిస్తాన్ అణ్వాయుధాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్లు 'రా' అనుమానించింది. దాంతో పాకిస్తాన్‌లో ఉన్న తమ గూఢచర్య నెట్‌వర్క్‌ను అప్రమత్తం చేసింది.
ఒక రహస్య విచారణలో ఇస్లామాబాద్ దగ్గరలో ఉన్న కహుతా దగ్గర అణ్వాయుధ కార్యక్రమం కొనసాగుతున్నట్లు 'రా' కు తెలిసింది.
ఈ విషయాన్ని ధృవీకరించడానికి 'రా' గూఢచారులు కహుతాలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల తల వెంట్రుకలు సేకరించారు. సైంటిస్టులు జట్టు జుట్టు కత్తిరించుకోవడానికి వెళ్లే సెలూన్‌లోకి వెళ్లి వారి తల వెంట్రుకల శాంపిళ్లను సేకరించారు.
ఆ శాంపిళ్లను భారతదేశానికి పంపారు. ఆ వెంట్రుకల్లో రేడియో యాక్టివ్ పదార్థాలు ఉన్నట్లు నిరూపితమైంది. అంటే, ఆ శాస్త్రవేత్తలు పని చేస్తున్న చోట అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.
ఈ సమాచారం తెలిసిన తర్వాత కహుతా ప్లాంట్ బ్లూ ప్రింట్ సంపాదించేందుకు ఒక రహస్య ఆపరేషన్ చేపట్టారు.
అంతలో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చారు. 'రా' ఆపరేషన్ కాహుతాను ప్రారంభించింది.
ఇజ్రాయెల్.. ఇరాక్ న్యూక్లియర్ ప్లాంటును విధ్వంసం చేసిన తీరులోనే భారతదేశం కూడా పాకిస్తాన్‌లోని కహుతా న్యూక్లియర్ ప్లాంటును పేల్చేయాలని అనుకుంది.

ఇజ్రాయెల్ ఈ ప్రతిపాదన చేసిందా?
"గల్ఫ్ దేశాల నుంచి వచ్చే విమానాలు ప్రవేశించేందుకు గుజరాత్‌లో ఉన్న జామ్‌నగర్ ముఖ్యమైన ద్వారం" అని ఎయిర్ ఫోర్స్ ఒక మాజీ అధికారి చెప్పారు.
అందుకే విదేశాల్లో కొనుగోలు చేసిన చాలా విమానాలు ఈ మార్గం ద్వారానే ప్రవేశిస్తాయి.
"రాఫెల్ విమానాలు కూడా ఇక్కడికే రావాల్సి ఉండేది. కానీ వాటి సామర్ధ్యాన్ని, పైలట్ల ప్రావీణ్యాన్ని ప్రదర్శించేందుకు జామ్‌నగర్‌కు బదులు హర్యానాలోని అంబాలాకు వచ్చాయి"
"అంబాలాలోని ఇండియన్ జగౌర్ స్క్వాడ్రన్ 1984లో ఇజ్రాయెల్ మిషన్ కోసం వెళ్లిందనే వదంతులు కూడా విన్నాను. కానీ, ఆ బృందం ఇజ్రాయెల్ మిషన్ కోసం వెళ్లిందా లేదా అనేది నాకు స్పష్టంగా తెలియదు" అని ఆయన అన్నారు.
పాకిస్తాన్‌లో ఉన్న కహుతా అణ్వాయుధ ప్లాంట్‌పై కొత్తగా కొనుగోలు చేసిన జగౌర్ ఎయిర్ క్రాఫ్ట్‌తో దాడి చేయాలని భారత్ భావించిందని "పాకిస్తాన్: ది యునైటెడ్ స్టేట్స్ అండ్ ది గ్లోబల్ న్యూక్లియర్ కాన్స్పిరసీ" అనే పుస్తకంలో రాసినట్లు ఆడ్రియన్ లెవీ, క్యాథెరిన్ స్కాట్ క్లార్క్ అనే విలేఖరులు పేర్కొన్నారు.
1983 ఫిబ్రవరిలో సీనియర్ భారతీయ సైనికాధికారులు రహస్యంగా ఇజ్రాయెల్‌లో పర్యటించారు.
ఆ పర్యటనలో వారు కహుతా ప్లాంటు భద్రతను నిర్వీర్యం చేసే ఎలక్ట్రానిక్ పరికరాల గురించి ఎంక్వైరీ చేశారు.

పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎఫ్-16 ఫైటర్ జెట్ల గురించి ఇజ్రాయెల్ భారతదేశానికి సమాచారం ఇచ్చింది.
దానికి ప్రతిఫలంగా ఇండియా ఎంఐజి-23 ఎయిర్ క్రాఫ్ట్ గురించి ఇజ్రాయెల్‌కు రహస్య సమాచారాన్ని అందించింది.
ఇజ్రాయెల్ పొరుగు అరబ్ దేశాల్లో ఈ సోవియట్ ఎయిర్ క్రాఫ్టులు ఉన్నాయి. అందుకే ఇజ్రాయెల్‌కు ఈ సమాచారం అవసరమైంది.
సీనియర్ భద్రతా నిపుణులు భరత్ కర్నాడ్ తన బ్లాగ్‌లో ఇలా రాశారు.
"నేను 1983లో ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఆరన్ యారివ్‌ను బీరుత్‌లో కలిసాను. ఈ ప్లాన్‌కు సంబంధించిన అనేక విషయాలను ఆయన నాతో చెప్పారు"
ఆ ప్రణాళిక ప్రకారం ఆరు ఎఫ్-16 ఫైటర్ జెట్లు, 6 ఎఫ్-15 యుద్ధ, పెట్రోల్ విమానాలు ఇజ్రాయెల్‌లోని హైఫా నుంచి బయలుదేరి దక్షిణ అరేబియా సముద్రం మీదుగా ఎగిరి భారత్‌లోని జామ్‌నగర్ చేరాల్సి ఉంది. అక్కడ పైలట్లు కాసేపు విశ్రమించి తగిన మార్పులు చేసుకుంటారు.
ఈ ప్రణాళికకు అవసరమైన పేలుడు సామగ్రి, పరికరాలతో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ 17 కార్గో-సి విమానాలు జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్ ఎయిర్ పోర్టుకు చేరాలి. ఎఫ్-16 విమానాలు జామ్‌నగర్‌లో బయలుదేరి గాలిలోనే ఇంధనం నింపుకుని ఉదంపూర్ చేరుతాయి.
"అక్కడ నుంచి విమానాలు సరిహద్దులు దాటి ఎవరికీ కనిపించకుండా పర్వత శ్రేణుల్లో ఎగురుతాయి. అవి బయటకు కనిపించేసరికి రెండు ఎఫ్ 16 విమానాలు కహుతా న్యూక్లియర్ ప్లాంటును పేల్చేస్తాయి"
"ఆ సమయంలో ఎఫ్- 15 విమానాలు మాత్రం గాలిలోనే ఉండి, పాకిస్తాన్ వైమానిక దళం విమానాలను అడ్డగిస్తాయి. దాడి తర్వాత ఎఫ్-16 విమానాలు పశ్చిమ దిక్కుకు ఎగిరి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌ని దాటేస్తాయి"
"తక్కువ ఎత్తులో ఎగురుతూ అవి దక్షిణం వైపు నుంచి పర్వతాల వెనకాల వైపు ఎగురుతూ తమ స్వదేశం చేరుకుంటాయి"
"ఆ పర్వతాల్లో ఇజ్రాయెల్ విమానాలను ఎదుర్కొనే సాహసాన్ని పాకిస్తాన్ విమానాలు చేయలేవని ఇజ్రాయెల్ వ్యూహకర్తలు భావించారు"
"అయితే ఈ దాడిలో తమ పాత్ర లేదని భారత్ చెబుతుందని ఇజ్రాయెల్ భావించింది. అందుకే తన విమానాలపై సొంత సైన్యపు చిహ్నంతో ఎగిరేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది అని సీనియర్ భద్రతా నిపుణులు భరత్ కర్నాడ్ రాశారు.
"పాకిస్తాన్‌లోని కహుతా అణు కేంద్రంపై దాడి చేయడానికి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు ఇజ్రాయెల్ విమానాలు వస్తాయని చాలా చర్చలు జరిగాయి. కానీ ఈ ప్రణాళిక గురించి అమెరికా, రష్యా ఆందోళన చెందినట్లు కొన్ని రహస్య పత్రాల్లో తెలిసింది"
"అయితే, దీని గురించి వారు కేవలం ఊహిస్తున్నారా? లేదా స్పష్టమైన సమాచారం ఉందా అనే విషయంపై స్పష్టత లేదు. దాని గురించి కచ్చితంగా ఏమీ చెప్పలేం" అని జవహర్‌లాల్ నెహ్రు యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ డాక్టర్ రాజగోపాలన్ అన్నారు.
కహుతా అణు కేంద్రంపై దాడికి భారత్‌ను ఒప్పించడానికి ఇజ్రాయెల్ మూడుసార్లు ప్రయత్నించినట్లు టెల్ అవివ్‌లో ప్రచురితమయ్యే 'ది జెరూసలెం పోస్ట్' లో 1987 ఫిబ్రవరిలో రాశారు.

యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ నుంచి జామ్‌నగర్ వరకు రావడం, అక్కడ వాటిని రహస్యంగా ఉంచడం ఇజ్రాయెల్‌కు కష్టమయ్యేదని ఆయన అన్నారు.
పాకిస్తాన్ ఒక అణు బాంబును నిర్మించగలిగితే, అది ఇరాక్, లిబియా, ఇరాన్ కూడా చేరుకోగలదని ఇజ్రాయెల్ అనుమానించింది.
పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త అబ్దుల్ ఖదీర్ ఖాన్ యురేనియం శుద్ధి సాంకేతికతను యూరోపియన్ యూనియన్ సంస్థలు, ఇరాన్, లిబియా, ఉత్తర కొరియాకు అమ్మేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి.
కహుతా అణు కేంద్రంపై భారత్ దాడి సమాచారం వస్తే తప్పకుండా పాకిస్తాన్‌కు చెబుతానని పాకిస్తాన్‌లో అమెరికా దౌత్యవేత్త అప్పటి మిలటరీ పాలకుడు జనరల్ జియాకు భరోసా ఇచ్చినట్లు రహస్య పత్రాలు చెబుతున్నాయి.
భారత్ వైమానిక దాడులు చేసే అవకాశాలు ఉన్నట్లు అమెరికా నిఘా సంస్థ సీఐఏ డిప్యూటీ డైరెక్టర్.. సీనియర్ పాకిస్తాన్ అధికారులకు సెప్టెంబరు 22న తెలియచేశారు.
అదే రోజు సీఐఏను కోట్ చేస్తూ అలాంటి దాడి జరగొచ్చని ఏబీసీ టెలివిజన్ కథనం ప్రసారం చేసింది.
భారతదేశంపై పశ్చిమ దేశాల ఒత్తిడి పెరిగడంతో ప్రధాని ఇందిర తన ప్లాన్‌ను రద్దు చేశారు.
సరిగ్గా ఒక నెల రోజుల తర్వాత అక్టోబరు 1984న ఇందిర హత్యకు గురయ్యారు. ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ భారత ప్రధాని అయ్యారు.
ఇజ్రాయెల్‌తో భారత్ సంబంధాలు
1948 మే 15న యూదుల రాజ్యం ఇజ్రాయెల్ ప్రపంచ చిత్రపటంపై ఆవిర్భవించింది.
