సమాచారం ఇక బలోపేతం: నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్-18
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన రోదసీ పథంకలో మరో మైలురాయిని అధిరోహించింది. భారత్‌కు చెందిన జిశాట్-18 ఉపగ్రహాన్ని ఐరోపాకు చెందిన ఏరియన్ 5విఏ-231 రాకెట్‌తో గురువారం ఫ్రెంచ్ గయానాలోని కౌరూ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక దాదాపు 2.00గంటల సమయంలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ఉపగ్రహం ద్వారా భారత్ దేశ టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ మరింత శక్తివంతమవుతుంది.
దక్షిణ అమెరికాలోని ఈశాన్య తీరంలో ఉన్న ఫ్రెంచ్ గయానా.. ఫ్రాన్స్ నియంత్రణలో ఉంది. 3404 కిలోల బరువున్న జీశాట్-18తోపాటు ఆస్ట్రేలియా సంస్థ నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ (ఎన్‌బీఎన్)కు చెందిన 'స్కై మస్టర్-2' ఉపగ్రహాన్ని ఏరియాన్ రాకెట్ మోసుకెళ్లింది. నిజానికి ఈ ప్రయోగం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరగాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా 24 గంటల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది.
ప్రయోగించిన 32 నిమిషాల తర్వాత రాకెట్ నుంచి విడిపోయిన జీశాట్-18.. దీర్ఘవృత్తాకార భూ అనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లో చేరింది. ఈ కక్ష్యలో భూసమీప బిందువు (పెరిజీ) 251.7 కిలోమీటర్లు కాగా సుదూర బిందువు (అపోజీ) 35,888 కిలోమీటర్లుగా ఉంది.

ఆ వెంటనే కర్ణాటకలోని హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (ఎంసీఎఫ్).. ఈ ఉపగ్రహాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ప్రాథమిక స్థాయి పరీక్షలు నిర్వహించి, అంతా సవ్యంగానే ఉన్నట్లు తేల్చింది. ప్రయోగం ఆసాంతం చక్కగా సాగిందని ఇస్రో ఛైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ తెలిపారు. జీశాట్-18 చాలా ముఖ్యమైన ఉపగ్రహమని ఆయన చెప్పారు. ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని ఆయన మిషన్ కంట్రోల్ కేంద్రం నుంచి వీక్షించారు.
త్వరలో కక్ష్య పెంపు
జీశాట్-18కు రానున్న రోజుల్లో కక్ష్య పెంపు విన్యాసాలను ఇస్రో నిర్వహించనుంది. ఉపగ్రహంలోని సొంత చోదక వ్యవస్థ సాయంతో భూమధ్య రేఖకు ఎగువన 36వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి చేరుస్తుంది. 74 డిగ్రీల తూర్పు రేఖాంశంపైన దీన్ని ఉంచుతారు. కక్ష్యను పెంచాక ఉపగ్రహంలోని సౌర ఫలకాలను, యాంటెన్నా రిఫ్లెక్టర్లను విచ్చుకునేలా చేస్తారు. అనంతంర కొన్ని పరీక్షలు నిర్వహించి, వినియోగంలోకి తీసుకొస్తారు.
కమ్యూనికేషన్ సేవలు బలోపేతం
ప్రస్తుతం ఇస్రో వద్ద 14 టెలికాం ఉపగ్రహాలు ఉన్నాయి. జీశాట్-18 వల్ల ఈ ఉపగ్రహ కుటుంబం మరింత బలోపేతమవుతుంది. జీశాట్-18లో సాధారణ సి బ్యాండ్, ఎగువ విస్తృత సి-బ్యాండ్, కేయూ బ్యాండ్‌లలో పనిచేసే 48 కమ్యూనికేషన్ ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. 15 ఏళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలు అందిస్తుంది.
భూమి మీదున్న యాంటెన్నాలను నిర్దిష్టంగా తన వైపు మళ్లేలా చేయడంలో సాయపడే కేయీ బ్యాండ్ బీకాన్ కూడా ఇందులో ఉంది. ఇదే శ్రేణిలోని జీశాట్-17, జీశాట్-11 ఉపగ్రహాలను ఏరియాన్ రాకెట్ ద్వారానే వచ్చే ఏడాది ఆరంభంలో ప్రయోగించనున్నారు. దేశంలో తీవ్రంగాఉన్న ట్రాన్స్‌పాండర్ల కొరతను కొంతమేర అధిగమించడానికి ఇవి దోహదపడతాయి.
35 ఏళ్లుగా ఏరియాన్ సేవలు
ఐరోపా అంతరిక్ష సంస్థ ద్వారా ఇస్రో పంపిన 20వ ఉపగ్రహమిది. 1981లో ప్రయోగించిన యాపిల్ ఉపగ్రహం మొదటిది. భారీ ఉపగ్రహాలను మోసుకెళ్లే సామర్థ్యం భారత్‌కు లేనందువల్ల ఏరియాన్ రాకెట్‌పై 35 ఏళ్లుగా ఇస్రో ఆధారపడుతోంది. జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ పూర్తిస్థాయిలో సిద్ధమైతే భారత్‌కు ఈ కొరత తీరుతుంది. మొత్తం మీద ఏరియాన్ రాకెట్ శ్రేణికి ఇది 280వ ప్రయోగం.












Click it and Unblock the Notifications