ITR 'On Hold': మీ ఐటీ రిటర్న్ హోల్డ్ అయిందా ? ప్రాసెస్, రిఫండ్ల కోసం.. !
విరాళాలు, విదేశీ ఆస్తులు, డీమ్యాట్ హోల్డింగ్‌లు లేదా అధిక రీఫండ్‌లు క్లెయిమ్ చేసినవారికి సాధారణంగా ఈ అలర్ట్ లు వస్తున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా పలువురు ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ నుంచి తాజాగా ఓ మెసేజ్ వస్తోంది. అది ఐటీఆర్ ఆన్ హోల్డ్ (ITR on Hold). రిస్క్ మేనేజ్ మెంట్ లో భాగంగా మీ ఐటీ రిటర్న్ రిఫండ్ క్లెయిమ్ లు నిలిపివేసినట్లు దాని సారాంశం. దీంతో పన్ను చెల్లింపుదారులు ఒక్కసారిగా గందరగోళానికి గురవుతున్నారు. కొన్ని లోపాల కారణంగా ఆయా రిటర్న్ లు ప్రాసెస్ కాకుండా నిలిపేసినట్లు మెసేజ్ లు అందుతుండటం వారిలో ఆందోళన రేపుతోంది. దీంతో సోషల్ మీడియాలో ఇవే పోస్టులు కనిపిస్తున్నాయి.
పలువురు సక్రమంగా పన్ను చెల్లిస్తున్నవారు సైతం ఈ హెచ్చరిక మెసేజ్ లను అందుకుంటున్నట్లు నిపుణులు చెప్తున్నారు. విరాళాలు, విదేశీ ఆస్తులు, డీమ్యాట్ హోల్డింగ్‌లు లేదా అధిక రీఫండ్‌లు క్లెయిమ్ చేసినవారికి సాధారణంగా ఈ అలర్ట్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వచ్చే అలర్ట్‌లు, రాని ఈ-మెయిల్‌ల ప్రస్తావనలు కూడా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని పన్ను చెల్లింపుదారులు చెప్తున్నారు. దీంతో ఐటీ శాఖపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

అయితే ఐటీ శాఖ కొన్ని రిటర్న్ లను అదనపు తనిఖీల కోసం నిలిపేసిందని మరికొందరు చెప్తున్నారు. ఇప్పుడు రిటర్న్ లు దాఖలు చేసిన వారికి అందుతున్న మెసేజ్ లు నోటీసులు కావని, కేవలం అలర్ట్ లు మాత్రమేనని అంటున్నారు. అప్రమత్తతలో భాగంగానే రిటర్న్‌ను సమీక్ష కోసం గుర్తించారని, డిసెంబర్ 31లోగా సవరించిన రిటర్న్‌ను దాఖలు చేయాలని సూచిస్తున్నారు. దీనిపై సమగ్రంగా ఈ-మెయిల్ పంపుతున్నట్లు ఐటీ శాఖ చెబుతున్నా.. అవి చాలా మందికి అందలేదని తెలుస్తోంది.

ఇలాంటి మెసేజ్ లు వచ్చిన పన్ను చెల్లింపుదారులు..మీ ఐటీఆర్ ను సమీక్షించి, ప్రతి క్లెయిమ్‌కు తగిన పత్రాలు ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ఏదైనా తప్పుగా ప్రకటించినట్లయితే, డిసెంబర్ 31లోగా సవరించిన రిటర్న్‌ను దాఖలు చేయాలి. అంతా సరిగ్గా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.అలాగే, ఏఐఎస్, ఫారం 26ASలో ఏవైనా తేడాలున్నాయో లేదో తనిఖీ చేయాలి. ముఖ్యంగా అధిక విలువ గల లావాదేవీలకు సరైన ఏఐఎస్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి.












Click it and Unblock the Notifications