దుబాయ్‌లో మోడీకి అరుదైన గౌరవం(పిక్చర్స్)
అబుదాబి: భరత్-యూఏఈల మధ్య మరింతగా బలమైన ఆర్థిక, ద్వైపాక్షిక బంధం బలపడగలదన్న ఆశాభావాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తం చేశారు. భౌగోళికంగా, వ్యాపార, వాణిజ్యపరంగా కీలకమైన యునైటెడ్ అరబ్ కింగ్‌డంలో రెండు రోజుల పర్యటనార్థం ఆదివారం ఇక్కడికి చేరుకున్న భారత ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది.
కేవలం ద్వైపాక్షిక వాణిజ్యంలోనే కాకుండా ఉగ్రవాద నిరోధనలోనూ రెండు దేశాలు కలసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతో ఉందని మోడీ పేర్కొన్నారు.
‘హలో యూఏఈ.. నా పర్యటన విజయవంతం అవుతుందన్న ఆశాభావంతో ఉన్నాను. యూఏఈ అంటే మినీ భారతదేశం. నా పర్యటన సందర్భంగా జరిపే చర్చలు ఇరు దేశాల సంబంధాలను కొత్త పుంతలు తొక్కిస్తాయన్న నమ్మకం నాకు ఉంది' అంటూ ఇక్కడ అడుగు పెట్టిన వెంటనే అరబిక్‌లో మోడీ ట్వీట్ చేశారు.

దుబాయ్‌లో మోడీ
'ఉగ్రవాదం మానవాళికే పెనుసవాల్‌గా మారింది. ఏమాత్రం ఆలస్యం లేకుండా దీనిపై ఉమ్మడి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మానవత్వంపై నమ్మకం ఉన్న దేశాలన్నీ ఏకతాటిపై నిలబడి ఉగ్రవాదంపై పోరాడాలి' అని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు.

దుబాయ్‌లో మోడీ
దుబాయ్ పురోగతి గురించి అనేక ఏళ్లుగా వింటున్నాననీ, ఇక్కడకు వచ్చే అవకాశం మాత్రం ఇప్పుడే తొలిసారి లభించిందని చెప్పారు. ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసి, సమీపంలోనే ఉంటున్నప్పటికీ గత 34 ఏళ్లలో భారత ప్రధానుల్లో ఒక్కరైనా యూఏఈకి రాకపోవడం అసాధారణమని అన్నారు.

దుబాయ్‌లో మోడీ
ఇప్పుడు రెండు దేశాలూ పరస్పరం అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వాముల్లో తొలి మూడు స్థానాల్లో నిలుస్తున్నాయని చెప్పారు. భారత్‌తో అత్యుత్తమ వాయుమార్గ అనుసంధానత ఉన్న దేశం యూఏఈ మాత్రమేనని చెప్పారు. ఈ ప్రాంతంలో భద్రత, వ్యూహాత్మక అంశాలు సహా ఇరు దేశాలకూ ఉమ్మడి అంశాలు అనేకం ఉన్నాయన్నారు.

దుబాయ్‌లో మోడీ
మధ్యప్రాచ్య, గల్ఫ్ దేశాలన్నింటితో భారత్‌కు మంచి సంబంధాలున్నాయనీ, ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల ప్రబలుతున్న హింస, అస్థిరతపై తాము ఆందోళన చెందుతున్నామని భారత ప్రధాని చెప్పారు.

దుబాయ్‌లో మోడీ
తనకు లభించిన సంప్రదాయబద్ద, ఘన స్వాగతంపై హర్షం వ్యక్తం చేస్తూ- పర్యటన ఫలితాలపై ఎంతో ఆశాభావంతో ఉన్నట్లు చెప్పారు. 800 బిలియన్ డాలర్ల నిధులున్న అబుదాబి పెట్టుబడుల సంస్థ (ఎడిఐఎ) మేనేజింగ్ డైరెక్టర్ హమీద్ బిన్ జాయెద్ అల్ నహైన్ ఇచ్చిన విందులో భారత ప్రధాని పాల్గొన్నారు.
గత మూడున్నర దశాబ్దాల్లో భారత ప్రధాని ఎవరూ యూఏఈలో పర్యటించని నేపథ్యంలో మోడీ పర్యటనకు అనేక కోణాల్లో ప్రాధాన్యత లభించింది. అబుధాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహయాన్ తన ఐదుగురు సోదరులతో కలిసి వచ్చి మోడీకి స్వాగతం పలికారు. ఇలా సోదరులందరితో కలిసి వచ్చి యువరాజు ఏ దేశాధినేతకు కూడా స్వాగతం పలికిన సందర్భాలు లేకపోవడం గమనార్హం.
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత దాదాపు 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ దేశంలో అడుగుపెట్టిన భారత ప్రధానికి ఆ తరహా స్వాగతం లభించడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా, ఇరు దేశాల మధ్య విస్తృత స్థాయిలో సహాయ సహకారాలను పెంపొందించుకోవాలన్న బృహత్తర లక్ష్యంతో మోడీ సోమవారం కీలక చర్చలు జరుపనున్నారు.












Click it and Unblock the Notifications