కదలండి: కేంద్ర మంత్రిమండలి భేటీపై ప్రధాని మోడీ, 9 ఏళ్ల పాలన, ఎన్నికలపైనే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రి మండలి భేటీ ముగిసింది. త్వరలో కేంద్రమంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ ఉంటుందనే వార్తల నేపథ్యంలో ప్రధాని మోడీ నేతృత్వంలో సోమవారం జరిగిన ఈ సమావేశం ఐదుగంటలపాటు కొనసాగడం గమనార్హం. కొత్తగా నిర్మించిన ప్రగతి మైదాన్‌లో జరిగిన ఈ భేటీపై నరేంద్ర మోడీ తాజాగా ట్వీట్ చేవారు. మంత్రిమండలి సమావేశం చాలా ఫలప్రదంగా జరిగిందని ఆయన వెల్లడించారు.
విధానపరమైన నిర్ణయాలపై చర్చించినట్లు చెబుతూ.. సమావేశానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు ప్రధాని మోడీ. ఈ తొమ్మిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందని.. వచ్చే తొమ్మిది నెలల్లో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు ప్రధాని సూచించారు. ఈ సమావేశంలో భారత్ 2047 వరకు అభివృద్ధి చెందే అవకాశాలపై మంత్రులకు ప్రజెంటేషన్ ఇచ్చారు.

తొమ్మిదేళ్ల మోడీ పాలన, వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై మంత్రిమండలిలో కీలకంగా చర్చించినట్లు సమాచారం. అంతేగాక, ఈ ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలతోపాటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురావాల్సిన కీలక బిల్లులపై చర్చించినట్లు తెలిసింది.
మంత్రిమండలిలో మార్పులు, చేర్పులపై ప్రధాని మోడీ ఈ భేటీలో సంకేతాలు ఇస్తారంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. 2019లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే కేంద్రమంత్రి మండలిని విస్తరించిన విషయం తెలిసిందే. కాగా, కరోనావైరస్ మహమ్మారి పరిణామాల తర్వాత కేంద్ర మంత్రిమండలి భేటీ జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై నిర్ణయం తీసుకుంటారని రాష్ట్రంలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్‌ని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుని.. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈటల రాజేందర్, రఘునందన్ రావుకు పార్టీలో కీలక పదవులు లభించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, వీటిపై బీజేపీ అధిష్టానం నుంచి ప్రకటన రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications