ఒక్కసారి హిందువులు జాగృతమైతే..: తేల్చి చెప్పిన ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ప్రస్తుతం అమెరికా, కెనడాల్లో పర్యటిస్తోన్నారు. ఇప్పటికే న్యూయార్క్ ను సందర్శించారు. తాజాగా టొరంటోకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన హిందూ విశ్వబంధు- ఎంబ్రాస్ ది వరల్డ్ ఇన్ ఫ్రెండ్షిప్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కెనడియన్ హిందూస్ ఫర్ ఔట్రీచ్, రిలేషన్స్ అండ్ డైలాగ్ సంస్థ ఈ అంతర్జాతీయ సెమినార్ ను ఏర్పాటు చేసింది.
ఇందులో మోహన్ భగవత్ మాట్లాడారు. హిందూయిజం, భారత గడ్డ గొప్పతనాన్ని గుర్తు చేశారు. భారత సాంస్కృతిక జీవన విధానం విశిష్టతలను వివరించారు. అంతర్జాతీయంగా ఏ దేశంలో ప్రకృతి విపత్తులు, ఆర్థిక సంక్షోభాలు తలెత్తినా భారత్ ఎప్పుడూ వెనుకాడకుండా తన వంతు సహాయాన్ని అందిస్తూనే ఉందని అన్నారు. ఇతర దేశాలు అడగకపోయినా ముందుకు వచ్చి సాయం చేయడమే భారత్ అసలైన మానవీయ ఆలోచనా విధానమని పేర్కొన్నారు.

ఇతరులకు సహాయం చేయడం అనేది భారత సనాతన సంస్కృతిలోనే నిక్షిప్తమై ఉందని భగవత్ పేర్కొన్నారు. హిందువులు ఒక్కసారి జాగృతమైతే.. ప్రపంచం మొత్తం జాగృతమౌతుందని తేల్చి చెప్పారు. అదే.. భారతీయ సమాజ సంస్కృతికి చెందిన నైతిక డీఎన్ఏ అని ఆయన అభివర్ణించారు. ఆ నైజమే భారత్ ను అత్యున్నత స్థానంలో నిలబెట్టిందని, వసుధైక కుటుంబకం అనే సూత్రానికి ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని అన్నారు.
దేశ సనాతన వారసత్వం మనుషులనే కాకుండా ప్రకృతిని, సకల జీవులను తన కుటుంబంగా భావిస్తుందని మోహన్ భాగవత్ చెప్పారు. భిన్నత్వం అనేది ఎప్పుడూ సమస్య కాలేదని, భిన్నత్వాన్ని ఏకత్వ రూపంగా ఇక్కడి సమాజం గుర్తిస్తుందని అన్నారు. సకల చరాచర సృష్టిని తమ సొంతంగా భావించడమే హిందూ ధర్మం నేర్పిన ఉన్నతమైన జీవన సూత్రమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులంతా వసుధైక కుటుంబకం అనే పదాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తారని, విశ్వ శాంతి సాధన కోసం కృషి చేయడమే నిజమైన మానవ ధర్మమని ఆయన ఉద్ఘాటించారు.
ప్రపంచంలో ఓ క్రూర సూపర్ పవర్ ఎదగాలని భారత్ ఎప్పుడూ కోరుకోలేదని, ప్రపంచ దేశాలకు సాత్విక మార్గాన్ని చూపే ఒక విశ్వగురువుగా నిలవడమే లక్ష్యమని చెప్పారు. సరైన రవాణా సౌకర్యాలు, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు లేని రోజుల్లోనే మన పూర్వీకులు సుదూర ప్రాంతాలకు ప్రయాణించారని విశ్లేషించారు. గుర్రపు బండ్లు, సాధారణ పడవలు, కాలినడకన హిమాలయాలు దాటి చైనా, మంగోలియా వరకు ప్రయాణించి ఉన్నత సాంస్కృతిక విజ్ఞానాన్ని అందించారని అన్నారు.
సుదూర ప్రాంతాలకు వెళ్లినా ఎక్కడా సామ్రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేయలేదని, అక్కడి ప్రజలపై ఎలాంటి బలవంతపు మత మార్పిడులకు పాల్పడలేదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. భారత్ నుంచి వెళ్లిన సాధువులు, పండితులు ప్రపంచ దేశాలకు ఆయుర్వేదం, ఖగోళ శాస్త్రం వంటి రంగాలకు తమ అమూల్యమైన విజ్ఞానాన్ని ప్రసాదించారే తప్ప విధ్వంసాన్ని కోరుకోలేదని పేర్కొన్నారు. నాగరిక విలువలను వారితో పంచుకున్నారని, అంతేకానీ ఎవరి స్వేచ్ఛను హరించలేదని వివరించారు.












Click it and Unblock the Notifications