
భారత్ పరీక్షించిన అధునాతన ఇంటర్‌సెప్టర్ క్షిపణిని ఎదుర్కొనే శక్తి పాకిస్తాన్‌కు ఉందా?
గగనతలంలో ఉన్న అణు క్షిపణులు, యుద్ధ విమానాలను ధ్వంసం చేయగల ఇంటర్‌సెప్టర్ క్షిపణిని భారత్ పరీక్షించింది. ఈ రక్షణాత్మక బాలిస్టిక్ క్షిపణిని డీఆర్‌డీఓ తయారుచేసింది. ఒడిశా సముద్ర తీరంలోని ఒక ద్వీపంలో ఉన్న మిసైల్ ల్యాబ్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. అధికారులు దీనిని 'విజయవంతమైన పరీక్ష'గా అభివర్ణించారు.
ఈ క్షిపణికి 'ఏడీ-1' అని పేరు పెట్టారు.
డీఆర్‌డీఓ, ఫేజ్ 2 ప్రోగ్రామ్ కింద ఏడీ-1 బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్‌ని విజయవంతంగా పరీక్షించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ క్షిపణి రెండు-దశల సాలిడ్ మోటారు ద్వారా నడుస్తుందని, కచ్చితమైన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం భారత్‌లో అధునాతన సాంకేతికతో తయారైన కంట్రోల్ సిస్టం, నావిగేషన్, గైడెన్స్ అమర్చారని ఈ ప్రకటనలో తెలిపారు.
ఈ సాంకేతికత పూర్తిగా కొత్తదని, చాలా తక్కువ దేశాలకు ఇలాంటి అధునాతన పరికరాలను తయారుచేసే సామర్థ్యం ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇది దేశ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని అన్నారు.
భూమి ఉపరితలం లోపల, వెలుపల కూడా 15-25 కి.మీ ఎత్తు నుంచి 80-100 కి.మీ ఎత్తు వరకు అణు క్షిపణులు, యుద్ధ విమానాలను ధ్వంసం చేయగల సామర్థ్యంతో ఈ క్షిపణిని రూపొందించారు.
- 'అణ్వాయుధాలు భారత్ కంటే చైనా, పాకిస్తాన్ల దగ్గరే ఎక్కువున్నాయి'
- విక్రమ్ సారాభాయ్: అణుబాంబును ఎందుకు వ్యతిరేకించారు? రాజీనామా చేయమంటూ ఇందిరా గాంధీ ఎందుకు షాక్ ఇచ్చారు?

ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది?
ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ ఇంటర్‌సెప్టర్ క్షిపణిని ఏదైనా ప్రధాన స్థావరంలో నెలకొల్పే ఆలోచన చేయట్లేదని కొన్ని నివేదికలు తెలిపాయి. దీన్ని అభివృద్ధికి భారీ వ్యయం కావడం ఒక కారణం కావచ్చు.
అంతే కాకుండా, దీన్ని స్థాపిస్తున్నట్టు ప్రకటిస్తే పాకిస్తాన్ మరిన్ని అణుబాంబులను తయారుచేసే ప్రయత్నం చేయవచ్చు. లేదా భారత ఇంటర్‌సెప్టర్ క్షిపణిని విచ్ఛిన్నం చేయగల ఆయుధాన్ని తయారుచేసే పనిలో పడవచ్చు.
భారతదేశంలో ఇంటర్‌సెప్టర్ క్షిపణి తయారీకి చాలాకాలంగా సన్నాహలు జరుగుతున్నాయని, కొన్ని సాంకేతిక ఇబ్బందులు, ఇతర ఖర్చుల కారణంగా దీనిని పూర్తిచేయడం ఆలస్యమైందని రక్షణ రంగ విశ్లేషకుడు రాహుల్ బేడీ చెప్పారు.
డీఆర్‌డీఓ ఫేజ్-1 ప్లాన్ ప్రకారం, గగనతలంలో 2000 కి.మీ పరిధిలో ఉన్న శత్రు క్షిపణులను గుర్తించి నాశనం చేయగల సామర్థ్యం ఉన్న బాలిస్టిక్ క్షిపణులను తయారుచేయవలసి ఉంది.
కానీ, ఇప్పుడు ఫేజ్ 2 కింద పరీక్షించిన ఈ క్షిపణి 5000 కి.మీ. పరిధిలో శత్రు క్షిపణులను ధ్వంసం చేయగలదు.
పాకిస్తాన్, చైనా రెండింటినీ దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించారని రాహుల్ బేడీ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అణ్వాయుధ సామర్థ్యం ఉన్న రెండు దేశాలు పక్కలో బల్లెంలా ఉన్న ఏకైక దేశం భారతదేశం. సహజంగానే, ఈ రెండు దేశాలు భారతదేశ లక్ష్యాలు అవుతాయని రాహుల్ బేడీ అన్నారు.
- రష్యా, అమెరికా, బ్రిటన్, చైనాల్లో అణ్వాయుధాలను నొక్కే బటన్ ఎవరి అధీనంలో ఉంటుంది
- రష్యా నుంచి భారత్కు రావల్సిన ఆయుధాలు తగ్గిపోతున్నాయా... యుక్రెయిన్ యుద్ధం, పశ్చిమ దేశాల ఆంక్షలే కారణమా?

భారత్ సొంత సాంకేతికత
మిసైల్ టెక్నాలజీని ఒక దేశం మరో దేశంతో పంచుకోదని రాహుల్ బేడీ చెప్పారు.
"భారత్ తన సొంత టెక్నాలజీతో ఎన్నో క్షిపణులను తయారు చేసింది. ఇప్పుడు ఈ కొత్త క్షిపణి పరీక్షతో క్షిపణి రేసు ప్రారంభమవుతుంది. పాకిస్తాన్, చైనాలు తమదైన రీతిలో వీటిని ఢీకొట్టగలిగే మిసైల్స్ రూపొందించే ప్రయత్నాలు చేస్తాయి" అని ఆయన అన్నారు.
ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అణు క్షిపణులు, ఎవాక్స్ వంటి యుద్ధ విమానాలను భూమి ఉపరితలం వెలుపల నుంచి ధ్వంసం చేయగల సాంకేతికత అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, చైనా వంటి దేశాలకు మాత్రమే ఉంది.
భారత్ ఇటీవలే రష్యా తయారు చేసిన ఎస్-400 ఉపరితలం నుంచి ప్రయోగించగలిగే క్షిపణులను తన సైన్యంలోకి చేర్చుకుంది.
ఈ అత్యాధునిక రష్యా రక్షణ క్షిపణి గగనతలంలోని యుద్ధ విమానాలు, గూఢచారి విమానాలు, దాడి డ్రోన్‌లు, మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను గుర్తించి నాశనం చేయగలదు.
డీఆర్‌డీఓ అంటే ఏమిటి?
డీఆర్‌డీఓ భారతదేశంలో క్షిపణి, రక్షణ ఆయుధాలను తయారు చేసే అతిపెద్ద సంస్థ.
పృథ్వీ, అగ్ని, త్రిశూల్, ఆకాష్, నాగ్, నిర్భయ్, రష్యా సహకారంతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులను ఈ సంస్థ తయారు చేసింది.
ఈ క్షిపణులన్నీ ఇప్పుడు భారత సైన్యంలో భాగం. భారత సైనిక శక్తిలో ఇవి ప్రముఖమైనవి. భారత్ తయారుచేసిన కొన్ని క్షిపణులను ఇతర దేశాలు కూడా కొనుగోలు చేశాయి.
ఇవి కూడా చదవండి:
- రష్యా సైన్యాన్ని నిత్యం విమర్శిస్తున్న ఈ పుతిన్ 'ఇద్దరు మిత్రులు' ఎవరు?
- ట్విటర్‌లో సగం ఉద్యోగాల కోత - 'మరో దారి లేదు'.. ఎలాన్ మస్క్ సమర్థన
- లాటరీలో రూ. 25 కోట్ల జాక్పాట్ కొట్టిన ఆటో డ్రైవర్కు ఊహకందని కష్టాలు
- డ్రోన్‌లు: భారతదేశం 2030 నాటికి ప్రపంచ డ్రోన్ హబ్గా అవతరిస్తుందా... అవకాశాలు, అవరోధాలు ఏమిటి?
- COP27: వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఏం చెప్పింది, ఏం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)