వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాహ్నవి దంగేటి:: అచ్చం చంద్రుడిపై ఉండే వాతావరణంలో గడిపిన తెలుగమ్మాయి.. ఆమె స్పేస్ కల ఎలా నెరవేరింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

అచ్చం చంద్రుడిని తలపించే కృత్రిమ వాతావరణంలో తెలుగు అమ్మాయి జాహ్నవి దంగేటి శిక్షణ పొందారు. పోలండ్‌లోని అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో ఆమె శిక్షణ తీసుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఆమె గత ఏడాది 'నాసా’ శిక్షణను కూడా పూర్తి చేశారు. చిన్నతనంలో విన్న పేదరాసి పెద్దమ్మ కథలే తనను స్పేస్ సైన్స్ వైపు తీసుకెళ్లాయని ఆమె చెప్పారు.

పంజాబ్‌లో బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న జాహ్నవి తన అంతరిక్ష కలల కోసం చేసిన ప్రయత్నాలు, పొందిన ట్రైనింగ్, అక్కడ ఎదురైన అనుభవాలను బీబీసీతో పంచుకున్నారు.

ఆ వివరాలు ఆమె మాటల్లోనే....

జాహ్నవీ దంగేటి

''గంతలు తీసి చూస్తే స్పేస్‌లో ఉన్నాం’’

విమానం దిగి పోలండ్ ట్రైనింగ్ సెంటర్‌కు వెళ్లగానే, అసలు సమయమే ఇవ్వకుండా కళ్లకు గంతలు కట్టి ఒక కొత్త ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. అక్కడకు వెళ్లగానే ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది. కళ్లకు కట్టిన గంతలతోనే కొండల మధ్య మమ్మల్ని వదిలేశారు. ఒక్కసారిగా అంతా బ్లాంక్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుందో తెలియలేదు.

కళ్లకు కట్టిన గంతలు తీసి చూస్తే స్పేస్‌లో ఉన్నాం. షాక్ అయ్యాం. కాసేపటికి కానీ అర్థం కాలేదు ఇది సిమ్యులేటర్ అని. చంద్రుడిపై ఎలాంటి వాతావరణం ఉంటుందో అచ్చం అలాగే ఇక్కడ సృష్టించారు. 90 శాతం చంద్రుడిపై ఉన్నామనే ఫీలింగ్ వచ్చింది.’

'సూర్యుడు కనిపించడు, స్నానం చేసే అవకాశం ఉండదు’

మేం 15 రోజులు మూన్ సిమ్యులేషన్ ట్రైనింగ్ పొందాం. ఈ శిక్షణలో మా భౌతిక, మానసిక సామర్థ్యాలను పరీక్షించారు. ఉన్న ఆరుగురిని వేర్వేరు ప్రాంతాలలో వదిలేశారు. మా వద్ద ఉన్న ఫోన్లలో ఏ ఒక్కరు ఇంటర్నెట్ వాడినా మిగతా వారికి కట్ అయిపోతుంది. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా తిరిగి బేస్ క్యాంప్‌కు చేరే విధంగా డిజైన్ చేశారు.

మేం మూన్ గ్రావిటీలో ఉన్నాం. అక్కడ స్వచ్ఛమైన గాలి ఉండదు. సూర్యుడు కనిపించడు. స్నానం చేసే అవకాశం ఉండదు. అన్నింటి కంటే ముఖ్యంగా మేం విసర్జించే మలమూత్రాలను మేమే లెక్కకట్టి...అందులో ఉన్న పదార్థాలను పరీక్షించి వాటి లెక్క రాయాలి. రెండుసార్లకు మించి టాయిలెట్‌కు వెళ్లకూడదు.

భూమి మీద ఉన్న వాతావరణంలా కాకుండా మూన్ అట్మాస్పియర్ చాలా భిన్నంగా ఉంటుంది. అస్సలు మనకు కనీస అవగాహన కూడా ఉండదు. మనం ఏ టైమ్‌లో ఉన్నామో కూడా చెప్పలేం. ఫోన్‌లోఉన్న టైమ్‌కు మేం ఉన్నటైమ్‌కు అస్సలు సంబంధం ఉండదు. మాకు మానసిక, శారీరక పరీక్షలు చాలా పెట్టారు. ఒత్తిడిని ఎలా తట్టుకోగలమో పరీక్షించారు.

'మా బ్యాచ్ పేరు ASTRA-45’

నేను 2021 నవంబరులో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యాను. అప్పుడు సిమ్యులేషన్ కాకుండా అంతరిక్షానికి సంబంధించిన ప్రాథమిక అవగాహనపై శిక్షణ పొందాను. ఇప్పుడు పోలండ్‌లో అనలాగ్ ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్‌కు ఎంపికై, విజయవంతంగా శిక్షణ పూర్తి చేశాను. రెండు వారాల పాటు మేం మూన్ సిమ్యులేటర్‌పై శిక్షణ పొందాం. ఇందులో నేను శిక్షణ పొందడంతోపాటు ఆస్ట్రో-బయోలజిస్టుగా టీం సభ్యులకు సేవలందించాను. అది నా కోసం క్రియేట్ చేసిన రోల్. అలాగే సభ్యులంతా కూడా ఏదో ఒక రోల్ ప్లే చేయాలి.

మా బ్యాచ్ పేరు ASTRA-45. ఎందుకంటే ఈ ట్రైనింగ్ సెంటర్‌లో మాది 45వ బ్యాచ్. మా బ్యాచ్‌లో అందరి కంటే చిన్నదానిని నేనే. మిగతా వారంతా వయసులో పెద్దవారు మాత్రమే కాదు, స్పేస్ సైన్స్‌కు సంబంధించి ఏదో ఒక సంస్థలో అనుభవం ఉన్నావారే. నేనే కొత్తగా నేర్చుకుంటున్నదాన్ని. ఈ ట్రైనింగ్ చేస్తుంటే నిజంగానే చంద్రుడిపై ఉన్నానా అనిపించేది’

'నిచ్చెన వేసుకుని చందమామ పైకి ఎక్కేస్తా’

అమ్మ, నాన్న ఇద్దరూ కువైట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. నాకు ఏడాది వయసున్నప్పటి నుంచి బామ్మ దగ్గరే పెరిగాను. మా బామ్మ రోజూ ఆరు బయట మంచంపై అన్నం తినిపిస్తూ.. ఆకాశంలో ఉన్న చందమామని చూపించి కథలు చెప్పేది. చందమామ లోపల ఒక ముసలావిడ ఉంటుందని, ఆమె పేరు పేదరాసి పెద్దమ్మని, ఆమె అందరికీ బహుమతులు ఇస్తుందని చెప్పేది. నేను కూడా అలాగే చేయాలని, అందు కోసం చందమామపైకి వెళ్లాలని అనుకునేదాన్ని.

అలా చందమామపైకి వెళ్లాలనే ఆసక్తి రోజురోజుకి పెరిగింది. పెద్దయ్యాక ఏమవుతావని ఏవరైనా అడిగినా కూడా నిచ్చెన వేసుకుని చందమామపైకి ఎక్కేస్తానని చెప్పేదాన్ని. స్పేస్ సైన్స్‌పై ఆసక్తి పెంచుకుంటూ, దానికి సంబంధించిన విషయాలే ఎక్కువ చదివేదాన్ని. అలా 2021లో నాసా ప్రోగ్రామ్‌, ఇప్పుడు పోలండ్‌లో ఆస్ట్రోనాట్ శిక్షణ పూర్తి చేసుకున్నాను. ఈ శిక్షణ పొందిన మొదటి భారతీయ మహిళను నేనేనని పోలండ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ వాళ్లు చెప్పారు.

'విశాఖ అనిచెప్పి అండమాన్‌ వెళ్లిపోయా’

చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు స్పేస్ సైన్స్ శిక్షణ కోసం అమెరికా, యూరప్ దేశాలతోపాటు కువైట్‌కు కూడా వెళ్లాను. మొత్తం 15 దేశాలు ఒంటరిగానే తిరిగాను. ఇలా చిన్నతనం నుంచే స్వతంత్రంగా ఉండటం అలవాటైంది.

స్పేస్ సైన్స్ విషయాలు తెలుసుకోవడమే కాకుండా.. దీనికి కావలసిన బేసిక్ ట్రైనింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఇంట్లో వారికి విశాఖలో స్విమ్మింగ్ ట్రైనింగ్ అని చెప్పి, అండమాన్ వెళ్లి స్కూబా డైవింగ్‌లో శిక్షణ పొందాను. అంతరిక్షంలో జీరో గ్రావిటీలోనే ఉండాలి.

నీటి అడుగున కూడా గ్రావిటీ ఉండదు. ఆ అనుభవం కోసమే స్కూబా డైవింగ్‌ నేర్చుకున్నాను. స్పేస్‌కు వెళ్లేందుకు నన్ను నేను సన్నద్ధం చేసుకుంటూ కరాటే, స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ వంటివి నేర్చుకున్నాను.

2021 నవంబర్‌ 12న అమెరికాకు వెళ్లి నాసాకు చెందిన స్పేస్‌ అండ్‌ రాకెట్‌ సైన్స్‌ సెంటర్‌లో ఆస్ట్రోనాట్‌ ప్రోగ్రామ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నాను. పది రోజుల్లో జీరో గ్రావిటీ, మల్టీ యాక్సెస్, అండర్‌ వాటర్‌ రాకెట్‌ లాంచ్‌ చేయడంతో పాటు ఎయిర్‌ క్రాఫ్ట్‌ను నడపడం కూడా నేర్చుకున్నాను. మెషీన్‌ కంట్రోలర్‌కు ఫ్లైట్‌ డైరెక్టర్‌గా వేర్వేరు దేశాలకు చెందిన పదహారు మంది బృందానికి నాయకత్వం వహించాను. సెస్మా 170 స్కైహాక్‌ అనే చిన్న రాకెట్‌ని లాంచ్‌ చేశాను. భూమి మీద నుంచి గాల్లోకి ఎగరడం, దాదాపు అరగంట సేపు ఆకాశంలో విహరించడం, తిరిగి ల్యాండ్‌ అవ్వడంలో విజయవంతం అయ్యాను.

చంద్రుడిపై కాలు పెట్టాలనే కోరిక రోజురోజుకూ పెరుగుతోంది. ఆ క్షణాలు ఎప్పుడొస్తాయా అని చాలా ఆశతో ఎదురు చూస్తున్నాను. ముందుగా దీనికి కావలసిన వివిధ శిక్షణలు పొందాలి. చాలా మందిని కలవాలి. ఇప్పటి వరకు చూసిన ప్రపంచం చాలా చిన్నది, ఇంకా చాలా తెలుసుకోవాలి. ఇప్పటికే రెండు శిక్షణలు పూర్తి చేసుకున్నాను. ఇక అంతరిక్షంలోకి వెళ్లే ఏ అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అదే జరిగితే నా ఆనందానికి అవధులుండవు.

'స్పేస్ మ్యాజిక్-స్టార్టప్’

ఇప్పటివరకు చాలా మంది నన్ను సత్కరించారు. చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి ఇండియన్ అని అనిపించుకోవడమే నా లక్ష్యం. నాలా ఈ రంగంలో ముందుకు రావాలని అనేక మంది ఆకాంక్షిస్తున్నారు. నేను చదువుతున్న పంజాబ్‌లోని లవ్లీ యూనివర్సిటీతో పాటు విశాఖ, గోదావరి జిల్లాలలోని కొన్ని కళాశాల్లోకూడా స్పేస్ సైన్స్‌పై అవగాహన తరగతులు చెప్పాను. చాలా మంది ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అయితే మాలాంటి వారిందరికీ ఒక వేదిక కావాలి.

భారత్‌లో స్పేస్ సైన్స్‌పై మరింత అవగాహన కోసం ఈ రంగంలో ఉన్నవారు కృషి చేయాలి. అప్పుడు చాలా మంది స్పేస్ సైన్స్ వైపు ఆకర్షితులవుతారు. అందుకోసం నేను కృషి చేస్తున్నాను. స్పేస్ సైన్స్ ఫీల్డ్‌లో చాలా మంది భారత్‌లో ఉన్నారు. వీరందరు కలిసి ఒక వేదికగా ఏర్పడితే నాలాంటి వారికి బాగుంటుంది. అసలు స్పేస్ సైన్స్‌కు సంబంధించిన నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది, అనుమానాలు వస్తే ఎవరిని అడగాలో కూడా ప్రస్తుతం చాలా మందికి తెలియదు.

ఈ రంగంలో ఉన్నవాళ్లంతా ఒక చోట చేరి భవిష్యత్ జనరేషన్‌కు మార్గనిర్దేశం చేయాలి. స్పేస్ మ్యూజియమ్స్, స్పేస్ సైన్స్ ఫెయిర్స్ లాంటివి నిర్వహించాలి. ప్రస్తుతం అక్కడక్కడ ఇలాంటివి నిర్వహిస్తున్నారు. కానీ, ఇవి ఎక్కువ మందికి చేరువ కావడం లేదు. అందరికీ చేరువ అయ్యేలా ప్రోగ్రామ్స్ చేయాలి. దీని కోసం స్పేస్ మ్యాజిక్ పేరుతో ఒక స్టార్టప్‌ను ప్రారంభిస్తున్నాను.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Jahnavi Dangeti:Telugu girl who spent her time in the moon atmosphere,How did her dream of space come true
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X