డ్రోన్ దాడులు: రాజౌరీలో డ్రోన్లు, ఎగిరే వస్తువులపై నిషేధం, నిఘా వ్యవస్థ మరింత పటిష్ఠం
జమ్మూ: గత కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు చేస్తున్న నేపథ్యంలో అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. దాడుల నేపథ్యంలో రాజౌరి జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్లు, ఇతర చిన్నస్థాయిలో ఎగిరే వస్తువుల అమ్మకాలు, నిల్వ, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు బుధవారం రాజౌరి డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటికే డ్రోన్ కెమెరాలు, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నవాలు వాటిని పోలీసుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించారు. సర్వేలు, మ్యాపింగ్, నిఘా కోసం ప్రభుత్వం వాడే డ్రోన్లపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ఎగిరే వస్తువుల వల్ల జాతి వ్యతిరేకులు దాడికి పాల్పడే అవకాశం ఉందని, దాని వల్ల మనుషుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతున్నట్లు ప్రకటనలో తెలిపింది.

మరోవైపు వరుస డ్రోన్ దాడుల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లోని జాతీయ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. శత్రు డ్రోన్లను ఎదుర్కొనేందుకు జమ్మూలోని వైమానిక స్థావరంలో డ్రోన్ కౌంటర్ వ్యవస్థను బుధవారం ఏర్పాటు చేశాయి. కొత్తగా డ్రోన్ల ద్వారా ముంచుకొస్తున్న ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా వ్యవస్థలో మార్పులు చేస్తున్టన్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగానే జమ్మూ వైమానిక స్థావరంలో రేడియో ప్రీక్వెన్సీ డిటెక్టర్, జామర్లను అమర్చడం సహా డ్రోన్ విధ్వంసక తుపాకులను మోమరించినట్లు పేర్కొన్నాయి.
జూన్ 27న జమ్మూలోని భారత వైమానిక దళ స్థావరంపై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి రోజు రత్నుచక్-కాలుచక్ స్థావరాలపైనా డ్రోన్ దాడికి యత్నించగా.. భారత బలగాలు తిప్పికొట్టాయి. వరుసగా నాలుగో రోజు కూడా జమ్మూలోని మూడు ప్రాంతాల్లో డ్రోన్ల సంచలనం కలకలం రేపింది. భారత్ లోని కీలక స్థావరాలపై డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ దాడులకు పాల్పడుతోందని నిఘా వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications