పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డులు చోరి
బెంగళూరు: ప్రముఖ జాతీయ కవి, రచయిత, అధ్యాపకుడు కువెంపు మ్యూజియంలో దొంగలు పడ్డారు. కువెంపునకు చెందిన పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డులతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి మాయం అయ్యారు.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్ళి తాలుకా కుప్పళిలో కువెంపు జన్మించిన కవిశైల భవనంలోనే సోమవారం అర్దరాత్రి దాటిన తరువాత ఈ చోరీ జరిగింది. కుప్పళి వెంకటప్పగౌడ పుట్టప్ప తన రచనలు, కవితలను కువెంపు అనే పేరుతో వ్రాసేవారు.
కువెంపు జాతీయ కవిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కర్ణాటక రాష్ట్ర గీతం అయిన ‘జయ భారత జననియ తనుజితే' అనే పాటను ఆయనే వ్రాశారు. కువెంపు రచనలను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డులతో ఆయనను సత్కరించింది.

కువెంపు మరణించిన తరువాత ఆయన పుట్టి పెరిగిన ఇంటిని మ్యూజియంగా తీర్చిదిద్దారు. ఇక్కడే ఆయన అవార్డులు, ఆయన రచించిన పుస్తకాలు, రచనలు, ఆయనకు సంబంధించిన విలువైన వస్తువులు భద్రపరిచారు.
ఈ భవనం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సోమవారం అర్దరాత్రి దాటిన తరువాత దుండగులు సీసీ కెమెరాల వైర్లు కత్తిరించారు. గుట్టు చప్పుడు కాకుండా తలుపులు పగలగొట్టి విలువైన అవార్డులు ఎత్తుకుని వెళ్లారు.
మంగళవారం విషయం గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కువెంపు మ్యూజియం గుర్తించి అణువణువూ తెలిసిన వారే సీసీ కెమెరాలు పని చెయ్యకుండా చేసి చోరీ చేశారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications