ఇరాన్ వార్ నేర్పిన పాఠం..! మంగళూరులో కేంద్రం 15 వేల కోట్ల ప్రాజెక్ట్..!
అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడినా దేశీయంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు భారత్ (India) కీలక అడుగు వేసింది. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో మంగళూరులో దాదాపు రూ. 15,000 కోట్ల వ్యయంతో సరికొత్త బృహత్ వ్యూహాత్మక ముడి చమురు నిల్వ కేంద్రాన్ని (SPR) ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
భూగర్భ గుహల (caverns) రూపంలో నిర్మించే ఈ నిల్వ కేంద్ర సామర్థ్యం 1.75 మిలియన్ మెట్రిక్ టన్నులుగా (MMT) ఉండనుంది. ఇందుకోసం ఓఎన్‌జీసీ యాజమాన్యంలోనే ఉన్న భూమిని వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం కేవలం రూ. 5,000 కోట్లే అయినప్పటికీ, ప్రస్తుత రేట్లకు తగినట్లుగా ఇందులో చమురు నింపేందుకు మరో రూ. 10,000 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఈ ప్రాజెక్ట్ ద్వారా వ్యూహాత్మక చమురు నిల్వల నిర్వహణ బాధ్యతను పూర్తిస్థాయిలో ఒక ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించడం దేశ ఇంధన విధానాల్లోనే సరికొత్త మార్పుగా నిలవనుంది.

పశ్చిమ ఆసియాలో రాజుకున్న ఇరాన్ సంక్షోభ ప్రభావం భారత్‌కు గట్టి గుణపాఠం నేర్పింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఏర్పడిన ప్రతిసారీ ముడి చమురు మూలాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రస్తుతం భారత్ అత్యవసర నిల్వలు చాలా పరిమితంగా ఉన్నాయి. చైనా, అమెరికా వంటి దేశాలు అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో తమ నిల్వలపై ఆధారపడగా, భారత్ అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక ధరలకు చమురు కొనుగోలు చేయాల్సిన విపత్కర పరిస్థితులు ఎదుర్కొంది. దీనిని అధిగమించేందుకు పెద్ద ఎత్తున నిల్వలను సమకూర్చుకోవడం అత్యంత రక్షణాత్మక చర్యగా మారింది.
గణాంకాల ప్రకారం భారత్ రోజుకు దాదాపు 50 లక్షల బారెళ్ల చమురును వినియోగిస్తోంది. అయితే, 2025 చివరి సమయానికి దేశంలో అత్యవసర చమురు నిల్వలు కేవలం 2.1 కోట్ల బారెళ్లు మాత్రమే ఉండటం గమనార్హం. ప్రపంచంలోని ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఉదాహరణకు చైనా వద్ద అత్యధికంగా 139.7 కోట్ల బారెళ్లు, అమెరికా వద్ద 41.3 కోట్ల బారెళ్లు, జపాన్ వద్ద 26.3 కోట్ల బారెళ్ల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ సైతం తన వ్యూహాత్మక నిల్వల సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి వచ్చింది.

మంగళూరులో కొత్త భూగర్భ నిల్వ కేంద్రం అందుబాటులోకి వస్తే భారత్ ప్రస్తుతం కలిగి ఉన్న 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యూహాత్మక నిల్వ సామర్థ్యం దాదాపు మూడో వంతు మేర పెరుగుతుంది. భవిష్యత్తులో వచ్చే భౌగోళిక రాజకీయ ఒడిదొడుకులు, మార్కెట్లో చమురు ధరల పెరుగుదల మరియు రూపాయి కరెన్సీ హెచ్చుతగ్గుల నుంచి భారతీయ రిఫైనరీలను కాపాడటంతో పాటు దేశ ఆర్థిక భద్రతను సుస్థిరం చేయడానికి ఈ కొత్త ప్రాజెక్ట్ ఒక చారిత్రక రక్షణ కవచంలా ఉపయోగపడనుంది.














Click it and Unblock the Notifications