బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్! ఒక్క వారమే సీఎంగా ఫడ్నవీస్: శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే సంచలనం
ముంబై: మహారాష్ట్ర రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఆయనతోపాటు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, నేతలు ఆదిత్య థాక్రే, సంజయ్ రౌత్, ప్రపుల్ పటేల్ కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశానికి కాంగ్రెస్ దూరంగా ఉంది.

ఉదయమే తెలిసింది..
ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. శనివారం ఉదయమే పరిస్థితి మారిపోయిందని అన్నారు. శనివారం ఉదయం 6.30కు రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు తెలిసిందన్నారు. తమకు తెలియకుండానే అజిత్ పవార్ రాజ్ భవన్‌కు వెళ్లారని తెలిపారు. తమ మూడు పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉందని శరద్ పవార్ తెలిపారు. అజిత్ ఉన్న ఎమ్మెల్యేలందరూ తమతో టచ్‌లో ఉన్నారన్నారు.

అనర్హత వేటు తప్పదు
తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శరద్ పవార్ చెప్పారు. కొంతమంది మాత్రమే బీజేపీకి మద్దతిచ్చేందుకు వెళ్లారని, మెజార్టీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని తెలిపారు. బీజేపీకి మద్దతిచ్చిన ఎన్సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

అజిత్ పార్టీకి విరుద్ధంగా.. 10-12మందే..
రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు శనివారం ఉదయం 6.30గంటలకు తెలిసింది. బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం లేదని అన్నారు. అజిత్ పవార్ నిర్ణయం పార్టీకి పూర్తి విరుద్ధమని, పార్టీ క్రమశిక్షణను అజిత్ తప్పాడని ఆయన వ్యాఖ్యానిచారు. అజిత్ పవార్‌తో 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని చెప్పారు. అజిత్ పవార్ కేసులకు భయపడి ఇలా చేస్తున్నారని అనుకోవడం లేదని తెలిపారు.

అజిత్‌పై చర్యలుంటాయ్.. 30 వరకే సీఎంగా ఫడ్నవీస్
అజిత్ పవార్ నిర్ణయాన్ని ఎవరూ సమర్థించడం లేదని శరద్ పవార్ అన్నారు. ఎన్సీపీ ఎప్పుడూ బీజేపీతో చేతులు కలపదని ఆయన స్పష్టం చేశారు. అజిత్ పవార్‌పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని శరద్ పవార్ తేల్చి చెప్పారు. అంతేగాక, నవంబర్ 30న దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ కూలిపోతుందన్నారు. కాగా, అజిత్ పవార్ ఫోన్ చేసి రాజ్ భవన్‌కు రమ్మన్నారని కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో చెప్పడం గమనార్హం.

బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్..
శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ చేసిందన్నారు. బీజేపీ అన్ని రూల్స్ తుంగలో తొక్కిందన్నారు. బీజేపీ కుట్ర బయటపడిందన్నారు. ప్రజా తీర్పును గౌరవించలేదని ఉద్ధవ్ థాక్రే మండిపడ్డారు.

మహా ట్విస్ట్..
శనివారం ఉదయం కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల మద్దతుతో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని శుక్రవారం అర్ధరాత్రి వరకు అంతా అనుకున్నారు. అయితే, అనూహ్యంగా శనివారం ఉదయం ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. అంతేగాక, రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications