సడన్‌గా INS Vikrant పై ప్రత్యక్షం: పాకిస్తాన్ కు నిద్రలేని రాత్రులు ఇచ్చాం
దీపావళి పండగ పురస్కరించుకుని ప్రధానమంత్రి అనూహ్యంగా గోవా వెళ్లారు. నౌకాదళానికి చెందిన ప్రతిష్ఠాత్మక ఐఎన్ఎస్ విక్రాంత్ పై దీపావళి వేడుకలను జరుపుకొన్నారు. నావిక దళానికి చెందిన సాయుధ బలగాలతో మాట్లాడారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. వారికి స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన నౌకదళ దుస్తులతో కనిపించారు. నౌకాదళంపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. వారితో కలిసి దీపావళి పండగ వేడుకలను జరుపుకోవడం తన అదృష్టంగా అభివర్ణించారు. భారత్ మాతా కీ జై అంటూ నినదించారు.

ఈ సంవత్సరం దీపావళి వేడుకలను జరుపుకోవడానికి ఆదివారం రాత్రే ఆయన గోవాకు చేరుకున్నారు. గోవా- కార్వార్ తీరంలో గల బేస్ స్టేషన్ లో దీపావళి వేడుకలను జరుపుకొన్నారు. రాత్రి అక్కడే బస చేశారు. ఈ ఉదయం నౌకాదళ బలగాలను ఉద్దేశించి ప్రసంగించారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ సామర్థ్యం పాకిస్తాన్‌కు నిద్రలేని రాత్రులు కలిగించిందని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ యుద్ధ విమాన వాహక నౌక వేదికగా నేవీ సిబ్బందితో కలిసి పండుగను జరుపుకోవడం తన అదృష్టంగా పేర్కొన్నారు.
నౌకాదళ ధైర్య సాహసాలు, దేశం పట్ల నిబద్ధతను కొనియాడారు. ఈ దీపావళి వేడుకలు తనకు చాలా ముఖ్యమైనదని, జీవితాంతం గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. "ఒకవైపు అంతులేని ఆకాశం, లోతు తెలియని మహాసముద్రం కనిపిస్తోంది. ఈ రెండింటి మధ్య అనంతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ పై నిల్చున్నాను. సముద్రపు అలలపై ప్రకాశవంతమైన సూర్యకిరణాల మధ్య మన వీర సైనికులతో దీపావళి జరుపుకోవడం అనందంగా ఉంది.." అని పేర్కొన్నారు.
యుద్ధనౌకపై గడపడం మరువలేని అనుభూతిని ఇచ్చిందని ప్రధాని చెప్పారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ పైన రాత్రి గడిపిన క్షణాలను మాటల్లో వర్ణించలేనని అన్నారు. దేశభక్తి గీతాలను ఆలపిస్తూ ఆపరేషన్ సింధూర్ గురించి వివరిస్తున్నప్పుడు యుద్ధభూమిలో ఓ సైనికుడిని అయ్యాననే భావన కలిగిందని మోదీ పేర్కొన్నారు. ఆ అనుభవాలను వివరించడానికి పదాలు చాలట్లేదని, మాటలు రావట్లేదని మోదీ భావోద్వేగంతో చెప్పారు. దీపావళి వంటి పవిత్ర పండుగను నేవీ వీర సైనికులతో జరుపుకోవడం చిరస్మరణీయమైదని వ్యాఖ్యానించారు.
భారత నావికా దళాల బలాన్ని, స్ఫూర్తిని దగ్గరగా చూసి తాను ఎంతగానో ప్రభావితుడయ్యానని ప్రధాని మోదీ అన్నారు. ఈ భారీ నౌకలు, గాలి కంటే వేగంగా కదిలే యుద్ధ విమానాలు, జలాంతర్గాములు.. ఇవన్నీ అద్భుతమైనవని, దేశానికి ఎంతగానో స్ఫూర్తినిస్తాయని చెప్పారు. ఈ నౌకలు ఇనుముతో తయారైనా గానీ నేవీ వీర సైనికులు దీనిపై అడుగు పెట్టినప్పుడు అవి ఊపిరి పోసుకుంటాయని, సజీవంగా కదలాడుతాయని అన్నారు.
Celebrating Diwali with our brave Navy personnel on board the INS Vikrant. https://t.co/5J9XNHwznH
— Narendra Modi (@narendramodi) October 20, 2025
రాత్రి నుండి తాను నౌకదళ బలగాలతో ఉన్నానని, ప్రతి క్షణం వారి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పారు. ఢిల్లీ నుండి బయలుదేరేటప్పుడు ఏదైతే అనుకున్నానో.. అలాంటి ఆలోచనలే ఇప్పుడు వాస్తవ రూపాన్ని దాల్చాయని మోదీ అన్నారు. "సముద్రాలను చీల్చుకుంటూ వస్తున్న విక్రాంత్.. దేశ సైనిక సామర్థ్యానికి ఓ నిలువెత్తు ప్రతీక అని అభివర్ణించారు. సాయుధ దళాలను బలోపేతం చేయడంలో ఇదొక మైలురాయివంటిదని అన్నారు.












Click it and Unblock the Notifications