మరోసారి తాలిబన్లతో చర్చలు జరపనున్న భారత్: మాస్కో వేదికగా రేపే భేటీ
న్యూఢిల్లీ: ఆప్ఘనిస్థాన్ అంశంలో తాలిబన్లతో మరోసారి భారత్ చర్చలు జరపనుంది. మాస్కో వేదికగా ఆప్ఘనిస్థాన్ తాలిబన్లతో బుధవారం(అక్టోబర్ 20న) చర్చలు జరగనున్నాయని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. ఈ సమావేశంలో భారత్, రష్యాలతోపాటు మరో పది దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్లొంటారని తెలిపింది.
ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన ప్రారంభమైన నేపథ్యంలో అక్కడి మిలిటరీ, రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ ఏర్పాటు, తదితర అంశాలపై చర్చించనున్నట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ సమావేశం పూర్తయిన తర్వాత సంయుక్త ప్రకటన వెలువడుతుందని తెలిపింది.

ఆగస్టు 31న దోహాలో తాలిబన్ ప్రతినిధులతో భారత ప్రతినిధులు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఆప్ఘనిస్థాన్‌ను విదేశీ శక్తులు ఉపయోగించుకునేందుకు వీలు కల్పించవద్దని, ఉగ్రవాదులకు అడ్డాగా మార్చవద్దని భారత్.. తాలిబన్లకు తేల్చి చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు మాస్కో ఫార్మట్ సమావేశం ద్వారా రెండోసారి తాలిబన్లతో భారత్ భేటీ కానుంది.
రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు. ప్రస్తుతం తాము ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని గుర్తించడం లేదని లావ్రోవ్ తెలిపారు. విధానాలు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, రష్యా ఏర్పాటు చేసిన తాలిబన్ల సమావేశానికి తాము హాజరుకావడం లేదని అమెరికా స్పష్టం చేసింది.
Recommended Video
కాగా, తమ ప్రభుత్వాన్ని బలహీనపర్చేందుకు ఎవరైనా కుట్రలు చేస్తే ఆప్ఘన్ దేశంలో తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని తాలిబన్లు హెచ్చరిస్తున్నారు. ఇతరదేశాలకు వెళ్లేవారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఆప్ఘాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆనాటి నుంచి ఆప్ఘాన్‌లో అరాచక పాలన మొదలైంది. మహిళలకు పూర్తిగా స్వేచ్ఛ లేకుండా పోయింది. బాలికలు, మహిళలు చదువులను అనుమతించడం లేదు. ఒంటరిగా మహిళలు బయటికి రాకూడదు. ప్రస్తుతం బాలురకే విద్యను అనుమతించారు తాలిబన్లు. తాలిబన్ల పాలనలో ఉగ్రవాదులు కూడా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే పలుమార్లు దాడులకు పాల్పడిన ఐఎస్ ఉగ్రవాదులు వందలాది మంది ప్రాణాలు తీశారు.












Click it and Unblock the Notifications