దానికి సరిగ్గా 9 నెలల ముందు భారతదేశానికి స్వాతంత్య్రం లభించింది.
ఇజ్రాయెల్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించడానికి భారతదేశానికి రెండున్నరేళ్లు పట్టింది. 1950 సెప్టెంబరు 15న భారతదేశం ఇజ్రాయెల్‌ను గుర్తించింది. ఇజ్రాయెల్ తమ దౌత్య కార్యాలయాన్ని ముంబయిలో తెరిచింది.
భారతదేశం కూడా ఇజ్రాయెల్‌లో 1952లో దౌత్య కార్యాలయాన్ని తెరవాలని అనుకుంది కానీ ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది.
జులై 1956లో ఈజిప్ట్ అధ్యక్షుడు నాసర్ సూయెజ్ కాలువను జాతీయం చేశారు. అంతకు ముందు అది బ్రిటన్, ఫ్రాన్స్ యాజమాన్యంలో ఉండేది.
ఇజ్రాయెల్ ఈజిప్ట్‌పై దాడి చేసింది. ఆ తర్వాత యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్ చేరాయి. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ పాత్ర వల్ల ఆ దేశంలో దౌత్య కార్యాలయాన్ని తెరవాలనే ఆలోచనను భారత్ విరమించుకుంది.
1968 వరకు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగానే కొనసాగాయి. 1968లో 'రా' సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి విడిపోయింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్‌తో ఇంటెలిజెన్స్ సంబంధాలు కూడా పెంపొందాయి.
1965, 1971లలో జరిగిన యుద్ధాల్లో ఇజ్రాయెల్ భారతదేశానికి రహస్యంగా సహాయం చేసిందని రక్షణ శాఖ నిపుణులు రాహుల్ బేడీ గతంలో బీబీసీకి చెప్పారు.
భారతీయ భద్రతా దళాలు, నిఘా అధికారులు టర్కీ, సైప్రస్ ద్వారా ఇజ్రాయెల్ వెళ్లేవారని చెప్పారు.
"వాళ్ల పాస్‌పోర్టులు ఇజ్రాయెల్ స్టాంపులతో ఉండేవి కావు. కానీ వారు ప్రయాణం చేయడానికి కావాల్సిన లైసెన్సును ఒక కాగితంపై రాసి ఇచ్చేవారు"
"ఇజ్రాయెల్ ప్రధాని ఫిరంగులు, ఇంకా చాలా ఆయుధాలను ఆయుధాల వ్యాపారి ష్లోమో బ్లాడ్ క్విజ్ ద్వారా భారత్‌కు చేరవేసేవారని గేరి జె బాస్ అనే విలేఖరి తన పుస్తకం 'బ్లడ్ టెలిగ్రామ్' లో రాశారు.
ఆయన అందుకు హస్కర్ పత్రికలో వచ్చిన సమాచారాన్ని ఆధారంగా తీసుకున్నారు.
ఒక విధంగా భారతదేశం ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు పెట్టుకోవాలని పరోక్షంగా సంకేతాలు పంపింది అని ఆ పుస్తకంలో రాశారు.
కానీ అలా చేయడం వల్ల సోవియట్ యూనియన్‌ను అవమానపరిచినట్లు అవుతుందని ఇండియా చెబుతూ వచ్చింది.
ఇండియా ఇజ్రాయెల్‌లో 1992లో దౌత్య కార్యాలయాన్ని తెరిచింది. అప్పటి హోమంత్రి ఎల్‌కే అద్వానీ 2000లో ఇజ్రాయెల్ వెళ్లారు.
ఒక భారతీయ మంత్రి ఇజ్రాయెల్‌కు వెళ్లడం అదే మొదటిసారి.
2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇజ్రాయెల్ విదేశీ విధానంలో ప్రాముఖ్యంగా లేదు.
అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ 2003లో ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఆయన ప్రధాన మంత్రి కాకముందే వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లో గుజరాత్‌కి , ఇజ్రాయెల్‌కు మధ్య సంబంధాలను పటిష్టపరిచారు.
2014లో భారతదేశానికి ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నికవ్వగా, ఇజ్రాయెల్‌కు బెంజమిన్ నెతన్యాహు ప్రధానిగా ఉన్నారు.
అప్పటి నుంచి ఇరు దేశాల మధ్యా సంబంధాలు బలపడ్డాయి. అంతకు ముందు వరకు వజ్రాలు, ఔషధాలు, వ్యవసాయం, పశుసంవర్ధక రంగాలకు పరిమితమైన ద్వైపాక్షిక సంబంధాలు ఆ తర్వాత భద్రతతో పాటు మరిన్ని ముఖ్యమైన రంగాలకు విస్తరించాయి.
చివరకు ప్రారంభం
భారతదేశం, పాకిస్తాన్ అణు కేంద్రాల్లో దాడుల గురించి కథనాలు పశ్చిమ దేశాల మీడియాలో ఎక్కువగా ప్రచురితమయ్యేవి.
దాంతో ఇరు దేశాల అణు కేంద్రాలపై పరస్పర దాడులు నిర్వహించవద్దని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సలహా ఇచ్చినట్లు భారత ప్రభుత్వ మాజీ సీనియర్ అధికారి కే సుబ్రహ్మణ్యం రాసిన "1964 - 98: ఏ పర్సనల్ రికలెక్షన్" అనే పుస్తకంలో రాశారు.
ఇరు దేశాల అణు కేంద్రాలపై దాడులు జరుపుకోకూడదని ఇండియా, పాకిస్తాన్ 1985లో మౌఖికంగా అంగీకరించాయి.
ఇదే విషయాన్ని 1988లో అధికారికంగా అంగీకరించారు. ఈ ఒప్పందం 1991లో ఆమోదం పొందింది.

ఇరు దేశాల్లో ఉన్న న్యూక్లియర్ కేంద్రాల గురించి సమాచారాన్ని 1992 నుంచి ప్రతి సంవత్సరం మొదటి రోజున ఒకరితో ఒకరు పంచుకుంటారు.
అదే సమయంలో రాజీవ్ గాంధీ అప్పటి ఇజ్రాయెల్ ప్రధానిని కలిశారు.
ఇరు దేశాల మధ్య ప్రధానమంత్రి స్థాయిలో జరిగిన తొలి సమావేశం ఇదే.
భారతదేశంలో వీఐపీలకు భద్రత కల్పించడానికి రూపొందించిన ది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జి) స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) లకు ఇజ్రాయెల్ కమాండోల తరహాలో శిక్షణ ఇప్పించారు.
ఆ శిక్షణకు భారతీయ దళాలకు ఇజ్రాయెల్ సహాయం చేసింది.
1998లో భారత్ అణ్వాయుధ పరీక్ష నిర్వహించిన తర్వాత పాకిస్తాన్ కూడా అణ్వాయుధ పరీక్ష నిర్వహించింది. కానీ, ఆ పరీక్షను రహస్యంగా ఉంచలేకపోయింది.
ఆ పరీక్ష తాలూకు సాటిలైట్ చిత్రాలు బహిర్గతమయ్యాయి.
అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ పాకిస్తాన్ తమ కార్యక్రమాన్ని ఆపలేదు.
ఆ సమయంలో ఇండియా, ఇజ్రాయెల్ కలిసి తమ అణ్వాయుధ కార్యక్రమాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేశాయని, ఇజ్రాయెల్ విమానాలు రెండుసార్లు తమ గగనతలంలోకి ప్రవేశించాయని పాకిస్తాన్ ఆరోపించింది.
కానీ ఈ ఆరోపణలను భారత్, ఇజ్రాయెల్ ఖండించాయి.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన 'బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications