ఇది కనిపించట్లేదా?: టి బిల్లుపై జయప్రద, ఎటు వెళ్తారు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) కనిపించిన కేంద్రానికి మహిళా రిజర్వేషన్ బిల్లు కనిపించడం లేదా అని రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద బుధవారం ప్రశ్నించారు. మహిళా రిజర్వేషఖన్ బిల్లు పైన లోకసభలో ఆమె కేంద్రాన్ని నిలదీశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఉన్న శ్రద్ధ మహిళా బిల్లుపై పెట్టక పోవడాన్ని ఆమె ప్రశ్నించారు.
లోకసభలో అనేక బిల్లులను ఆమోదిస్తున్నప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లును మాత్రం కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి ఈ బిల్లు పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? అని ప్రశ్నించారు. భారతీయ మహిళలకు సంబంధించిన మహిళా రిజర్వేషన్ బిల్లును నీరుగారుస్తారా అన్నారు. 15వ లోకసభ పదవీకాలం ముగుస్తున్నా బిల్లు ఊసెత్తకపోవడం దురదృష్టకరమన్నారు.

కాగా, ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న జయప్రద 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆమె రాజమండ్రి నుండి పోటీ చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం రాజమండ్రి స్థానం నుండి పోటీ చేయాలనే ఆసక్తితో ఆమె తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలతో చర్చలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి.
వైయస్సార్ కాంగ్రెసు, రాజమండ్రి, బిజెపిలలో ఖాళీ లేకపోవడం, కాంగ్రెసు ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాల నుండి తప్పుకుంటారని అప్పుడు ప్రచారం జరగడంతో ఆమె కాంగ్రెసు వైపు వెళ్లారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. దీంతో రాజమండ్రి కోసం పట్టుబట్టిన జయప్రదకు ఆ స్థానంపై సోనియా నుండి హామీ వచ్చి ఉంటుందని అందరు భావించారు. దీంతో ఆమె కాంగ్రెసు పార్టీలో చేరినట్లే భావించారు.
అయితే ఇప్పుడు కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకోవడం, సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఆమె ఏం చేస్తారనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కాంగ్రెసులోనే ఉంటారా లేక మరో పార్టీని చూసుకుంటారా అనేది చూడాల్సి ఉంది. అయితే, గతంలో ఆమె తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. దీంతో కాంగ్రెసు పార్టీలో కొనసాగే అవకాశాలున్నాయి. ఇప్పుడు మహిళా బిల్లు విషయంలో కేంద్రాన్ని ఆమె నిలదీయడం గమనార్హం.












Click it and Unblock the Notifications