Train Charges: ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్- ఆ రైళ్లలో తగ్గనున్న టికెట్ రేట్లు..!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్ధల్లో ఒకటైన భారతీయ రైల్వే మారుతున్న కాలాన్నీ, ప్రయాణికుల అవసరాల్ని దృష్టిలో ఉంచుకని ఈ మధ్య పెను మార్పులు చేస్తోంది. ఓవైపు వందే భారత్ రైళ్లు, మరోవైపు అమృత్ భారత్ రైళ్లు.. ఇలా రోజుకో రకం రైళ్లను పట్టాలపై పరుగులు తీయిస్తోంది. అయితే ఈ హడావిడిలో పడి మధ్యతరగతి, పేదలు ప్రయాణించే పాసింజర్ రైళ్లను ఎక్స్ ప్రెస్ రైళ్లుగా కూడా మార్చేస్తోంది. దీంతో వీరంతా పెరిగిన ఛార్జీల మోతను భరించలేక రైళ్లకు దూరమవుతున్నారు.
ఈ నేపథ్యంలో పునరాలోచనలో పడిన భారతీయ రైల్వే గతంలో రద్దు చేసిన ఓ విధానాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. గతంలో కరోనాకు ముందు పాసింజర్ రైళ్లలో సెకండ్ క్లాస్, ఆర్డినరీ తరగతి ఛార్జీలు ఉండేవి. వాటిని ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మార్చేసి వాటితో సమానంగా ఛార్జీలు కూడా పెంచేసింది. దీంతో మధ్యతరగతి, పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని ప్రభావం రైళ్లలో ఆక్యుపెన్సీ పైనా పడుతోంది. ఈ నేపథ్యంలో తిరిగి ఆర్డినరీ, సెకండ్ క్లాస్ ఛార్జీలు ప్రవేశపెట్టాలని రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా నేపథ్యంలో 2020లో భారతీయ రైల్వే 502 పాసింజర్ రైళ్లను ఎక్స్ ప్రెస్ లుగా మార్చేసింది. వీటిలో ఛార్జీల్ని సైతం పెంచేసి ఆర్డినరీ, సెకండ్ క్లాస్ లను తీసేసింది. దీంతో అప్పటికే ఉన్న ఛార్జీలు కాస్తా రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ సమీక్ష నిర్వహించిన రైల్వే బోర్డు.. తిరిగి ఆర్డినరీ, సెకండ్ క్లాస్ ఛార్జీలు పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇవి అమల్లోకి రావడంతో ప్రస్తుతం చెల్లిస్తున్న ఛార్జీలు సగానికి తగ్గబోతున్నాయి.












Click it and Unblock the Notifications