అందుబాటులో వందే మెట్రో ఎక్స్‌ప్రెస్- రూట్ ఇదే
Vande Metro: దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య మరింత పెరుగుతోంది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. కొత్త కొత్త మార్గాల్లో వాటిని నడిపిస్తోంది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 60 రైళ్లు పట్టాలెక్కాయి. ఆదివారం నాడే ప్రధాని మోదీ ఆరు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. పండగ సీజన్లల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది.

అదే సమయంలో వందే భారత్ మెట్రో రైళ్లను కూడా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. నేడు గుజరాత్‌లోని భుజ్- అహ్మదాబాద్ మధ్య తొలి వందే మెట్రో ఎక్స్‌ప్రెసో పరుగులు పెట్టబోతోంది. ప్రధాని మోదీ ఈ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించబోతోన్నారు. అహ్మదాబాద్ నుంచి ఆయన భుజ్ స్టేషన్‌లో ఈ రైలుకు పచ్చజెండా ఊపనున్నారు.
భుజ్- అహ్మదాబాద్ మధ్య దూరం 359 కిలోమీటర్లు. ఈ దూరాన్ని అధిగమించడానికి వందే మెట్రోలో పట్టే సమయం 5:45 నిమిషాలు. ఈ రైలు కమర్షియల్ ఆపరేషన్స్ మంగళవారం నుంచి ఆరంభమౌతాయి. టికెట్ ఖరీదు 455 రూపాయలుగా నిర్ధారించారు. గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో వందే మెట్రో పరుగులు తీయగలదు.

సాధారణ మెట్రో రైలుతో పోల్చుకుంటే ఎంతో భిన్నంగా దీన్ని రూపొందించారు. ఒకేసారి 1,150 మంది ప్రయాణించగలిగేలా మొత్తం 12 కోచ్‌లు ఈ ఎక్స్‌ప్రెస్‌ను తీర్చిదిద్దారు. డబుల్ లీఫ్ ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్‌ను కలిగివుండటం దీని ప్రత్యేకత. సాధారణంగా మెట్రో రైలు స్టేషన్‌లల్లో ఇలాంటి డోర్స్ కనిపిస్తుంటాయి.
ఎకో ఫ్రెండ్లీ టాయ్‌లెట్స్, సీల్డ్ ఫ్లెక్సిబుల్ గ్యాంగ్‌వే, రెయిన్ ప్రూఫ్ ఇంటీరియర్‌తో అత్యాధునికంగా నిర్మించారు. భోజన సదుపాయం సైతం అందుబాటులో ఉంటుంది ఇందులో. వచ్చే 35 సంవత్సరాల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వందే మెట్రో సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రానుంది కేంద్రం.

క్రమంగా ముంబైలో ఈ వందే మెట్రో రైలు సర్వీసులు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. లక్షలాదిమంది ముంబైకర్లు రోజూ రాకపోకలు సాగించే లోకల్/సబర్బన్ రైళ్ల స్థానంలో వందే మెట్రో సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రావొచ్చు. దీనికోసం 238 సర్వీసులకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications