• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనా థర్డ్‌వేవ్‌

కరోనా మహమ్మారి మన జీవితాల్లోకి వచ్చి మూడో ఏడాది సమీపిస్తోన్న సందర్భంగా, కోవిడ్-19 వ్యతిరేకంగా జరిపిన పోరాటం నుంచి భారతదేశం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి అనే అంశంపై ఎపిడమాలజిస్ట్ చంద్రకాంత్ లహారియా రాసిన వ్యాసం ఇది.

ఉత్తర భారత రాష్ట్రాల గుండా ప్రయాణించే వారెవరైనా కరోనా ముగిసిపోయిందని భావిస్తే దాన్ని తప్పుగా భావించాల్సిన పని లేదు.

అక్కడి చిన్న పట్టణాల్లో కొంతమంది ప్రజలే మాస్క్‌లు ధరిస్తారు. ఇంకా తక్కువ మంది సామాజిక దూరాన్ని పాటిస్తారు. కరోనా అనేది వారి చర్చల్లో అరుదుగా నిలుస్తుంది. అక్కడక్కడ ఏర్పాటు చేసిన బిల్‌బోర్డులే ఈ కరోనాను గుర్తు చేస్తుంటాయి. అవి కూడా కరోనాను సమర్థవంతంగా నిలువరించినందుకు రాజకీయ నాయకులను అభినందిస్తూ ఏర్పాటు చేసినవే అయి ఉంటాయి.

జాతీయ రాజధాని ఢిల్లీలో, కఠిన నిబంధనల కారణంగా చాలా మంది ప్రజలు మాస్క్‌లు ధరిస్తున్నారు. కానీ రాజధాని నగరం ఇప్పుడు రద్దీగా ఉండే మార్కెట్లతో, రెస్టారెంట్లతో కిటకిటలాడుతోంది.

దేశంలో తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాల వల్ల కరోనా భయం తగ్గినట్లుగా అనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన అల్లకల్లోలం తాలూకు జ్ఞాపకాలను ప్రజలు మరచిపోయినట్లుగా కనిపిస్తున్నారు.

కానీ, కరోనా ఇంకా అంతం కాలేదనేది మాత్రం నిజం. ఐరోపాలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇది చాలా ఆందోళనకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది.

ఈ నేపథ్యంలో అనివార్యంగా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే... భారతదేశంలో కరోనా థర్డ్ వేవ్ ఉంటుందా? ఒకవేళ థర్డ్‌వేవ్ వస్తే, దాన్ని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందా?

భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరగకపోవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే, డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా ఎక్కువమంది భారతీయులు యాంటీబాడీలను కలిగి ఉన్నారు. అలాగే వయోజనుల మొత్తం జనాభాలో నాలుగు నుంచి ఐదు వంతుల మంది పాక్షికంగా టీకాలను తీసుకున్నారు.

కానీ ఇది సంబరపడాల్సిన అంశమేమీ కాదు.

కానీ భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో డెంగ్యూ వ్యాధికి సంబంధించిన తాజా నివేదికలు... ఎమర్జింగ్ లేదా రీ ఎమర్జింగ్ వ్యాధులను గుర్తించడానికి, పరిష్కారం చూపడానికి మన ఆరోగ్య వ్యవస్థ ఇప్పటికీ సన్నద్ధం కాలేదని రుజువు చేస్తున్నాయి.

కరోనా థర్డ్‌వేవ్‌

అసలు సమస్య ఇక్కడే ఉంది. 2020 ప్రారంభంలో మహమ్మారి వచ్చినప్పడు ప్రకటించిన కఠినమైన లాక్‌డౌన్ ... నిధుల లేమి, తక్కువ సిబ్బందితో బలహీనంగా ఉన్న ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వానికి ఒక అవకాశం కల్పిస్తుందని ఆశపడ్డారు.

ఈ లక్ష్యంతోనే తొలి లాక్‌డౌన్‌ను విధించారని అగ్రశ్రేణి రాజకీయ నాయకులు, సీనియర్ ఆరోగ్య విధాన రూపకర్తలు చెప్పారు.

కానీ ఏడాది తర్వాత, కరోనా రెండో వేవ్ భారత్‌ను గడగడలాడించింది. ఆసుపత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్ వంటి ప్రాథమిక సౌకర్యాల లేమి ఏర్పడింది. వైద్య బిల్లులు విపరీతంగా పెరిగాయి. ఇన్సూరెన్సులు పనిచేయలేదు. దీంతో ప్రజలు అప్పులు తీసుకోవడంతో పాటు చాలా కుటుంబాలు తమ ఆస్తులను అమ్ముకున్నాయి.

దాని తర్వాత, 2021 జూలైలో భారత ప్రభుత్వం ఆరోగ్యరంగంలో మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు కోవిడ్-19 ప్యాకేజీని ప్రకటించింది. కానీ కేటాయించిన మొత్తం చాలా తక్కువ అని కొందరు వాదించారు. అదే సమయంలో ఆ ప్యాకేజీతో, తగు చర్యలు తీసుకోవాల్సిన అత్యవసర పరిస్థితి కూడా కనిపించలేదు.

2017లో ప్రకటించిన భారతదేశ జాతీయ ఆరోగ్య విధానం, 2025 నాటికి ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. కానీ వ్యయం మాత్రం తక్కువ స్థాయిలో పెరిగింది. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో 1.3 శాతంగా నమోదైంది. అంటే జాతీయ ఆరోగ్య విధానం నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకునేందుకు ఇంకా మనం చాలా దూరంలో ఉన్నాం.

'ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ప్రజా ఆరోగ్య పథకం' అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారోగ్య బీమా పథకం అని ప్రభుత్వం తరచుగా చెబుతుంటుంది. కానీ అవసరానికి ఈ పథకం పెద్దగా పనికి రాలేదని చాలా వార్తా నివేదికలు సూచిస్తున్నాయి.

ముందున్న సవాలు మరింత పెద్దది. అది మహమ్మారిని మించి ఉంటుంది.

కోవిడ్-19 నియంత్రణపైనే ఆరోగ్య వ్యవస్థలు దృష్టి కేంద్రీకరించడంతో, మిగతా అత్యవసరమైన సేవలకు విఘాతం కలిగింది. భారతదేశంలోని చాలా రాష్ట్రాలలు డెంగ్యూను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడటానికి ఇది ఒక కూడా కారణం.

కరోనా థర్డ్‌వేవ్‌

క్షయ నియంత్రణలో సంవత్సరాల తరబడి సాధించిన ప్రపంచ పురోగతిని కరోనా మహమ్మారి తిప్పికొట్టిందని డబ్ల్యూహెచ్‌వో అక్టోబర్‌లో పేర్కొంది. కరోనా సమయంలో క్షయ వ్యాధికి చికిత్స లభించక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. 2019-2020 కాలంలో క్షయ వ్యాధిని అరికట్టడంలో నమోదైన ప్రపంచ క్షీణతలో భారత్ వాటా 41 శాతంగా ఉందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.

అంటురోగాలు కాని వ్యాధులతో బాధపడుతోన్న వారు కూడా తగిన చికిత్స పొందలేకపోయారు.

భారత్ తీసుకోవాల్సిన 5 చర్యలు

ఈ నేపథ్యంలో, భారత్ అసలు ఏం చేయాలి?

  • ముందుగా ప్రభుత్వం, మహమ్మారి తీరుతెన్నులను నిష్పాక్షికంగా అంచనా వేయడానికి స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించాలి.
  • రెండోది, ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యానికి భారత్ కట్టుబడి ఉండాలి. గత ఐదేళ్లలో ఈ వ్యవస్థ గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వాగ్ధానాలను నెరవేర్చి ఉంటే, భారతదేశం చాలా పటిష్టమైన ఆరోగ్యవ్యవస్థను కలిగి ఉండేది.
  • మూడోది.. భయాందోళనలు, తప్పుడు సమాచారం నివారించడానికి వీలుగా విధాన రూపకర్తలు, వైద్యనిపుణులు, సాంకేతిక నిపుణులు అందరికీ సైన్స్ కమ్యూనికేషన్‌లో శిక్షణ ఇప్పించాలి.
  • నాలుగోది, ప్రాథమిక ఆరోగ్యసంరక్షణ సేవల్లో కరోనా మహమ్మారిని కూడా విలీనం చేయాలి.
  • ఐదవది, దేశంలోని ఆరోగ్య రంగంలో అన్ని స్థాయిల్లో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించేందుకు సవివరమైన ప్రణాళికను రూపొందించాలి. మారుమూల ప్రాంతాలపై మరింత ప్రాధాన్యతను ఇవ్వాలి.

భారత్‌లో మరో కరోనా వేవ్ రావొచ్చు లేదా రాకపోవచ్చు. కానీ అంతకుముందు ఉన్నట్లే ఇతర అంటువ్యాధులు, రోగాల వ్యాప్తి ఇప్పుడు కూడా కొనసాగుతుంది.

ఏ వ్యాధి వ్యాప్తినైనా నియంత్రించడానికి, నిరోధించడానికి ఒక దేశం సన్నద్ధంగా ఉంటే, అది కరోనాను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లే.

అందుకే ప్రతీ వ్యాధికి సంబంధించిన వ్యాప్తిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.

భారత్ ఇంకా సన్నద్ధంగా లేదని చెప్పడానికి, డెంగ్యూ వ్యాప్తిని నియంత్రించడానికి భారత్‌లోని 15 రాష్ట్రాలు ఇబ్బంది పడుతోన్న తీరే నిదర్శనం.

ఇందుకు తగిన చర్యలు తీసుకోవడం ఇప్పుడు అవసరం.

(చంద్రకాంత్ లహారియా పబ్లిక్ పాలసీ, హెల్త్ సిస్టమ్స్ స్పెషలిస్ట్. ఎపిడమాలజిస్ట్.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 

English summary
Is India ready to face the Corona Thirdwave
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X