ఐరాసలో తేల్చుకోబోతున్న భారత్- భద్రతామండలిలో 13 దేశాల మధ్దతు..!
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి విషయంలో ఇప్పటికే పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్న కేంద్రం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్రకు సంబంధించి అంతర్జాతీయంగా పలు దేశాలకు తమ వాదన వినిపిస్తున్న భారత్.. ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలోనే ఈ వ్యవహారం తేల్చుకునేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ ను పూర్తిగా ఒంటరి చేయబోతోంది.
పహల్గాం దాడిలో పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు పాల్గొన్నట్లు ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లడంలో సక్సెస్ అయిన భారత్ ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలోనూ తీర్మానం ప్రవేశపెట్టి చర్చ జరిపించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఐరాస భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల్లో చైనా, పాకిస్తాన్ మినహా 13 దేశాల మద్దతు సంపాదించడంలో భారత్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో ఐరాస భద్రతా మండలిలో పహల్గాం దాడిపై చర్చ చేపట్టేందుకు మార్గం సుగమం అయినట్లు సమాచారం.

పహల్గాం దాడి అంశాన్ని ద్వైపాక్షిక రాజకీయ వివాదంగా కాకుండా అంతర్జాతీయ ఉగ్రవాద ముప్పుగా ప్రపంచానికి చెప్పేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఐరాస భద్రతా మండలిలో మెజార్టీ సభ్య దేశాల మద్దతు సంపాదిస్తోంది. ఐరాస భద్రతామండలిలో పహల్గాం దాడిపై చర్చ జరిగి ఓటింగ్ లో నెగ్గితే పాకిస్తాన్ ఒంటరి కావడం ఖాయమని భారత్ అంచనా వేస్తోంది. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ సైనిక-నిఘా సంస్థ నుండి సాయం లభిస్తుందనే భారత్ వాదనకు ఐరాసలో మద్దతు లభిస్తే అది అతిపెద్ద దౌత్య విజయంగా మారుతుంది.
మరోవైపు పాకిస్తాన్ కూడా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారత్ నిర్ణయాన్ని ఐరాసలో లేవనెత్తాలని యోచిస్తోంది. దీనిని చట్టవిరుద్ధమైన, ఏకపక్ష ప్రయత్నంగా పాకిస్తాన్ చెబుతోంది. దీంతో ఈ వాదనను కూడా కౌంటర్ చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా భారత్ ప్రవేశపెట్టే తీర్మానంపై చర్చ జరిగి విజయం సాధిస్తే ఇక పాకిస్తాన్ వాదనకు బలం లేకుండా పోతుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications