కుదుటపడని జయలలిత ఆరోగ్యం?: వివరాలు అడిగిన లండన్ డాక్టర్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కోలుకోవడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశముంది. బుధవారం నాడు ఆమె పరిస్థితి కొంత విషమంగా మారడంతో ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులను హుటాహుటిన రప్పించారు. వారు అపోలో ఆసుపత్రికి చేరుకొని వైద్యం అందించారు.
ఎయిమ్స్ నుంచటి వచ్చిన వారిలో హృద్రోగ నిపుణులు సతీష్ నాయక్, మత్తు వైద్య నిపుణులు అంజాన్ త్రికా, ఊపిరితిత్తుల చికిత్స నిపుణులు జీసీ ఖిల్ నానీలు ఉన్నారు. ఇందులో సతీష్ నాయకు గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వ్యక్తిగత వైద్యులు.

ఈ రోజు (శుక్రవారం) కూడా వీరు చెన్నైలోనే ఉంటారు. జయలలిత మరికొంతకాలం ఆసుపత్రిలోనే ఉండాలని చెబుతున్నారు. లండన్ తిరిగి వెళ్లిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రిచర్డ్స్ బాలే కూడా ఆమె తాజా ఆరోగ్య పరిస్థితి పైన గురువారం అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన లండన్ నుంచి వచ్చి మరోసారి జయను పరిశీలించారు.
కాగా, గురువారం రాత్రి బులెటిన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జయలలిత సుదీర్ఘకాలం ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని చెప్పారు. జయకు చికిత్సలో ఎయిమ్స్ వైద్య నిపుణులు ఖిల్నానీ, అంజన్ త్రిఖా, నితీశ్ నాయక్‌లు సలహాలు ఇచ్చారని బులెటిన్‌లో పేర్కొన్నారు.
మరో రెండు రోజులు నిపుణుల బృందం ఇక్కడే ఉండి చికిత్స అందిస్తుందని తెలిపారు. మధుమేహ, వూపిరితిత్తుల చికిత్సకు నిరంతరం కృత్రిమ శ్వాస అవసరమని వివరించారు. నిబ్యులైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
అపోలో వద్ద పూజలు, ఆసుపత్రి వద్దే మకాం
జయకు చికిత్స అందిస్తున్న అపోలో ఆసుపత్రి అమ్మ ఆసుపత్రిగా మారిపోయింది. ఆమె క్షేమం కోరుతూ వేలాదిమంది కార్యకర్తలు నిర్వహిస్తున్న పూజలు, ప్రార్థనలతో అక్కడ సర్వమత ప్రార్థనా మందిరంను తలపిస్తోంది.
ముఖ్యంగా జయ త్వరగా కోలుకోవాలని హిందూ, ముస్లీం,క్రైస్తవులు సామూహికంగా, వేర్వేరుగా ప్రార్థనలు చేస్తున్నారు. కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొడుతున్నారు. ఎంతోమంది కార్యకర్తలు ఆసుపత్రి వద్దే మకాం వేస్తున్నారు. ఎప్పటికప్పుడు జయలలిత ఆరోగ్యం గురించి వింటూ సంతృప్తి చెందుతున్నారు.












Click it and Unblock the Notifications