అయోధ్య శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం
అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారతదేశం సగర్వంగా హిందుత్వాన్ని చాటేలా, అత్యంత చారిత్రాత్మక కట్టడం గా నిర్మించిన 2500 సంవత్సరాల పాటు ప్రకృతి విపత్తులను తట్టుకొని నిలబడేలా నిర్మిస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి, రామ్ లల్లా విగ్రహాల ప్రాణ ప్రతిష్టకు సమయం ఆసన్నం అవుతోంది. దేశవ్యాప్తంగా ప్రజలు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు వెళ్లాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు, ప్రత్యెక రైళ్ళు కూడా ఏర్పాటు చేసి భక్తులను అయోధ్యకు చేర్చనున్నారు. అయోధ్యలో రామయ్యకు జరిగే పట్టాభిషేకాన్ని చూడాలని ఆ మహత్కార్యాన్ని కళ్ళారా చూసి తరించాలని ప్రతి ఒక్కరు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న వారందరి కోరిక తీరుతున్న సమయంలో రామయ్య తాను పుట్టిన నేలమీద తిరిగి నడయాడబోతున్నాడు.

ఇదే సమయంలో దేశ, విదేశాలలోని ప్రముఖులకు రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాలను పంపిస్తున్నారు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు, విశ్వహిందూ పరిషత్ నిర్వాహకులు. ఇప్పటికే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం మరియు శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ఏపీ నేతలకు ఆహ్వానం అందింది. సినీ నటుడు చిరంజీవికి, మోహన్ బాబు తదితరులకు కూడా ఆహ్వానాలు అందాయి.
ఈనెల 22వ తేదీన అత్యంత వైభవోపేతంగా అయోధ్యలోని రామ మందిరంలో శ్రీ రామ్ లల్ల విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. విగ్రహ ప్రతిష్టాపనకు నిన్నటి నుండి సాంప్రదాయబద్ధమైన ముందస్తు క్రతువులు ప్రారంభమయ్యాయి. 22వ తేదీన జరగనున్న ఈ చారిత్రాత్మక ఘట్టానికి 150 దేశాల నుంచి నాలుగు వేల మంది ప్రముఖులు అతిథులుగా హాజరుకానున్నారు.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా అయోధ్య రామాలయంలో శ్రీరామ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందింది. అక్కడకు వెళ్ళే అతిధుల కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. టెంట్ హౌస్ లను నిర్మించి వారికి కావాల్సిన వసతి సౌకర్యం కల్పించే పనిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications