• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Iran-Hijab: 'నా కూతురు శవాన్ని కూడా నన్ను చూడనివ్వలేదు. ఆమె గురించి అధికారులు చెబుతున్నవన్నీ అబద్ధాలు'-మహసా తండ్రి ఆవేదన

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మహసా అమీనీ

ఇరాన్‌లో 22 ఏళ్ల మహసా అమీనీ మరణం ప్రకంపనాలు సృష్టించింది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆమె మరణం గురించి అధికారులు చెబుతున్నవన్నీ అబద్ధాలని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు.

మహసా అమీనీ తండ్రి అంజాద్ అమీనీ బీబీసీ పెర్షియన్‌తో మాట్లాడుతూ, తన కూతురి శవ పంచనామా (అటాప్సీ) నివేదికను కూడా తనకు చూపించలేదని, అరెస్ట్‌కు ముందే ఆమె ఆరోగ్యం బాలేదన్నది అవాస్తవమని అన్నారు.

పోలీసు కస్టడీలో ఆమెను కొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని ఆయన అన్నారు. అయితే, ఇరాన్ అధికారులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.

ఇరాన్‌లో ఇస్లామిక్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా పాటిస్తారు. ఇస్లామిక్ కోడ్ అమలు అయ్యేలా చూడడం కోసం మోరాలిటీ పోలీసు అనే ప్రత్యేక విభాగమే ఉంది.

మహసా అమీనీ హిజాబ్ నియమాలను ఉల్లంఘించారనే నెపంతో ఆమెను మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇరాన్‌లోని సకెజ్ నగరానికి చెందిన కుర్దిష్ మహిళ అమీనీ గత శుక్రవారం టెహ్రాన్ ఆస్పత్రిలో చనిపోయారు. పోలీసులు అరెస్ట్ చేశాక ఆమె స్పృహ తప్పిపడిపోయారు. మరికొద్దిసేపటికి కోమాలోకి వెళ్లిపోయారు. మూడు రోజుల తరువాత ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు.

ఆమె మరణం తర్వాత జరిగిన నిరసన ప్రదర్శనల్లో 17మంది మరణించారు. మహాసా అమీని మరణంపై విచారణ జరపుతామని ఇరాన్ అధ్యక్షుడు ఎబ్రాహిమ్ రెయిసీ అన్నారు. ఇరాన్ మీద ఆరోపణలు చేస్తూ పాశ్చాత్య దేశాలు ఆత్మవంచన చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.

మహసా అమీనీ మరణంతో ఇరాన్‌లో 20 పైగా నగరాల్లో నిరసన జ్వాలలు రగిలాయి

మహసా అమీనీ అరెస్ట్

మొరాలిటీ పోలీసులు మహసా అమీనీని అదుపులోకి తీసుకున్న తరువాత ఆమెతో తప్పుగా ప్రవర్తించలేదని, ఆమెకు "సడన్‌గా హార్ట్ ఫెయిల్" అయిందని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.

అయితే, అమీనీని పోలీసులు నిర్బంధించినప్పుడు ఆమె తమ్ముడు 17 ఏళ్ల కియారష్ పక్కనే ఉన్నారు. పోలీసులు ఆమెను కొట్టారని కియారష్ చెప్పినట్టు అంజాద్ అమీనీ వెల్లడించారు.

"నా కొడుకు అక్కడే ఉన్నాడు. ఆమెను వ్యాన్‌లోను, పోలీస్ స్టేషన్‌లోనూ కొట్టారని కొందరు సాక్షులు మా అబ్బాయికి చెప్పారు. ఆమెను తీసుకెళ్లవద్దని వాడు ప్రాథేయపడ్డాడు. వాళ్లు మా అబ్బాయిని కూడా కొట్టారు. తన బట్టలు చిరిగి ఉన్నాయి. పోలీసుల దగ్గర ఉన్న బాడీ కెమేరాలను చూపించమని అడిగాను. వాటిలో బ్యాటరీ అయిపోయిందని చెప్పారు" అని అంజాద్ అమీనీ బీబీసీకి చెప్పారు.

మహసా అమీనీ అసభ్యకరమైన దుస్తులు ధరించిన కారణంగానే అరెస్ట్ చేశామని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.

అయితే, మహసా అమీనీ ఎప్పుడూ పొడువైన గౌను వేసుకునే ఉంటారని ఆమె తండ్రి చెప్పారు.

ఇరాన్‌లో మహిళలు, పురుషులు కూడా వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు

'డాక్టర్లు అడ్డుకున్నారు'

తన కూతురు చనిపోయాక ఆమె మృతదేహాన్ని చూడడానికి డాక్టర్లు అనుమతించలేదని అంజాద్ అమీనీ చెప్పారు.

"నా కూతురిని చూడాలనుకున్నా కానీ, వాళ్లు నన్ను లోపలికి రానివ్వలేదు."

శవ పంచనామా నివేదిక చూపించమని అడిగితే, "నాకు ఏది రాయాలనిపిస్తే అది రాస్తాను.. దానితో మీకు సంబంధం లేదు" అని డాక్టరు చెప్పారని అంజాద్ అన్నారు.

అటాప్సీ గురించి తమ కుటుంబానికి ఎలాంటి సమాచారం అందించలేదని చెప్పారు.

మహసా అమీనీ మృతదేహాన్ని ఖననం కోసం తీసుకొచ్చినప్పుడు మాత్రమే అంజాద్ తన బిడ్డను చూశారు. ఆమెను పూర్తిగా చుట్టి ఉంచడం వలన పాదాలు, ముఖం మాత్రం కనబడ్డాయి.

"ఆమె పాదాలపై గాయాలు ఉన్నాయి. పాదాలు పరీక్షించమని డాక్టర్లను కోరాను" అని చెప్పారు అంజాద్.

గాయాలకు కారణాలను పరిశీలిస్తామని అధికారులు చెప్పారుగానీ, తరువాత వాళ్ల నుంచి ఏ స్పందనా లేదని అంజాద్ చెప్పారు.

"వాళ్లు నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారు." అని ఆయన అన్నారు.

టెహ్రాన్ ప్రాంత ఫోరెన్సిక్ మెడిసిన్ డైరెక్టర్ జనరల్ మెహదీ ఫరూజెష్ ఇచ్చిన ఒక ప్రకటనలో, "తలకి, ముఖానికి గాయాలు అయిన సంకేతాలు లేవు. కళ్ల చుట్టూ గాయాలు లేవు. అలాగే, మహసా అమీనీ పుర్రె కింద భాగంలో పగుళ్లు కనిపించలేదు" అని తెలిపారు.

అదే విధంగా, అంతర్గత గాయాలు అయినట్టు సూచనలేవీ కనిపించలేదని కూడా అధికారులు తెలిపారు.

అయాం మహసా అమీనీ అంటూ నిరసనకారులు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు

ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పడం

మహసా అమీనీకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకే ఆమె చనిపోయారని అధికారులు చెబుతున్నారు. అవన్నీ కట్టుకథలని ఆమె తండ్రి అంజాద్ అమీనీ అన్నారు.

మహసా అమీనీకి ఎనిమిదేళ్ల వయసులో మెదడుకు సర్జరీ జరిగిందని టెహ్రాన్ ఫోరెన్సిక్ మెడిసిన్ డైరెక్టర్ జనరల్ అన్నారు.

"వాళ్లు అబద్ధం ఆడుతున్నారు. గత 22 ఏళ్లల్లో మహసా ఆస్పత్రికి వెళ్లిందే లేదు. జలుబు తప్ప ఆమెకు ఎప్పుడూ ఏ జబ్బు చేయలేదు. ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదు. ఎలాంటి సర్జరీ జరగలేదు" అని అంజాద్ చెప్పారు.

మహసా స్నేహితులిద్దరితో బీబీసీ మాట్లాడింది. ఆమె ఇంతకుముందు ఆస్పత్రిలో చేరిన దాఖలాలు లేవని వారు చెప్పారు.

మహసా అనారోగ్యం గురించి వినిపిస్తున్న మరొక ఆరోపణను కూడా ఆమె తండ్రి ఖండించారు. ఆమె ఒక దుకాణంలో పనిచేస్తున్నప్పుడు తరచూ స్పృహ తప్పిపడిపోయేవారని చెబుతున్న మాటలు అవాస్తవని ఆయన అన్నారు.

యూనివర్సిటీలో చదువుకోవాలనే కల

మహసా అమీనీ వచ్చే వారం యూనివర్సిటీలో చేరాల్సి ఉందని ఆమె కుటుంబం చెబుతోంది. యూనివర్సిటీలో చేరేముందు సరదాగా గడపడం కోసం సెలవులకు టెహ్రాన్ వచ్చారని చెప్పారు.

"మా అమ్మాయి మైక్రోబయోలజీ చదవాలనుకుంది. డాక్టరు కావాలనుకుంది. ఆమె కల చెదిరిపోయింది. వాళ్ల ఆమ్మ బాగా బెంగ పెట్టుకుంది. మెహసాను మర్చిపోలేకపోతున్నాం. నిన్న ఆమె 23వ పుట్టినరోజు" అని చెప్పారు అంజాద్ అమీనీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Iran-Hijab: 'They didn't even let me see my daughter's dead body. All the authorities are saying about her are lies'-Mahsa's father lamented
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X