ఐటీ హబ్ లో పేదల స్టార్ హోటల్ ఇందిరా క్యాంటీన్లకు పూర్వవైభవం, దెబ్బతో !
బెంగళూరు: బెంగళూరులో పేదలపాలిట స్టార్ హోటల్స్ అయిన ఇందిరా క్యాంటీన్లకు పూర్వవైభవం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. గతంలో సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయిన తరువాత బెంగళూరులో ఇందిరా క్యాంటీన్లు తెరమీదకు వచ్చాయి. ఇందిరా క్యాంటీన్లలో పేదలకు అతి తక్కువ ధరకు టిఫిన్లు, భోజనం అందించారు.
అప్పటి మంత్రి డీకే శివకుమార్ స్వయంగా చెన్నై వెళ్లి అక్కడి అమ్మా క్యాంటీన్లలో ఆహారం సేవించారు. తరువాత బెంగళూరు వచ్చిన డీకే శివకుమార్ ఇందిరా క్యాంటీన్లు విషయంలో అప్పటి సీఎం సిద్దరామయ్యతో చర్చించి బెంగళూరులో ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం ఇందిరా క్యాంటీన్లు కలకలలాడాయి.

తరువాత కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరా క్యాంటీన్ల కథ అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఇందిరా క్యాంటీన్లకు పూర్వవైభవం వస్తోంది. బెంగళూరు నగరంలోని ఇందిరా క్యాంటీన్లను పరిశీలించి వాటి నిర్వహణ విషయంలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆరోగ్య శాఖ అధికారులకు బీబీఎంపీ కమీషనర్ తుషార్ గిరినాథ్ ఆదేశాలు జారీ చేశారు.
బీబీఎంపీ పరిధిలో ఇందిరా క్యాంటీన్ల నిర్వహణ విషయంలో బీబీఎంపీ కమీషనర్ తుషార్ గిరినాథ్ ఇప్పటికే సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. బీబీఎంపీ పరిధిలో మొత్తం 175 ఇందిరా క్యాంటీన్లు ఉన్నాయి. వాటిలో 163 ఇందిరా క్యాంటీన్లు పని చేస్తున్నాయని, మిగిలిన 12 ఇందిరా క్యాంటీన్లు మూతపడ్డాయని వెలుగు చూసింది.

ఇప్పుడు బీబీఎంపీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చెయ్యాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. మునుపటికంటే ఇప్పుడు ఎక్కువ రుచిగా, నాణ్యమైన ఆహారం అందించాలని, అందుకు టెండర్లు పిలవాలని సిద్దరామయ్య ప్రభుత్వం బీబీఎంపీ అధికారులకు సూచించింది. గతంలో అతి తక్కువ ధరకు ఇందిరా క్యాంటీన్లలో టిఫిన్లు, భోజనం అందించారు. అయితే ఇప్పుడు ఇందిరా క్యాంటీన్లలో ముందు కంటే ధరలు రూ. 5 నుంచి రూ. 10 పెరిగే అవకాశం ఉందని బీబీఎంపీకి చెందిన ఓ అధికారి అంటున్నారు.












Click it and Unblock the Notifications