
కంగనా చెంపల కన్న మృదువుగా రోడ్లు ఉంటాయి.. కాంగ్రెస్ నేత కాంట్రవర్సీ కామెంట్స్
అప్పుడప్పుడు నేతలు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తుంటారు. అవును హీరోయిన్లు, హీరోలతో పోలుస్తూ.. దుమారం రేపుతుంటారు. ఇప్పుడు జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అలా చేశారు. రోడ్లను హీరోయిన్‌ల బుగ్గలతో పోల్చడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. తాజాగా మరో నేత అదేరీతిలో కామెంట్స్ చేశారు. జార్ఖండ్‌లో గల జమ్తారా నియోజకవర్గ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ తన నియోజకవర్గంలోని రోడ్ల గురించి కామెంట్ చేశారు.
అతను మాములుగా చేస్తే బాగుండేది. కానీ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బుగ్గల్లా నున్నగా ఉంటాయని అన్నారు. 14 వరల్డ్ క్లాస్ రహదారుల నిర్మాణం త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. తన ఇంట్లో కూర్చుని సెల్ఫీ వీడియో తీసుకుంటూ చెప్పారు. అనంతరం ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వారం ప్రారంభంలోనే కరోనా ఉధృతి సమయంలో మాస్క్‌లు ఎక్కువ సేపు ధరించకూడదని, హానికరం అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి తెరలేపాయి.

ఆ వివాదం సద్దుమణిగిపోక మునుపే తాజాగా మళ్లీ ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. రాజకీయ నాయకులు తమకు ఇష్టమైన నటీమణులతో రహదారులను పోల్చడం కొత్తేమి కాదు. 2005లో ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, నటి హేమమాలిని చెంపలలాగా బీహార్ రోడ్లను సున్నితంగా చేస్తానని వాగ్దానం చేసినప్పుడు పెద్ద దుమారం రేగింది.
గత నెల మహారాష్ట్ర మంత్రి సీనియర్ శివసేన నాయకుడు గులాబ్రావ్ పాటిల్ తన నియోజకవర్గంలోని రోడ్లను హేమా మాలిని చెంపలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో క్షమాపణలు చెప్పవలసి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆన్సారీ వంతు వచ్చింది. పోయి పోయి కంగనా రనౌత్ పేరు ప్రస్తావించి.. దుమారానికి ఆజ్యం పోశారు.