అర్ధరాత్రి బాంబుల వర్షం.. 11 మంది పిల్లలతో సహా 19 మంది దుర్మరణం!
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న వివాదం ఇప్పుడు మరింత ముదిరింది. తాజాగా పాకిస్థాన్ వైమానిక దళం అర్ధరాత్రి వేళ ఆఫ్ఘనిస్థాన్ వైమానిక పరిధిని ఉల్లంఘిస్తూ విచక్షణారహితంగా వైమానిక దాడులు జరిపింది.ఈ దాడి సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర అలజడిని సృష్టించింది.
ఈ దాడుల్లో ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వర్గాలు ధ్రువీకరించాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని కునార్, ఖోస్ట్, పక్తికా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సేనలు ఈ దాడులకు తెగబడ్డాయి. తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే అమాయక పౌరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘోర కలియుగంలో మరణించిన 19 మందిలో 11 మంది చిన్న పిల్లలు ఉండటం అత్యంత విచారకరం. మొదట మృతుల సంఖ్య 13గా ఉన్నప్పటికీ.. శిథిలాల కింద మృతదేహాలు లభ్యమవడంతో ఆ సంఖ్య మరింత పెరిగింది.

వైమానిక దాడుల కారణంగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కాలంగా ఇరు దేశాల మధ్య శత్రుత్వం విపరీతంగా పెరిగిపోవడంతో పాక్ జరిపిన వివిధ దాడుల్లో ఇప్పటికే వందలాది మంది ఆఫ్ఘన్ పౌరులు తమ ప్రాణాలను కోల్పోయారు.
ఈ దాడితో పాకిస్థాన్ ద్వంద్వ నీతి మరోసారి ప్రపంచం ముందు బయటపడింది. ఒకవైపు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి, యుద్ధాన్ని ముగించడానికి పాకిస్థాన్ మధ్యవర్తిగా నటిస్తూ ప్రపంచానికి శాంతి సందేశాలు ఇస్తోంది. కానీ మరోవైపు దానికి భిన్నంగా ఆఫ్ఘనిస్థాన్‌లోని నిస్సహాయులపై బాంబులు వేస్తూ రక్తాన్ని పారిస్తోంది. ఒకరికి బుద్ధులు చెబుతూ, తానే స్వయంగా రక్తపాతానికి ఒడిగట్టడం పాక్ కపట బుద్ధికి నిదర్శనమని విశ్లేషకులు మండిపడుతున్నారు.
పాకిస్థాన్ చేసిన ఈ దారుణానికి తాలిబాన్ ప్రభుత్వం త్వరలోనే ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ దాడికి వ్యతిరేకంగా తాలిబాన్ సేనలు సరిహద్దుల్లోని పాక్ సైనిక స్థావరాలపై ఎదురుదాడికి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉగ్రవాద దాడులు, అంతర్గత అలజడులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications