న్యూయార్క్ టైమ్స్ జ్ఞానం ఏపాటిది: యోగి నియామకంపై మోదీ సర్కార్

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/న్యూయార్క్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎంపికపై న్యూయార్క్ టైమ్స్ దినపత్రిక సంపాదకీయాన్ని భారత్ ప్రశ్నించింది. ఆ దిన పత్రికకు గల జ్ఞానం ప్రశ్నార్థకమేనని పేర్కొంది. 'సంపాదకీయాలన్నీ పత్రిక అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటాయి.

ఈ అంశంలో ప్రత్యేకించి ప్రజాతంత్ర ప్రక్రియలో ప్రజా తీర్పుపై సందేహాలు వ్యక్తం చేయడం సదరు పత్రిక యాజమాన్యం పరిజ్నానాన్ని, అనుమానించాల్సి వస్తున్నదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లేయ్ వ్యాఖ్యానించారు. న్యూయార్క్ టైమ్స్ శుక్రవారం సంచిక సంపాదకీయంలో యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ను నియాకంపై విస్మయం వ్యక్తం చేసింది.

లౌకిక భారత్‌ను హిందూ దేశంగా మార్చివేయడంలో తమకు ఎదురులేదని బీజేపీ భావిస్తున్నట్లు ఈ నిర్ణయం స్పష్టం చేస్తున్నదని పేర్కొంది. 'హిందూ అతివాదులతో మోదీ ప్రమాదకర ఆలింగనం' అనే శీర్షిక కింద రాసిన కథనంలో తీవ్రంగా విమర్శించింది.

India Questions New York Times' Wisdom to Criticise Adityanath Becoming UP CM

హిందూత్వ వాదులకు మోదీ బుజ్జగింపు

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ.. ఒకవైపు హిందుత్వ అతివాదులను బుజ్జగిస్తూ, మరోవైపు ఆర్థికాభివ్రుద్ధి, ప్రగతి లాంటి లౌకిక లక్ష్యాలపై మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళుతున్నారని పేర్కొన్నది.

ముస్లిం మైనారిటీలపై హిందూత్వ అతివాదుల హింసను ఆయన బహిరంగంగా సమర్థించలేదని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం సాధించిన తరువాత ప్రధాని నరేంద్రమోదీ అసలు రంగు బయటపడిందని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్‌ను ప్రకటించడం మైనారిటీలను దిగ్భ్రాంతికి గురిచేసే పరిణామమని వ్యాఖ్యానించింది.

2019 ఎన్నికలే లక్ష్యంగా మోదీ సర్కార్ ముందడుగు

2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం లక్ష్యంగానే రాజకీయ సమీకరణాల కోసం ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ముందుకు సాగుతున్నదని న్యూయార్క్ టైమ్స్ సంపాదకీయం వ్యాఖ్యానించింది. తద్వారా లౌకిక గణతంత్ర భారతావనిగా ఉన్న దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలన్న తమ సుదీర్ఘ కాలంగా ఉన్న కల సాకారం చేసుకోగలమని బీజేపీ నమ్ముతున్నదని పేర్కొంది. ఆదిత్యనాథ్‌ ముస్లింలను, దోషులుగా చూపుతూ రాజకీయంగా ఎదిగారని తెలిపింది.

వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఆదిత్యనాథ్ ఎదుగుదల

'లవ్ జిహద్' వంటి నినాదాలతో హిందూ మహిళలను ముస్లిం పురుషులు ఆకర్షిస్తున్నారన్న ఆరోపణలతో ప్రజలతో మమేకం అయ్యారని న్యూయార్క్ టైమ్స్ తన సంపాదకీయంలో పేర్కొన్నది. 2015లో బీఫ్‌ తిన్నదన్న అనుమానంతో ఓ ముస్లిం కుటుంబంపై దాడి చేసిన హిందూత్వ వాదుల నిర్ణయాన్ని ఆయన సమర్థించారని తెలిపింది. యోగా చేసే సమయంలో సూర్య నమస్కారాలకు నిరాకరించిన ముస్లింలు సముద్రంలో మునగాలని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేసింది.

యూపీలో ప్రగతి.. నిరుద్యోగ సమస్య

20 కోట్ల మందికి పైగా జనాభాగల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీస్థాయిలో అభివ్రుద్ధి చేపట్టాల్సిన అవసరం ఉందే గానీ సిద్ధాంతపరమైన ప్రదర్శన కాదని స్పష్టం చేసింది. భారతదేశంలోనే శిశు మరణాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రంగా రికార్డు నెలకొల్పిందని న్యూయార్క్ టైమ్స్ గుర్తు చేసింది. సగం మంది చిన్నారుల ఎదుగుదల లోపించిందని, విద్యాబోధన నిరాశా జనకంగా ఉన్నదని వివరించింది. యూపీలో నిరుద్యోగ సమస్య అత్యంత ప్రధాన సమస్యగా పరిణమించిందని పేర్కొన్నది.

మోదీ డ్రీమ్ లాండ్ గా యూపీని మారుస్తానన్న యోగి ఆదిత్యనాథ్

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ 'నా ప్రభుత్వం అందరిది. ఏ ఒక్కరి కోసమో, ఒక కులం, మతం వారి కోసం కాదు' అని ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ డెవలప్ మెంట్ మోడల్ 'డ్రీమ్ లాండ్‌'కు అనుగుణంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చేస్తానని హామీనిచ్చారు. కానీ ముస్లిం మైనారిటీల పట్ల వ్యతిరేకతతో అంగ బలంతో ముందుకు వెళుతున్న హిందూ జాతీయ వాదానికి, ప్రధాని నరేంద్రమోదీ ముందుకు తీసుకెళ్తున్న ఆర్థిక ప్రగతికి మధ్య ఎటువంటి వైరుద్యం కనిపించడం లేదని న్యూయార్క్ టైమ్స్ వివరించింది.

మోదీ ఆర్థిక విధానాలతో ప్రగతి భేష్.. ఉపాధి శూన్యం

అయితే ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రగతి సాధిస్తున్నాయేగానీ ఉద్యోగావకాశాలు నెలకొల్పడం లేదని గుర్తు చేసింది. ఉద్యోగాల డిమాండ్‌కు అనుగుణంగా ప్రతి నెలా భారతదేశంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్న న్యూయార్క్ టైమ్స్.. ఈ రంగంలో యోగి ఆదిత్యనాథ్ విఫలమవుతారన్న భయంతోనే మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ.. ముస్లిం వ్యతిరేకతను ఆధారంగా చేసుకుని అధికారంలో కొనసాగాలని తలపోస్తున్నదని వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ డ్రీమ్ ల్యాండ్ నినాదంతో భారతదేశంలోని మైనారిటీలకు కష్టకాలమేనని, అదే సమయంలో ప్రజలందరికి ప్రగతి సాధిస్తానని మోదీ ఇచ్చిన హామీలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New Delhi: India reacted sharply to The New York Times' editorial criticising Prime Minister Narendra Modi's choice of Adityanath Yogi as the Chief Minister of Uttar Pradesh, and said the paper's wisdom to write such a piece was "questionable".
Please Wait while comments are loading...