ఈ 13 మంది వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ- అందుకే బాయ్‌కాట్..!!
న్యూఢిల్లీ: ఇంకొద్దిరోజుల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఆరంభం కాబోతోన్నాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ పార్లమెంట్ సమావేశాలు నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకునే దిశగా కేంద్రం ఈ సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు, బిల్లులను ప్రవేశపెడుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు అంటే అయిదు రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలను ప్రత్యేకంగా సమావేశపర్చనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇదివరకే వెల్లడించారు. అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం లేదా, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇవ్వాళ సమావేశమైన ఇండియా సమన్వయ కమిటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ప్రత్యేకించి- సీట్ల పంపకాలపైనా తుది నిర్ణయానికి వచ్చారు సమన్వయ కమిటీ సభ్యులు.
ఈ క్రమంలో మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఇండియా. జాతీయ మీడియాలో పనిచేస్తోన్న కొందరు న్యూస్ యాంకర్లు, జర్నలిస్టులను బహిష్కరించింది. వారు నిర్వహించే ఎలాంటి పొలిటికల్ డిబేట్లకు గానీ, ఇంటర్వ్యూలకు గానీ వెళ్లకూడదని నిర్ణయించుకుంది. పార్టీలవారీగానే కాకుండా ప్రతిపక్ష కూటమి నుంచి ఏ ఒక్కరు కూడా ఆ న్యూస్ యాంకర్లు నిర్వహించే చర్చా కార్యక్రమాలకు వెళ్లరని ఇండియా తెలిపింది.
ఈ జాబితాలో మొత్తం 13 మంది న్యూస్ యాంకర్లు, సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. అమన్ చోప్రా, ప్రాచీ పరాశర్, రుబికా లియాఖత్, చిత్రా త్రిపాఠి, సుధీర్ చౌధరి, అమీష్ దేవ్‌గణ్, ఆర్నబ్ గోస్వామి, నావికా కుమార్, గౌరవ్ సావంత్, ఆదితి త్యాగి, సుశాంత్ సిన్హా, అశోక్ శ్రీవాస్తవ్, శివ్ అరూర్ ఉన్నారు. వారు నిర్వహించే డిబేట్లల్లో పాల్గొనడం వల్ల పార్టీకి జరిగే లాభం కంటే నష్టమే అధికమని ఇండియా అంచనా వేసింది.












Click it and Unblock the Notifications