ఆస్తిపై కన్ను: 22 రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపిన పెళ్లికాని అత్తలు!
Jodhpur Crime: సాధారణంగా తల్లి లేని లోటును తీర్చి పిల్లలపై అపారమైన ప్రేమించే మేనత్త బంధాన్ని నలుగురు అక్కాచెల్లెళ్లు అత్యంత దారుణంగా అపహాస్యం చేశారు. కేవలం ఈర్ష్య, ఆస్తిపై ఆశతో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గల నెహ్రూ కాలనీలో శనివారం తెల్లవారుజామున 22 రోజుల పసికందును వారు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది.
జోధ్‌పూర్‌లో శనివారం తెల్లవారుజామున 3.30 నుంచి 4 గంటల మధ్య ఈ దారుణం చోటుచేసుకుంది. పసికందు తల్లి పక్కన నిద్రిస్తుండగా నిందితులైన నలుగురు అత్తలు - మంజు, గీత, మమత, రామేశ్వరి కలిసి ఆ పసికందును గదిలో నుంచి తీసుకెళ్లారు. ఆ నలుగురు కలిసి ముందుగా బిడ్డ గొంతు నులిమి శ్వాస ఆడకుండా చేశారు. ఆ తర్వాత ఆ నవజాత శిశువును నేలపై బలంగా అనేకసార్లు పదే పదే పటాపటా కొట్టారు. ఈ క్రూరత్వం వల్ల ఆ బిడ్డ అక్కడికక్కడే మరణించాడు.

తల్లిని గదిలో బంధించి మరీ..
ఈ ఘోరం జరిగే సమయంలో బిడ్డ తల్లిని, ఇంట్లో ఉన్న మరో అత్తను నిందితులు గదిలో బయటి నుంచి గడియ పెట్టి బంధించారు. శబ్దం విని మేల్కొన్న బిడ్డ తల్లి తన పక్కన బిడ్డ లేకపోవడంతో ఆందోళన చెందారు. ఎలాగోలా తలుపు తెరుచుకుని బయటికి రాగా.. పక్క గదిలో రక్తపు మడుగులో ఉన్న తన బిడ్డను చూసి గట్టిగా అరిచింది. ఈ హత్యను ఆపడానికి ప్రయత్నించిన పసిబిడ్డ మేనమామ కూడా నిందితులను ఆపలేకపోయారు. అయితే ఆయన ఈ దారుణాన్ని వీడియో తీశారు. దానిని పోలీసులు కీలక సాక్ష్యంగా స్వాధీనం చేసుకున్నారు.
ఆస్తిపై కన్ను: క్రూరత్వానికి కారణమిదే!
పోలీసుల దర్యాప్తులో ఈ క్రూరత్వానికి గల అసలు కారణం బయటపడింది. ఆ పసిబిడ్డ తల్లికి ఇప్పటికే ఆరేళ్ల కొడుకు ఉండగా.. ఇప్పుడు మళ్లీ రెండో సంతానంగా అబ్బాయి పుట్టాడు. ఈ విషయం నిందితులైన నలుగురు అత్తలకు నచ్చలేదు. పెళ్లి అయినప్పటికీ, నిందితుల్లో ఇద్దరు అత్తలు తరచుగా తల్లిదండ్రుల వద్దే ఉండేవారు. తండ్రి ఆస్తిలో తమకు వాటా దక్కదేమోనని, వారికి ఇద్దరు కుమారులు ఉండటం వల్ల వారికే ఎక్కువ వాటా వెళుతుందని ఆ నలుగురు అనుమానించారు. ఈ ఈర్ష్య, ఆస్తి ఆశ కలిసి వారికి విషతుల్యంగా మారాయి.
తాంత్రికం ముసుగులో దారుణ హత్య
హత్య తర్వాత నిందితులు బిడ్డ శరీరంపై పసుపు పూసి ఈ హత్యను ఏదో చేతబడి లేదా తాంత్రిక చర్యగా మళ్లించడానికి ప్రయత్నించారు. అయితే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ, వైద్య నిపుణుల బృందం పరిశీలనతో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గొంతు నొక్కడం, నేలపై కొట్టడం మాత్రమే కాకుండా బిడ్డ గుప్తాంగాలను కూడా లాగినట్లు, పసికందుపై దారుణంగా దాడి చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర సంచలనం రేగింది. పసికందు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు నిందితులైన అత్తలు మంజు (22), గీత (25), మమత (22), రామేశ్వరి (27)లను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications