టార్గెట్.. జమ్మూ కాశ్మీర్: కాంగ్రెస్ బిగ్ ప్లాన్
Jammu Kashmir Assembly election 2024: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది జమ్మూ కాశ్మీర్. దశాబ్ద కాలం తరువాత ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను సైతం కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవలే విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు.. 90. తొలి దశలో పుల్వామా, అనంత్‌నాగ్, షోపియాన్, కుల్గాం, రాంబన్, కిష్తవార్, దోడా జిల్లాల్లో 24 స్థానాలకు సెప్టెంబర్ 18వ తేదీన ఓటింగ్ జరుగనుంది. గందర్‌బాల్, శ్రీనగర్, బుద్గాం, పూంఛ్, రియాసి, రాజౌరి జిల్లాల్లో గల 26 స్థానాలకు సెప్టెంబర్ 25న రెండో దశలో పోలింగ్ ఉంటుంది.

అక్టోబరు 1వ తేదీన చివరి దశలో బండీపొర, కుప్వారా, బారాముల్లా, ఉధంపూర్, జమ్ముూ, సాంబా, కథువా జిల్లాల్లో 40 సీట్లల్లో పోలింగ్ షెడ్యూల్ అయింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అప్నీ పార్టీ, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ, సీపీఎం ఈ ఎన్నికల బరిలో నిల్చోనున్నాయి.
మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 74 జనరల్, ఏడు ఎస్సీ, తొమ్మిది ఎస్టీ అభ్యర్థులకు రిజర్వ్‌డ్ స్థానాలు. మొత్తం 87,09,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 44,46,000 వేల మంది పురుషులు, 42, 62,000 మంది మహిళలు ఉన్నారు. 3.71 లక్షల మంది మొదటి సారిగా ఓటు వేయనున్నారు.
జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో అంచనాలకు మించి సత్తా చాటింది. అయిదు లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ, ఇండియా భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ రెండు చొప్పున సీట్లల్లో విజయం సాధించాయి. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
ఈ పట్టును నిలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా శ్రీనగర్‌లో పార్టీ నాయకులు, కార్యకర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.. ఇతర సీనియర్ నాయకులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలందరూ సొంత కుటుంబ సభ్యుల్లాంటి వారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మొట్టమొదట జమ్మూ కాశ్మీర్‌కు రావాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
దేశ చరిత్రలో స్వాతంత్య్రం అనంతరం అనేక కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలుగా ఆవిర్భవించాయని, జమ్మూ కాశ్మీర్ మాత్రం రాష్ట్ర హోదా నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సార్వభౌమాధికారంలో జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రాతినిథ్యం అత్యవసరమని పేర్కొన్నారు.
ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి మళ్లీ రాష్ట్ర హోదాను తీసుకుని రావాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రాతినిధ్యం ముఖ్యమని తాము భావిస్తోన్నామని, యావత్ దేశానికి ఈ సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేవంతోనే తాము ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.












Click it and Unblock the Notifications