
ప్రశాంత్ కిశోర్ ఎవరి కోసం పని చేస్తున్నారు - ఆ కాంట్రాక్ట్ ఎవరితో కుదుర్చుకున్నారు..!!
పాట్నా: ప్రశాంత్ కిశోర్.. ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టారు. మొన్నటి వరకు తెర వెనుక ఉంటూ రాజకీయాలను నడిపించిన ఈ రాజకీయ వ్యూహకర్త ఇక స్వయంగా తానే ముందుకొచ్చారు. పాదయాత్ర మొదలు పెట్టారు. జన్ సురాజ్ పేరుతో 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్రను చంపారన్ జిల్లాలోని భితిహర్వాలో గల గాంధీ ఆశ్రమం వద్ద ప్రారంభించారు. 12 నుంచి 15 నెలల్లో బిహార్‌లోని అన్ని పల్లెలు, పట్టణాల గుండా ఈ పాదయాత్ర సాగుతుంది. ఏడాదిన్నర పాటు ఆయన జనం మధ్యే గడపబోతోన్నారు.

విమర్శలు షురూ
ప్రశాంత్ కిషోర్ పాదయాత్రపై విమర్శలు మొదలయ్యాయి. బిహార్‌లో అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్రీయ జనతాదళ్ జాయింట్‌గా ఎదురుదాడికి దిగాయి. ప్రశాంత్ కిశోర్ ఎవరి కోసం పని చేస్తోన్నారో తమకు బాగా తెలుసంటూ మండిపడుతున్నాయి. ఏ ఒప్పందం ప్రకారం ఆయన పాదయాత్ర మొదలు పెట్టారో స్పష్టమౌతోందని విమర్శించాయి. ఆయన ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవడానికి రాకెట్ సైన్స్ అవసరం లేదని వ్యాఖ్యానించాయి.

బీజేపీ అజెండాతో..
భారతీయ జనతా పార్టీ అజెండాను ఆయన జనంలోకి మోసుకెళ్తోన్నారని, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకుని రావాలనే ఉద్దేశంతో పని చేస్తోన్నారని జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ అలియాస్ రాజీవ్ రంజన్ సింగ్ విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ బీజేపీ కోసం పని చేస్తోన్నాడంటూ తాము ముందు నుంచీ చెబుతోన్నామని, అదే నిజమైందని ఆరోపించారు. బీజేపీని బలోపేతం చేయడానికే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడని ధ్వజమెత్తారు.

డబ్బులెక్కడివి..?
జన్ సురాజ్ పాదయాత్ర ఖర్చులను ఎవరు భరిస్తున్నారని లలన్ సింగ్ ప్రశ్నించారు. వివిధ పత్రికల కవర్ పేజీలపై ప్రశాంత్ కిశోర్ ప్రకటనలు ఇస్తోన్నాడని, ఆ ప్రచారాలన్నింటికీ అతనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని నిలదీశారు. తన పాదయాత్రకు భారీగా ఖర్చు చేస్తోన్న ప్రశాంత్ కిశోర్‌కు బీజేపీ నాయకులే ఆర్థికంగా సహకారం అందిస్తున్నారని విమర్శించారు. బీజేపీపై విమర్శలు చేయకుండా తమ ప్రభుత్వాన్ని మాత్రమే టార్గెట్‌గా చేసుకున్నాడని ధ్వజమెత్తారు.

రాకెట్ సైన్స్ అక్కర్లేదు..
ప్రశాంత్ కిశోర్ ఏ అజెండాతో జన్ సురాజ్ పాదయాత్ర చేస్తోన్నాడో అర్థం చేసుకోవడానికి అదేమీ రాకెట్ సైన్స్ కాదని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా వ్యాఖ్యానించారు. జార్ఖండ్ నుంచి విడిపోయిన తరువాత బిహార్‌కు బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చిందని ప్రశ్నించారు. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ అప్పట్లో బీజేపీ ప్రకటించిందని, ఇప్పటివరకు దాన్ని ఎందుకు అమలు చేయలేకపోయిందని నిలదీశారు. వాటన్నింటినీ ప్రశాంత్ కిశోర్.. ఎందుకు ప్రస్తావించట్లేదని అన్నారు.