కౌంటర్లలో రిజర్వేషన్ టికెట్ తీసుకునే వారికి గుడ్ న్యూస్..! అక్టోబర్ 27 నుంచి మీకోసం..!
దేశవ్యాప్తంగా నిత్యం ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో టికెట్లు తీసుకుని లక్షలాది మంది రైలు ప్రయాణాలు చేస్తున్నారు. కానీ వీరిలో ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే ప్రయాణ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్న రైల్వే శాఖ.. నేరుగా స్టేషన్ కౌంటర్లలో టికెట్లు తీసుకున్న వారికి మాత్రం ఆ సౌకర్యం ఇవ్వడం లేదు. మరో కేసు విచారణ సందర్భంగా ఈ వ్యవహారంపై స్పందించిన సుప్రీంకోర్టు .. అక్టోబర్ 27 నుంచి కౌంటర్లలో తీసుకునే టికెట్లకు సైతం ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
దీంతో రైల్వే బోర్డు (Indian railways) ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో ఆఫ్‌లైన్ ద్వారా రిజర్వ్డ్ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు కూడా ఆప్షనల్ గా ప్రయాణ బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఆన్లైన్లో ఈ-టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం ఉండేది. ఈ కొత్త విధానాన్ని అక్టోబర్ 27లోగా అమలు చేయాలని రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలను ఆదేశించింది. కౌంటర్లో రిజర్వ్డ్ టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే, ఒక్కో టికెట్‌కు 45 పైసలు ప్రీమియం చెల్లించాలి. ఈ చెల్లింపును డిజిటల్ విధానంలో మాత్రమే చేయాలి. బీమా తీసుకోవడం తప్పనిసరి కాదు. ప్రయాణికులు తమ ఇష్టానుసారం ఈ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు.

ఇన్సూరెన్స్ తీసుకునే ప్రయాణికుల తమ మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం తప్పనిసరి. బీమా ఎంచుకున్నవారికి పాలసీ వివరాలను వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిస్తారు. ప్రయాణికులకు ఈ సదుపాయం తప్పనిసరి కాదని, ప్రీమియం చెల్లింపు విధానం ఏమిటో రిజర్వేషన్ కౌంటర్ సిబ్బంది స్పష్టంగా వివరించాలని రైల్వే బోర్డు సూచించింది. సుప్రీంకోర్టు అక్టోబర్ 6న రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు కూడా బీమా సదుపాయాన్ని విస్తరించాలని రైల్వే బోర్డును ఆదేశించింది. డిజిటల్ బుకింగ్‌లు పెరిగినప్పటికీ, మారుమూల ప్రాంతాల్లో నివసించే అనేక మంది ప్రయాణికులు ఇప్పటికీ రైల్వే కౌంటర్లపైనే ఆధారపడుతున్నారు. అలాంటి వారికి కూడా బీమా రక్షణ అందుబాటులో ఉండాలన్నది కోర్టు ఆదేశాల ఉద్దేశం.
ఈ ఇన్సూరెన్స్ వల్ల రైలు ప్రమాదాల్లో మరణం, శాశ్వత పూర్తి వైకల్యం, పాక్షిక వైకల్యం, ప్రమాదాల వల్ల గాయపడినప్పుడు ఆసుపత్రి ఖర్చులు, ప్రమాదం అనంతరం మృతదేహాన్ని తరలించడానికి అయ్యే ఖర్చులు, ప్రమాద తీవ్రత, పాలసీ నిబంధనలను బట్టి బీమా మొత్తం రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది.ఐదేళ్లలోపు పిల్లలకు బెర్త్ లేదా సీటు లేకుండా టికెట్ బుక్ చేసిన సందర్భాల్లో ఈ బీమా వర్తించదు. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలకు బెర్త్‌తో లేదా బెర్త్ లేకుండా టికెట్ బుక్ చేసినప్పుడు పథకం వర్తిస్తుంది. సాధారణ రెండో తరగతి టికెట్లు లేదా జనరల్ క్లాస్ ప్రయాణికులు ప్రస్తుతం ఈ బీమా పరిధిలోకి రారు.














Click it and Unblock the Notifications
