భారత్ బంద్: పశ్చిమ బెంగాల్, బీహార్ సీఎంలు ఝలక్
పాట్నా: పెద్ద నోట్ల రద్దు పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విపక్ష పార్టీలకు మరో చుక్కెదురైయ్యింది. పదే పదే ప్రధాని నరేంద్ర మోడీ మీద మండిపడుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరికి వెనక్కి తగ్గారు.
నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలు నవంబర్ 28వ తేది సోమవారం దేశవ్యాప్త బంద్ కు పిలుపునిస్తూ ఆక్రోశ్ దిన్ ను తలపెట్టాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్ లో తాము పాల్గొనబోమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు.

తాము కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కోల్ కత్తాలో భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తామని మమతా బెనర్జీ చెప్పారు. మమతా బెనర్జీ దారిలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్నజనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) కూడా ఆక్రోష్ దిన్ కు దూరంగా ఉంటామని తాజాగా ప్రకటించింది.
జేడీయూ కీలకనేతలు ఈ నిర్ణయం తీసుకున్నారని జేడీయూ ప్రధాన కార్యాలయం వెల్లడించింది. జేడీఎస్ చీఫ్ నితీశ్ కుమార్ మొదటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని సమర్థిస్తూనే ఉన్నారు. అయితే జేడీయూ పార్టీ పరంగా పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఈ దెబ్బతో ప్రతిపక్షాలు చెయ్యాలనుకున్నభారత్ బంద్ కు మిశ్రమ స్పందన కనపడుతుంది. బీహార్ లో జేడీయూ మిత్రపక్షం అయిన ఆర్జీడీ మాత్రం తాము భారత్ బంద్ లో పాల్గొంటామని తేల్చి చెప్పింది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ఎన్సీపీ, శివసేన, నేషనల్ కాన్ఫెరెన్స్, వైఎస్ఆర్ సీపీ తదితర పార్టీలు బంద్ లో యథావిధిగా పాల్గొంటున్నాయి. మొత్తం మీద మమతా, నితీశ్ కుమార్ లు భారత్ బంద్ కు దూరం కావడంతో భారత్ బంద్ కు పిలుపునిచ్చన ప్రతిపక్షాలు షాక్ కు గురైనాయి.












Click it and Unblock the Notifications