ఆప్‌ది గొప్ప ఆరంగేట్రమే: పాలనే భిన్నం
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలిసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగి అద్భుతమైన ఫలితాలను సాధించి దేశంలో సంచలనం సృష్టించింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లతో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఢిల్లీలోనూ అతిపెద్ద పార్టీగా అవతరించింది బిజెపి.
అయితే సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ ఓట్లను ఆప్ కొంత చీల్చిందనే చెప్పుకోవచ్చు. అదే సమయంలో బిజెపి పార్టీపై ఆప్ అంతగా ప్రభావం చూపలేదనే చెప్పవచ్చు. 28 అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రభావం ఏ మేరకు ఉందో చాటుకుంది. అయితే ఆప్ పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు నిరాడంబర జీవిత నేపథ్యం ఉన్నవారే కావడం గమనార్హం.

ఊహించని విధంగా 28 స్థానాల్లో ఆప్ గెలుపు
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 29.5 శాతం ఓట్లను గెలుచుకుంది. వలస వచ్చిన వర్గాలు లేదా మైనారిటీ వర్గాల వారే కాకుండా సంపన్న వర్గాల నుంచి కూడా కేజ్రివార్ పార్టీకి మద్దతు లభించినట్లు తెలుస్తోంది. అవినీతి, ద్రవ్యోల్బణం లాంటి అంశాలను తీవ్రంగా పరిగణించిన ప్రజలు ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూపించారు. 2008 ఎన్నికల్లో 43 స్థానాలను సాధించి అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్, ప్రస్తుత ఎన్నికల్లో 8 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. అయితే కేజ్రివాల్ పార్టీ ఇంత భారీ మొత్తంలో సీట్లను కైవసం చేసుకుంటుందని ఓటర్లు అనుకోలేదు.
లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ ప్రభావం ఉంటుందన్న ఆప్
అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా వచ్చిన ఫలితాల నేపథ్యంలో, తమ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందనే ఆలోచనతో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని ఆప్ భావిస్తున్నట్లు కేజ్రివాల్ తెలిపారు. దేశంలోని 350 జిల్లాల్లో తమ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతామని ఆయన అన్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ ఇలాంటి ఫలితాలనే సాధిస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
పాలనే ఆప్‌కి అసలు పరీక్ష
అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ సంపూర్ణ మెజార్టీ 36 స్థానాలకు బదులు 28 స్థానాలు సాధించడం ఒక విధంగా కేజ్రివాల్ అదృష్టంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేజ్రివాల్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇంతకుముందు పరిపాలన విభాగంలో ఎలాంటి అనుభవం లేకపోవడమే. ఆప్ తన ఎన్నికల్లో మెనిఫెస్టోలో పేర్కొన్నట్లు ప్రతీ కుటుంబానికి 700 లీటర్ల ఉచిత నీరు, విద్యుత్ టారీఫ్‌లను సగం వరకు తగ్గించి అందించడం కొంతమేరకు కష్ట సాధ్యంతో కూడుకున్నదిగా చెప్పవచ్చు.
ఢిల్లీలో ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విద్యుత్‌ను తక్కువ ధరలో అందించడం ఆప్ పార్టీకి పెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చు. ఢిల్లీ ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. ఢిల్లీలోనే విద్యుత్ ఉత్పత్తిని చేపట్టాలంటే, అది ఒక్క రాత్రిలో అయ్యే పని కాదు. ఇకముందు ఉగ్రవాద కేసుల్లో ముస్లిం యువతపై అక్రమ కేసులుండవని, సమాజ్ వాది పార్టీలా తమ పార్టీ విఫలం కాదని కేజ్రివాల్ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు.
గత ఏడాది డిసెంబర్ 16న జరిగిన నిర్భయ ఘటన నేపథ్యంలో ఢిల్లీలో మహిళల రక్షణ కోసం కమాండో ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆప్ పేర్కొంది.
అయితే ఢిల్లీలో పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం ఉండదు. కాబట్టి కేజ్రివాల్ హామీ ఎలా నెరవేరుతుందో చూడాలి. ఢిల్లీ పోలీసు కార్యకలాపాలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతాయి. నిర్భయ ఘటనలో నిర్లక్ష్యంగా వహించారనే ఆరోపణలతో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించిన సామాజిక వేత్త అన్నా హజారే ఉద్యమంలో కీలక భూమికి పోషించిన కేజ్రివాల్, పార్టీ పెట్టి మంచి ఫలితాలను సాధించాడు. అయితే అన్నా హజారే, కిరణ్ బేడీ, ఇతర ఉద్యమకారులు కేజ్రివాల్ పార్టీ దూరంగా ఉండడం గమనార్హం.
ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఫలితాలు సాధించడం సవాలే
ఢిల్లీ ఫలితాలనే ఇతర రాష్ట్రాల్లోనూ సాధించడం పెద్ద సవాలుగానే చెప్పుకోవచ్చు. ఆప్ పార్టీ విషయంలో అన్నా హజారే కొన్ని అంశాల్లో విభేదిస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలనుకుంటున్న ఆప్‌కి ఇది కొంతమేర అడ్డుకట్ట వేసే అవకాశమూ ఉంటుంది. అవినీతి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఎక్కువగా ఢిల్లీలోనే కేంద్రీకృతమైంది. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఆప్ ప్రభావం అంతగా చూపించే అవకాశం ఉండకపోవచ్చు. మరోవైపు భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశంలో విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆప్ ప్రభావం భారీగా తగ్గే అవకాశమూ లేకపోలేదు.
పోస్టు పోల్స్ సర్వేల ప్రకారం.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఎక్కువ సీట్లను కట్టబెట్టిన ఓటర్లు కూడా లోక్‌సభ ఎన్నికల్లో మోడీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతోపాటు పోల్చుకుంటూ చాలా భిన్నంగా ఉంటాయి లోక్‌సభ ఎన్నికలు. ఆప్ లోక్‌సభ ఎన్నికలకు వెళ్లదల్చుకుంటే.. భిన్న అంశాలైన వివాదాస్పద కాశ్మీర్, మవోయిస్టు, ఉగ్రవాదులపై యుద్ధం, ఆర్థిక సంస్కరణలు లాంటి వాటిపై తమ వైఖరిని ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఆ పార్టీ ఈ అంశాలపై అంతగా ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదు. కాగా ప్రజాదరణను కోల్పోతే ఎలాంటి పరిస్థితి ఎదుర్కొవాల్సి వస్తుందో యూపిఏ ప్రభుత్వం ఇప్పుడు అలాంటి ఆత్మరక్షణ పరిస్థితిలో పడింది.
లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారిస్తూనే, ఒకవేళ ఢిల్లీలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తమ ఎమ్మెల్యేల సామర్థ్యాలు ఎలా ఉండాలనేదానిపై ఆప్ చర్చలు కొనసాగిస్తోంది. ఒక వేళ ఢిల్లీ ఎన్నికలు మళ్లీ జరిగితే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతోపాటు ఈ ఎన్నికలపై దృష్టి సారించాలని ఆప్ భావిస్తోంది. అప్పుడైనా పూర్తి మెజార్టీ సాధించాలనే వ్యూహాలతో ఉన్నట్లు తెలుస్తోంది.
బిజెపి మళ్లీ అదే తప్పు చేయదు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఆలస్యంగా ప్రచారం ప్రారంభించిన మోడీ, ఒక వేళ మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే ఆ తప్పు చేయకపోవచ్చు. జాతీయ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువగా ఒకే పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆప్ బిజెపి నుంచి క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన ప్రజలు మళ్లీ ఆ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉండకపోవచ్చు.
మమతా బాటలో కేజ్రివాల్?
ప్రారంభించిన ఏడాదిలోపే ఎక్కువ స్థానాలు దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీది విజయంగానే చెప్పుకోవచ్చు. కాగా ఫైనల్‌గా భావించే లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల గడువు మాత్రమే ఉంది. ఎన్నికల్లో గెలుపొందడం అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి పాలనను కొనసాగించడంతో పోలిస్తే భిన్న అంశంగా చెప్పుకోవచ్చు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న మమతా బెనర్జీకి ఎదురవుతున్న అనుభవాన్నే ఆప్ కూడా ఢిల్లీలో ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications