జయ మృతి: ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు ఏప్రిల్ 12: దీపాకు జై!
జయలలిత ప్రాతినిథ్యం వహించిన చెన్నైలోని ఆర్ కే నగర్ లో ఉప ఎన్నికల గంట మోగింది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రాతినిథ్యం వహించిన చెన్నైలోని ఆర్ కే నగర్ లో ఉప ఎన్నికల గంట మోగింది. ఏప్రిల్ 12వ తేదిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎన్నికల కమిషన్ గురువారం వెల్లడించింది.
మార్చి 23వ తేది వరకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు. మార్చి 24వ తేదిన నామినేషన్ పత్రాలు పరిశీలిస్తారు. మార్చి 27వ తేది వరకు నామినేషన్ పత్రాలు ఉపసంహరణకు సమయం ఇచ్చారు. ఏప్రిల్ 12వ తేదిన పోలింగ్ జరగనుంది.

ఏప్రిల్ 17వ తేదిన ఎన్నికల కౌంటింగ్ పూర్తి చేసి ఎవరు విజయం సాధించారో వెల్లడించనున్నారు. జయలలిత మరణంతో ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గం ఖాళీ అయ్యింది. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు.
ఉత్తర చెన్నైలోని ఆర్ కే నగర్ ప్రజలు సైతం అమ్మ వారసురాలు జయలలిత మేనకోడలు దీపానే అని, శశికళ ఇక్కడి నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఓడిస్తామని ఇప్పటికే హెచ్చరించారు. శశికళ జైలుకు వెళ్లడంతో ఆమె అక్క కుమారుడు, అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ. దినకరన్ ఆర్ కే నగర్ నుంచి పోటీ చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications