జయలలితకు అత్యంత నమ్మకస్తురాలు అనూహ్య నిర్ణయం..
నిజానికి షీలా బాలాకృష్ణన్ పదవీకాలం మార్చి 31తో ముగియనుంది. అయితే అంతకుముందే పదవి నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం ఆమెను కోరినట్టుగా సమాచారం.
చెన్నై: తమిళ దివంగత సీఎం జయలలితకు నమ్మినబంటులా పేరొందిన మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలాకృష్ణన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సీఎం సలహాదారు పదవికి ఆమె రాజీనామా చేశారు. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన ఏది వెలువడలేదు. షీలా బాలాకృష్ణన్ సన్నిహితులు మాత్రం ఆమె రాజీనామా నిర్ణయం నిజమేనని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.
నిజానికి షీలా బాలాకృష్ణన్ పదవీకాలం మార్చి 31తో ముగియనుంది. అయితే అంతకుముందే పదవి నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం ఆమెను కోరినట్టుగా సమాచారం. జయలలిత హయాంలో సీఎం కార్యదర్శులుగా పనిచేసిన కేఎన్ వెంకటరామన్, ఏ రామలింగం లాంటి వ్యక్తులను సీఎంవో కార్యాలయం ఇప్పటికే తొలగించిన నేపథ్యంలో.. షీలా బాలాకృష్ణన్ ను కూడా అదే దారిలో సాగనంపడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.

కాగా, ఐఏఎస్ షీలా బాలాకృష్ణన్ 2014లో రిటైర్డ్ అయ్యారు. అయితే షీలా బాలాకృష్ణన్ జయకు అత్యంత నమ్మకస్తురాలు కావడంతో.. ఏరి కోరి మరీ ఆమెను సలహాదారుగా నియమించుకున్నారు. అనార్యోగంతో జయలలిత ఆసుపత్రిలో ఉన్న చివరి రోజుల్లో షీలా బాలాకృష్ణన్ ఒంటిచేత్తో పాలనను పర్యవేక్షించారు.
అయితే జయ మరణానంతరం షీలా బాలాకృష్ణన్ కు ప్రాధాన్యత తగ్గించడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి షీలా బాలాకృష్ణన్ నిర్ణయం మాత్రం తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.












Click it and Unblock the Notifications