గత 24 గంటల్లో అత్యల్ప కేసుల వృద్ధిరేటు: 25 వేలు దాటిన కేసులు, 794 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వ్యాప్తి చెందే వేగం మాత్రం తగ్గడం ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు పడుతున్న కాలం సగటున 9.1 రోజులని కేంద్ర ప్రభుత్వం శనివారం వెల్లడించింది.

కరోనా కేసుల అత్యల్ప వృద్ధిరేటు..
శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు కొత్త కేసుల వృద్ధిరేటు 6గా నమోదైందని తెలిపింది. మనదేశంలో 100 కేసులు దాటిన తర్వాత అత్యల్ప రోజువారీ వృద్ధిరేటు ఇదేనని పేర్కొంది. కరోనాపై కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన ఏర్పాటైన అత్యున్నతస్థాయి మంత్రుల కమిటీ 13వ సమావేశం జరిగింది. దేశంలోని కరోనా ఆస్పత్రుల్ని రాష్ట్రాల వారీగా మంత్రుల కమిటీ వివరించింది. దేశంలో ప్రతి రోజు లక్ష కన్నా ఎక్కువగా పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులు తయారవుతున్నాయని, 104 సంస్థలు పీపీఈలు, మూడు సంస్థలు ఎన్95 మాస్కులు తయారు చేస్తున్నాయని తెలిపారు. గతంలో గుర్తించిన దేశీయ తయారీదారులు పీపీఈ కిట్లు, మాస్కుల తయారీని ప్రారంభించాయని తెలిపింది. తొమ్మిది సంస్థల్లో 59వేలకు పైగా ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది.

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో మెరుగ్గా..
ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 3.1శాతంగా ఉందని, కోలుకుంటున్న వారి శాతం 20 కన్నా ఎక్కువగా ఉందని తెలిపారు. చాలా దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గానే ఉందని.. లాక్‌డౌన్, క్లస్టర్ నిర్వహణ; కరోనా కట్టడి వ్యూహం ఫలితంగానే ఇది సాధ్యమైందని తెలిపింది. సగటున 9.1 రోజులకు కేసులు రెట్టింపు అవుతున్నాయని, ఇప్పటి వరకు 20.66 శాతం రేటుతో 5,062 మంది కోలుకున్నారని తెలిపింది. శుక్రవారం ఉదయం నుంచి 1429 కేసులు నమోదయ్యాయని మంత్రుల కమిటీ తెలిపింది.

జిల్లాలు సిద్ధంగా ఉండాలి..
దేశంలో కరోనా కట్టడి కోసం జిల్లాలు అత్యవసర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కమిటీ ఆదేశించింది. దేశ వ్యాప్తంగా వలస కూలీలకు 92వేల స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలు, సామాజిక సంస్థలు ఆహారం అందిస్తున్నాయని తెలిపింది. ఆరోగ్య కార్యకర్తలు, ఎన్ఎస్ఎస్, ఎన్‌వైకే, ఎన్‌సీసీ, వైద్యుల జాతీయస్థాయి మెటా డేటాను రాష్ట్రాలు, జిల్లాల అధికారులతో పంచుకున్నామని మంత్రుల కమిటీ తెలిపింది. అవసరమైనప్పుడు వాలంటీర్లను మోహరించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.
Recommended Video

25వేలు దాటిన కేసులు..
1.24 కోట్ల మందికి సంబంధించిన సమాచారం డ్యాష్ బోర్డులో ఉందని, నిరంతరం దానిని అప్‌డేట్ చేస్తున్నామని కమిటీ వెల్లడించింది. కొవిడ్19 వారియర్లు ఆరోగ్యశాఖ వెబ్‌సైట్ , ఐగాట్ శిక్షణ పోర్టల్ వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా శిక్షణ పొందారని తెలిపింది. కాగా, దేశంలో ఇప్పటి వరకు 25,029 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 5726 మంది కరోనా నుంచి కోలుకోగా, 794 మంది కరోనాతో మరణించారు.












Click it and Unblock the Notifications