భారత సైనికులకు ఘోర అవమానం.. రైల్వే బోర్డుకు ఘాటు లేఖ !!
భారత దేశంలో ఎన్నికల నిర్వహణలో కీలకపాత్ర పోషించే భద్రతా దళాలకు, ఈసారి రైలు ప్రయాణం భారమైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వేలాది మంది సీఆర్‌పీఎఫ్ (CRPF) జవాన్లు, తిరుగు ప్రయాణంలో తీవ్ర నరకయాతన అనుభవించారు. ఈ మేరకు రైల్వే శాఖ వైఫల్యాలను ఎండగడుతూ, సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) రైల్వే బోర్డుకు ఘాటుగా లేఖ రాశారు.
ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది తరలింపు కోసం మొత్తం 230 ప్రత్యేక రైళ్లను కేటాయించగా, అందులో దాదాపు 200 రైళ్లు భారీగా ఆలస్యమయ్యాయి. సుమారు 150 రైళ్లు 10 నుంచి 15 గంటలు, మరో 50 రైళ్లు ఏకంగా 20 నుండి 25 గంటల జాప్యంతో గమ్యస్థానాలకు చేరుకున్నాయి. రైళ్ల రాకపోకల్లో నెలకొన్న ఈ అస్తవ్యస్తత వల్ల భోజన ఏర్పాట్లు గందరగోళంగా మారాయి. ఉదయం అందాల్సిన అల్పాహారం కూడా సాయంత్రం 5 గంటలకు అందిందంటే, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

రైళ్ల ఆలస్యం తలవని తలనొప్పిగా మారితే, బోగీల కొరత మరో ప్రధాన సమస్యగా మారింది. నిబంధనల మేరకు ప్రతి ప్రత్యేక రైలుకు 24 బోగీలను కేటాయించాల్సి ఉండగా, కేవలం 19 నుండి 20 బోగీలను మాత్రమే రైల్వే శాఖ సమకూర్చింది. 10 నుంచి 11 కంపెనీల జవాన్లు, వారి భారీ లగేజీ, పరికరాలను ఈ కొద్దిపాటి బోగీలలో సర్దడం అసాధ్యంగా మారింది. దీంతో రైలు లోపలి పరిస్థితి అత్యంత దయనీయంగా తయారై, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రయాణంలో ఉండాల్సిన కనీస అవసరాలైన నీటి సరఫరా, బోగీల శుభ్రతను రైల్వే అధికారులు పూర్తిగా విస్మరించారు. నిర్ణీత స్టేషన్లలో రైళ్లను శుభ్రం చేయాల్సి ఉన్నా, చాలా చోట్ల ఆ పని జరగలేదు. ఫలితంగా బోగీలు అపరిశుభ్రంగా మారి దుర్వాసన వెదజల్లాయి. ముఖ్యంగా మహిళా సిబ్బంది ఈ అపరిశుభ్రత వల్ల తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ సమస్యలన్నింటినీ లేఖలో ప్రస్తావించిన సీఆర్‌పీఎఫ్, భవిష్యత్తులో మెరుగైన ఏర్పాట్లు చేయాలని కోరగా, లోపాలను సరిదిద్దుతామని రైల్వే బోర్డు అధికారులు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications