డీకే శివకుమార్ గుట్టు ఈ పెన్ డ్రైవ్‌లో..
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఒకప్పటి మిత్రపక్షం జనతాదళ్ (సెక్యులర్) మధ్య మాటల యుద్ధం రాజుకుంది. పరస్పరం అవినీతి ఆరోపణలు, విమర్శలు చేసుకుంటోన్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో గత చరిత్రను తవ్వి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి ఆ రెండు పార్టీలు.
ఈ రెండు పార్టీలు గతంలో కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 14 నెలల పాటు కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కొనసాగింది. ఆ తరువాత బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ దెబ్బకు కుప్పకూలింది. ఈ 14 నెలల కాలంలోనే కాంగ్రెస్ పెద్దలు పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతికి పాల్పడినట్లు తాజాగా జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు.

2018-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌ను బసగా చేసుకున్నారని, తన అక్రమాలకు అడ్డాగా వాడుకున్నారంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కుమారస్వామి తిప్పికొట్టారు. ఎవరు, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనే చిట్టా తన వద్ద ఉందని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలన్నీ తన వద్దే ఉన్నాయని స్పష్టం చేశారు.
వాటన్నింటినీ తాను ఈ పెన్ డ్రైవ్‌లో భద్రపరిచానని చెప్పారు. తన జేబులో ఉన్న పెన్ డ్రైవ్‌ను తీసి చూపించారాయన. దీన్ని ఎప్పుడూ తన పాకెట్‌లోనే పెట్టుకుని తిరుగుతుంటానని, ఏ క్షణమైనా దీన్ని బయటపెడతానని కుమారస్వామి తేల్చి చెప్పారు. సాక్ష్యాన్ని జేబులోనే పెట్టుకున్నానని, దీన్ని ఎప్పుడైనా బయటపెడతానని అన్నారు.
ఇప్పటి ఉప ముఖ్యమంత్రి (డీకే శివకుమార్) ఇదివరకు తన కేబినెట్‌లో మంత్రిగా పని చేశారని, అధికారులను బదిలీ చేయడానికి పెద్ద ఎత్తున లంచాలను తీసుకున్నాడని కుమారస్వామి ఆరోపించారు. ఒక బాధ్యత గల మంత్రిగా.. అధికారులను బదిలీ చేసే విషయంలో ఎందుకు లంచాలను తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
లంచాలు తీసుకోవడానికి తానేమీ బిచ్చగాడిని కాదంటూ కుమారస్వామి ఘాటుగా బదులిచ్చారు. తాము కూడా కష్టపడి సంపాదించే వాళ్లమేనని.. కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా, ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా చేసే ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. కాంగ్రెస్ అవినీతి చిట్టా మాత్రం తన వద్ద భద్రంగా ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications