ఫలితాలపై పవార్: ఢిల్లీపై కిరణ్ బేడీ సలహా, ఎవరికి వారే
న్యూఢిల్లీ: కాంగ్రెసు వంటి బలహీన నాయకత్వం వల్లే దేశంలో అరవింద్ కేజ్రీవాల్ లాంటి సూడో ఉద్యమకారులు పుట్టుకు వస్తున్నారని కేంద్రమంత్రి, ఎన్సీపి అధినేత శరద్ పవార్ సోమవారం అన్నారు. ప్రీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఘోర పరాజయం చెందిన నేపథ్యంలో దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ పార్టీకి సూచించారు. భారత్‌కు నిర్ణయాత్మక నేత కావాలన్నారు. కాంగ్రెసు పార్టీయే కాకుండా అన్ని పార్టీలు పునరాలోచన చేయాల్సి ఉందన్నారు.
కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి: కిరణ్ బేడీ
భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి న్యూఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కిరణ్ బేడీ సూచించారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రానందున మళ్లీ ఎన్నికలకు వెళ్లి ప్రజల పైన భారం వేయవద్దని సూచించారు. అయితే, తాము ఎట్టి పరిస్థితుల్లోను కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీతో కలవమని బిజెపి సీనియర్ నేత నితిన్ గడ్కరీ చెప్పారు.

ఆదివారం ఫలితాలు వెలువడిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ సైతం ఏ పార్టీతో కలవమని చెప్పారు. తాము నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, బిజెపి, కాంగ్రెసు పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తి లేదన్నారు. కాంగ్రెసు పార్టీ కూడా తాము ఎఎపికి మద్దతిచ్చేది లేదని ప్రకటించింది.
మూడు పార్టీలు ఎవరికి వారు కలిసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడంతో మరోసారి ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications