మ్యూచువల్ ఫండ్స్ పై షాకింగ్ రిపోర్ట్
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై వెలుడిన తాజా సమాచారం షాక్ కు గురి చేస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలు ఇవి. మే నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల నికర పెట్టుబడులు 40 శాతానికి పైగా తగ్గాయి. 12 నెలల కనిష్టానికి దిగజారాయి. ఏడాది కాలంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో మ్యూచువల్ ఫండ్స్ లల్లో నికర పెట్టుబడుల శాతం ఈ స్థాయిలో క్షీణించలేదు. ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అంతకుముందు నెల అంటే ఏప్రిల్ తో పోలిస్తే ఏకంగా 15,000 కోట్ల రూపాయలకు పైగా తగ్గుదలను నమోదు చేశాయి. ఏప్రిల్‌లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు 38,426 కోట్లుగా ఉండగా.. మే నాటికి ఈ మొత్తం రూ. 22,897 కోట్లకు పడిపోయింది. అయినప్పటికీ 2021 మార్చి నుండి మొదలైన పెట్టుబడుల ధోరణి కొనసాగుతూ, వరుసగా 63వ నెల కూడా సానుకూల ప్రభావం చూపడం విశేషం. మే నెలలో నమోదైన ఈ రూ. 22,897 కోట్ల పెట్టుబడి గత 12 నెలల కాలంలోనే అత్యల్పం.

ఈక్విటీ పథకాలలో గతంలో నమోదైన పెట్టుబడులను విశ్లేషిస్తే.. గత ఏడాది జూన్ నుండి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా హెచ్చుతగ్గులు కొనసాగాయి. ముఖ్యంగా ఈక్విటీ విభాగాల్లో పెట్టుబడుల వేగం మందగించింది. లార్జ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడులు ఏప్రిల్‌లో ఉన్న రూ. 2,524.6 కోట్ల నుండి మే నెలలో రూ. 1,593 కోట్లకు తగ్గాయి. అలాగే మిడ్ క్యాప్ ఫండ్స్ రూ. 4,385 కోట్లు, స్మాల్ క్యాప్ ఫండ్స్ రూ. 4,946 కోట్లను మాత్రమే రాబట్టగలిగాయి.
హైబ్రిడ్ ఫండ్ల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. వీటి నికర పెట్టుబడులు ఏప్రిల్‌లోని రూ. 20,565.2 కోట్ల నుండి మేలో రూ. 10,560 కోట్లకు పడిపోయాయి. మే నెలాఖరుకు పరిశ్రమ మొత్తం ఆస్తుల నిర్వహణ విలువ రూ. 81.58 లక్షల కోట్లుగా నమోదైంది. ఏప్రిల్‌లో ఇది రూ. 81.92 లక్షల కోట్లుగా ఉండేది. డెట్ విభాగంలో క్రెడిట్ రిస్క్ ఫండ్స్ రూ. 49.5 కోట్ల స్వల్ప పెట్టుబడులను పొందగా, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రూ. 7,010 కోట్ల నికర ఉపసంహరణలను నమోదయ్యాయి.
ఇతర విభాగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. లిక్విడ్ ఫండ్స్ రూ. 29,681 కోట్ల నికర ఉపసంహరణలకు గురికాగా, ఈటీఎఫ్ రూ. 620.2 కోట్లు, గోల్డ్ ఈటీఎఫ్ రూ. 725 కోట్ల అవుట్ ఫ్లో రికార్డ్ అయ్యాయి. అలాగే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ రూ. 651 కోట్లు, డివిడెండ్ యీల్డ్ ఫండ్స్ రూ. 97.5 కోట్ల నికర ఉపసంహరణలను నమోదు చేశాయి. కొత్త ఫండ్ ఆఫర్ల (NFO) ద్వారా వచ్చిన వసూళ్లు కూడా ఏప్రిల్ నాటి రూ. 828 కోట్ల నుండి మే నాటికి రూ. 471 కోట్లకు తగ్గాయి.
ఈ అనిశ్చితి ఉన్నప్పటికీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ల (SIP) ద్వారా వచ్చే కాంట్రిబ్యూషన్లు మాత్రం బలంగా ఉన్నాయి. మొత్తం ఈక్విటీ ఫండ్ ఇన్ ఫ్లో మందగమనం ఉన్నప్పటికీ, ఎస్ఐపి ఇన్వెస్ట్‌మెంట్లు మాత్రం రూ. 30,000 కోట్ల మార్కును దాటడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం ఇన్ ఫ్లో రూ. 30,954 కోట్లుగా నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications