Haryana Polls 2024: హర్యానాలో 37 సీట్ల లెక్కలు తేల్చేది వారే..! బీజేపీకి ముచ్చెమటలు..!
హర్యానాలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం అధికార బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ముఖ్యంగా గత ఐదేళ్లుగా రైతుల ఆందోళనల్ని లెక్కచేయకుండా దూకుడుగా ముందుకు వెళ్లిన ఫలితం వారికి ఇప్పుడు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ అక్కడి బీజేపీ సర్కార్ పై ఆగ్రహంగా ఉన్న రైతులు, అందులోనూ జాట్లు ఇప్పుడు తమ సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు. రాష్ట్రంలో ఏకంగా 37 సీట్లలో లెక్కలు మారిపోబోతున్నాయి.
హర్యానా ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఉన్నప్పటికీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ), జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ) కూడా పలు చోట్ల ప్రభావం చూపబోతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో 37 సీట్లలో జాట్లదే హవా. అలాగే జాట్లు గత కొంతకాలంగా బీజేపీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకం, రైతుల ఆందోళనను కేంద్రం అడ్డుకున్న తీరు, రెజ్లర్లకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహారశైలి ప్రధానంగా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు బీజేపీ కొంప ముంచబోతున్నాయనే సంకేతాలు ఉన్నాయి.

రాష్ట్ర జనాభాలో 27 శాతం మేర జాట్లు ఉన్నారు. వీరు ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ ను సీఎంగా తప్పించి నాయబ్ సైనీకి పగ్గాలు అప్పగించాక అప్పటికే జాట్లలో బీజేపీ పట్ల ఉన్న ఆగ్రహం రెట్టింపైంది. దీన్ని సొమ్ము చేసుకునే క్రమంలో ఒలింపిక్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. దీంతో కాంగ్రెస్ కు ఆమె ఇప్పుడూ స్టార్ ప్లేయర్ గా మారిపోయారు. ఫోగట్ కు జాట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు ఓట్లు వేయించే సామర్ధ్యం ఉంది. దీంతో పాటు బీజేపీలోని జాట్లు సైతం ఆమెకే మద్దతిచ్చేలా ఉన్నారు. ఇవన్నీ బీజేపీకి ఇబ్బందికరంగా మారిపోతున్నాయి.












Click it and Unblock the Notifications