రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!
దేశవ్యాప్తంగా రైల్వేల్లో (indian railways) భారీ ఎత్తున సంస్కరణలు చేపడుతున్న కేంద్రం ఇవాళ్టి నుంచి మరో నిబంధనలో మార్పు చేసింది. ఇది ఇవాళ్టి నుంచే అమల్లోకి కూడా వచ్చేసింది. ఓ స్టేషన్ లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు దాన్ని మార్చుకునేందుకు గతంలో ఉన్న నిబంధనలను రైల్వేశాఖ మార్పు చేసింది. ఇందుకు పలు షరతులు కూడా పెట్టింది. కాబట్టి ఇకపై ఇలా బోర్డింగ్ పాయింట్ మార్చుకోవాలనే ప్రయాణికులు ఈ కొత్త నిబంధనను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది.
గతంలో ఏదైనా రైలుకు ఏదైనా స్టేషన్ నుంచి రిజర్వేషన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు దాన్ని మార్చుకోవాల్సి వస్తే 24 గంటల ముందు చేసుకోవాల్సి వచ్చేది. అప్పుడు నాలుగు గంటల ముందు ప్రిపేర్ చేసే ఫస్ట్ ఛార్ట్ లో ఈ మార్పు కనిపించేది. అలా కాకుండా మధ్యలో మార్చుకుంటే ఇబ్బందులు తప్పేవి కాదు. కానీ ఇప్పుడు రైల్వే శాఖ దాన్ని కాస్తా రైలు బయలుదేరడానికి అర గంట ముందుకు మార్చేసింది. దీంతో ప్రయాణికులు ఇలా చేసుకున్న బోర్డింగ్ స్టేషన్ మార్పు సెకండ్ చార్ట్ లో కనిపిస్తుంది.

ఇలా బోర్డింగ్ పాయింట్ల మార్పును ఐఆర్సీటీసీ వెబ్ సైట్ తో పాటు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కూడా చేసుకునేందుకు ఇవాళ్టి నుంచి అవకాశం కల్పించారు. టికెట్ తో పాటు ఐడీ ప్రూఫ్ ను సమర్పించి ఇలా బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు. అయితే ఇలా బోర్డింగ్ పాయింట్ మార్చుకునేందుకు కేవలం కన్ ఫమ్ టికెట్లు కలిగిన వారితో పాటు ఆర్ఏసీ టికెట్లు ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణికులకు ఛాన్స్ లేదు. ఇద కూడా ఒకసారే మార్చుకోవచ్చు. సెకండ్ చార్ట్ ప్రిపరేషన్ కు ముందే ఇలా బోర్డింగ్ పాయింట్ మార్పు కోరేందుకు అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications